దేశవాళి వరి రకాలపై పరిశోధనలు
ABN , Publish Date - Aug 11 , 2025 | 11:27 PM
తూర్పుకనుముల్లో పూర్వం ఆదివాసీలు సాగు చేసిన సంప్రదాయ(దేశవాళి) వరి రకాలను అభివృద్ధి చేసి మేలి రకం వంగడాలను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపడుతున్నారు.
21 రకాల వంగడాలపై అధ్యయనం
ఆశాజనకంగా తెల్లసన్నాలు, కుంకుమశాలి, టెటెన్ ధాన్యం
వచ్చే ఏడాది మేలి రకం వంగడాల గుణగణాలపై పరీక్షలు
చింతపల్లి, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): తూర్పుకనుముల్లో పూర్వం ఆదివాసీలు సాగు చేసిన సంప్రదాయ(దేశవాళి) వరి రకాలను అభివృద్ధి చేసి మేలి రకం వంగడాలను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపడుతున్నారు. ఆదివాసీ రైతుల నుంచి సేకరించిన 21 రకాల వంగడాలపై అధ్యయనం చేసేందుకు గత ఏడాది ప్రయోగాత్మక సాగు చేపట్టారు. దిగుబడి, నాణ్యత ఆధారంగా మూడు రకాలు ఆశాజనకంగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో దేశవాళి రకాలపై పరిశోధనలను కొనసాగిస్తున్నారు. పరిశోధన ఫలితాల ఆధారంగా మేలి రకం వంగడాల నాణ్యత, పోషక విలువలపై అఽధ్యయనం చేస్తామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
తూర్పుకనుముల్లో కొన్నేళ్ల క్రితం ఆదివాసీలు పలు రకాల సంప్రదాయ వరి విత్తనాలను సాగు చేసేవారు. దేశవాళి వరి రకాలకు ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకం పేరుతో ఆదివాసీలు పిలిచేవారు. కొన్ని రకాల వరి విత్తనాలు బాస్మతిని తలపించే సువాసనలు వెదజల్లుతుంటాయి. మరికొన్ని రకాలు మధుమేహం వ్యాధి కలిగిన బాధితులు ఆహారంగా తీసుకున్నా చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచుతుంది. ఈ రకాలు ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో లేవు. అతి తక్కువ మంది ఆదివాసీ రైతులు ఆహారం కోసం ఈ సంప్రదాయ విత్తనాలను తక్కువ విస్తీర్ణంలో సాగు చేసుకుంటున్నారు. ప్రస్తుత రోజుల్లో మధుమేహం, రక్తపోటు బాధితులు ఆహారం కోసం సూపర్‌మార్కెట్లలో లభించే రెడ్, బ్రౌన్, బ్లాక్ రైస్‌ను అధిక ధర చెల్లించి కొనుగోలు చేసుకుని ఆహారంగా తీసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న వివిధ రకాల రైస్ కంటే ఆదివాసీలు పూర్వం సాగు చేసే వరి వంగడాల్లో మానవుల ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ నేపఽథ్యంలో అంతరించిపోతున్న ఆదివాసీల సంప్రదాయ వరి విత్తనాలకు పునరుజ్జీవం ఇచ్చేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించారు.
గిరిజన రైతుల నుంచి సేకరణ
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లా గిరిజన ప్రాంతాల రైతుల నుంచి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు సంప్రదాయ వరి వంగడాలను సేకరించారు. సుమారు 150 మంది రైతుల నుంచి 21 రకాల వంగడాలను సేకరించారు. శాస్త్రవేత్తలకు వంగడాలు అందజేసిన రైతుల వ్యక్తిగత సమాచారం తీసుకున్నారు. ఈ వంగడాలకు ఒక్కొక్క ప్రాంత ఆదివాసీలు ఒక్కో పేరుతో పిలుస్తున్నారు. దీంతో శాస్త్రవేత్తలు వంగడాలకు నంబర్లు కేటాయించి పరిశోధనలు ప్రారంభించారు. 21 వరి వంగడాల్లో కాలభట్, కళ్లజీర, టెటెమ్ ధాన్యం, ఇసుక రవ్వలు-1, 2, సన్నధాన్యం, సొపురు ధాన్యం, తెల్లసన్నాలు, కుంకుమశాలి రకాల్లో మంచి పోషక విలువలతో పాటు ఔషధ గుణాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఐదేళ్ల పాటు పరిశోధనలు
సంప్రదాయ వరి రకాల విత్తనాలపై ఐదేళ్ల పాటు పరిశోధనలు నిర్వహించేందుకు శాస్త్రవేత్తలు ప్రణాళిక సిద్ధం చేశారు. రెండో ఏడాది నుంచి ప్రయోగాత్మక సాగు ఫలితాల ఆధారంగా అధిక దిగుబడినిచ్చే వరి రకాలకు ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించి పోషక విలువ, ఔషధ గుణాలు ఏ స్థాయిలో ఉన్నాయో నివేదిక సిద్ధం చేస్తారు. అలాగే నాణ్యత, దిగుబడులపై కూడా అఽధ్యయనం చేస్తారు. మంచి ఫలితాలు ఇచ్చిన మేలి రకం వంగడాలను ఎంపిక చేసి పరిశోధనలు కొనసాగిస్తారు. 21 రకాలలో కనీసం తుది దశకు 5, 6 మేలి రకం వంగడాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నదని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఆశాజనకంగా మూడు రకాలు
తొలి ఏడాది ప్రయోగాత్మక సాగులో మూడు రకాల దేశవాళి వంగడాలు ఆశాజనకంగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. తెల్లసన్నాలు, కుంకుమశాలి, టెటెన్ ధాన్యం రకాల ఫలితాలు మెరుగ్గా ఉన్నాయి. హెక్టారుకు 6-6.5 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ధాన్యం నాణ్యత, పరిమాణం, సువాసన బాగున్నాయి. తెగుళ్లను తట్టుకునే శక్తి అధికంగా ఉంది. ఈ మూడు రకాలపై మరింత లోతుగా ఈ ఏడాది శాస్త్రవేత్తలు అఽధ్యయనం చేస్తున్నారు.