సాగునీటి వనరులకు మరమ్మతులు
ABN , Publish Date - Apr 05 , 2025 | 11:33 PM
గడచిన ఐదేళ్లు నిర్లక్ష్యానికి గురైన సాగునీటి వనరులకు మోక్షం లభించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో సాగునీటి వనరులను పట్టించుకోకపోవడంతో పొలాలకు నీరందని పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకంలో చెక్‌డ్యామ్‌ల మరమ్మతులకు నిధులు మంజూరు చేసింది. దీంతో పనులు చకచకా సాగుతున్నాయి.

ఉపాధి హామీ పథకంలో నిధులు మంజూరు
ఇప్పటికే కొన్ని చెక్‌డ్యామ్‌ల పనులు పూర్తి
చకచకా సాగుతున్న మరికొన్ని పనులు
రెండో విడతలో రూ.2 కోట్లతో ప్రతిపాదనలు
రైతాంగంలో ఆనందం
కొయ్యూరు, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): మండలంలో 54 చిన్నతరహా సాగునీటి వనరులున్నాయి. వీటిలో 40 చెక్‌డ్యామ్‌లు మరమ్మతులకు గురై పొలాలకు సాగునీరు అందక రైతులు నష్టపోతున్నారు. ఈ విషయాన్ని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్‌ఎంఐ అధికారులు ఉన్నతాధికారులు, పాలకుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. సాగునీటి వనరుల మరమ్మతులకు ప్రతిపాదనలు పలు పర్యాయాలు ప్రభుత్వానికి పంపినా బుట్టదాఖలయ్యాయి. దీంతో చెక్‌డ్యామ్‌లు మరమ్మతులకు నోచుకోకపోవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగునీటి వనరుల మరమ్మతులపై దృష్టిసారించింది. దీంతో మండలంలో తొలి విడతగా కొత్తపల్లి, అన్నవరం, పిడతమామిడి చెక్‌డ్యామ్ అక్విడెక్టు, ఐటీడీఏ కాలనీ, శింగవరం, కొత్తవీధి, శింగరాలపాడు, గధభపాలెం సమీప కొత్తూరు, సోలాబు చెక్‌డ్యామ్‌లకు నిధులు మంజూరు చేసింది. ఒకొక్క చెక్‌డామ్ మరమ్మతులకు రూ.9 లక్షలు, అక్విడెక్టు మరమ్మతులకు రూ.25 లక్షలు చొప్పున జనవరిలో నిధులు మంజూరు చేసింది. అంతేకాకుండా పనులు చేసేందుకు అనుమతులు కూడా ఇచ్చింది. దీంతో ఫిబ్రవరి నెలలో వీటి నిర్మాణ పనులు ఎస్‌ఎంఐ జెఈ రామకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టారు. ప్రస్తుతం అన్నవరం, ఐటీడీఏ కాలనీ, శింగరాలపాడు, కొత్తూరు చెక్‌డ్యామ్‌ల పనులు పూర్తవ్వగా.. మిగిలిన చెక్‌డ్యామ్‌ల పనులు చురుగ్గా సాగుతున్నాయి. పిడత మామిడి అక్విడెక్టు నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. రానున్న వ్యవసాయ సీజన్‌కు ముందుగానే సాగునీటి వనరుల మరమ్మతులు జరుగుతుండడంతో రైతాంగంలో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ విషయమై జేఈ రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలతో మరో 22 చెక్‌డ్యామ్‌ల మరమ్మతులకు రూ. 2 కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు. వీటికి త్వరలో అనుమతులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.