తుఫాన్ నష్టంపై త్వరలో నివేదిక
ABN , Publish Date - Nov 03 , 2025 | 01:07 AM
జిల్లాలో తుఫాన్‌కు దెబ్బతిన్న పంటలు, ఆస్తి నష్టంపై అంచనాలు వేస్తున్నారని, త్వరలోనే ప్రభుత్వానికి నివేదిస్తామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆదివారం ఆయన స్థానిక ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజుతో కలిసి భోగాపురం వద్ద శారదా నది గట్లను, రాయపురాజుపేటలో కొట్టుకుపోయిన వంతెనను పరిశీలించారు.
శారదా నది గట్ట పటిష్ఠతకు చర్యలు
బీఎన్ రోడ్డు పనులు త్వరలో ప్రారంభం
జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర
చోడవరం, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో తుఫాన్‌కు దెబ్బతిన్న పంటలు, ఆస్తి నష్టంపై అంచనాలు వేస్తున్నారని, త్వరలోనే ప్రభుత్వానికి నివేదిస్తామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆదివారం ఆయన స్థానిక ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజుతో కలిసి భోగాపురం వద్ద శారదా నది గట్లను, రాయపురాజుపేటలో కొట్టుకుపోయిన వంతెనను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, శారదా పరీవాహక ప్రాంతాల్లో పరిస్థితిని పరిశీలించామని, రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. తుఫాన్ నష్టానికి సంబంధించి సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నివేదికలు తెప్పించుకుంటున్నారని, తుఫాన్ బాధితులకు ఇప్పటికే అత్యసవర సహాయ కార్యక్రమాలు పూర్తయ్యాయని చెప్పారు. రహదారులు, ఇరిగేషన్, ఇతర రంగాలకు సంబంధించి దశలవారీగా మరమ్మతు పనులు చేపడతామని తెలిపారు. నదుల గట్లను పటిష్ఠం చేయాల్సిన అవసరం వుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా భోగాపురంలో మహిళా రైతులు మంత్రిని కలిసి, నది గట్టుకు కోతకు గురైన ప్రదేశంలో రక్షణ గోడను నిర్మించాలని, లేకపోతే భవిష్యత్తులో గండి పడి తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పారు. రక్షణ గోడ ఆవశ్యకతను ఎమ్మెల్యే రాజు కూడా మంత్రికి వివరించారు. రాయపురాజుపేటలో ఎర్రిగెడ్డపై వంతెన, రోడ్డు నిర్మాణం, ఊరగెడ్డపై వంతెన నిర్మాణం చేపడితే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే వివరించారు.
బీఎన్ రోడ్డు పనులు నెల రోజుల్లో ప్రారంభం
చోడవరం నియోజకవర్గం పరిధిలో దెబ్బతిన్న బీఎన్ రోడ్డు పనులను నెల రోజుల్లో ప్రారంభించేలా చర్యలు తీసుకున్నామని మంత్రి రవీంద్ర తెలిపారు. సంబంధిత కాంట్రాక్టర్‌తో మాట్లాడామని, ఆర్థిక శాఖ క్లియరెన్స్‌కు సంబంధించి నెలకొన్న సమస్యపై చర్చించామని, వీలైనంత త్వరలో ఈ పనులు ప్రారంభం కావడానికి అవకాశం ఉందని చెప్పారు. మంత్రి వెంట టీడీపీ నాయకులు మల్లునాయుడు, పెదబాబు, పూతి కోటేశ్వరరావు, గవర కార్పొరేషన్ డైరెక ్టర్ బొడ్డేడ గంగాధర్, మత్య్పరాజు, పల్లా అర్జున్, రామునాయుడు, సకురు కోటేశ్వరరావు, భోగాపురం రాము, కొట్టాపు చిన్న, నేమాల హరి తదితరులు వున్నారు.