Share News

పంచాయతీల పునర్విభజన

ABN , Publish Date - Dec 24 , 2025 | 01:02 AM

జిల్లాలో పంచాయతీల పునర్విభజన, కొత్త పంచాయతీల ఏర్పాటు ప్రక్రియ మొదలైంది. పంచాయతీ జనాభా, పంచాయతీ కేంద్రం నుంచి శివారు గ్రామాలు వున్న దూరం, ఇతర నిబంధనల మేరకు కొత్త పంచాయతీలను ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు ఆయా పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహిస్తూ ప్రజాభిప్రాయాలను సేకరిస్తున్నారు.

పంచాయతీల పునర్విభజన
రావికమతం మండలం గుడివాడ పంచాయతీ విభజనపై గొడవపడుతున్న ఇరువర్గాలు

జిల్లాలో ప్రక్రియ ఆరంభం

జనాభా, ఆదాయం, శివారు గ్రామాల దూరం ప్రాతిపదిక

ప్రజల ఆమోదం కోసం గ్రామసభలు

అభ్యంతరాలు, అభిప్రాయాల స్వీకరణ

అత్యధిక గ్రామాల్లో ఏకాభిప్రాయం

కొన్నిచోట్ల రాజకీయ ఆధిపత్యం కోసం అభ్యంతరాలు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో పంచాయతీల పునర్విభజన, కొత్త పంచాయతీల ఏర్పాటు ప్రక్రియ మొదలైంది. పంచాయతీ జనాభా, పంచాయతీ కేంద్రం నుంచి శివారు గ్రామాలు వున్న దూరం, ఇతర నిబంధనల మేరకు కొత్త పంచాయతీలను ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు ఆయా పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహిస్తూ ప్రజాభిప్రాయాలను సేకరిస్తున్నారు.

జిల్లాలో ప్రస్తుతం 646 గ్రామ పంచాయతీలు వున్నాయి. ప్రస్తుత పాలకవర్గాల పదవీ కాలం వచ్చే ఏడాది మార్చితో ముస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పంచాయతీ కేంద్రానికి దూరంగా వున్న తమ గ్రామాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని పలు గ్రామాల ప్రజలు, నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో ఎన్నికల నిర్వహణకు ముందే గ్రామ పంచాయతీల పునర్విభజన, కొత్త పంచాయతీల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇటీవల పంచాయతీలకు గ్రేడింగ్‌లు ఇచ్చింది. గ్రేడ్‌-1 36 పంచాయతీలు, గ్రేడ్‌-2లో 18, గ్రేడ్‌-3లో 131, గ్రేడ్‌-4లో 87, గ్రేడ్‌-5లో 324 పంచాయతీలు వున్నాయి. ప్రభుత్వం నుంచి అందిన మార్గదర్శకాల ప్రకారం కొత్తగా పంచాయతీల ఏర్పాటుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. పంచాయతీల పునర్విభజన ప్రక్రియ జరగాలంటే ప్రధానంగా గ్రామ సభలు నిర్వహించాలి. ఈ సభల్లో లేవనెత్తిన అంశాలపై అధికారులు వివరణ ఇవ్వాలి. అందరి ఆమోదం పొందిన తరువాత పంచాయతీ పరిధిలో జనాభా, తలసరి ఆదాయం, ప్రస్తుత పంచాయతీ పరిధిలో ఎన్ని నివాస గృహాలు వున్నాయి, కొత్తగా ఏర్పడే పంచాయతీ పరిధిలోకి ఎన్ని ఇళ్లు వస్తాయి, భౌగోళిక సరిహద్దులు, పంచాయతీ కేంద్రం నుంచి శివారు గ్రామాలు ఎంత దూరంలో వున్నాయి, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల వివరాలపై సమగ్ర నివేదికను రూపొందించాలి. అనంతరం ఉన్నతాధికారులు వీటిని పరిశీలించి, నిబంధనలకు లోబడి కొత్త పంచాయతీల ఏర్పాటుకు ఆమోద ముద్ర వేస్తారు.

కొత్త పంచాయతీల ఏర్పాటుకు వినతులు

చీడికాడ మండలం కోనాం పంచాయతీలో గుడివాడ కేంద్రంగా కొత్త పంచాయతీ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు, ఎంపీడీఓకు గ్రామస్థులు వినతిప్రతం అందించారు. ఇక్కడ ఇంకా గ్రామ సభ నిర్వహించలేదు. మాకవరపాలెం మండలంలో మూడు పంచాయతీల విభజన కోరుతూ గ్రామస్థులు ఎంపీడీఓకు వినతిపత్రాలు అందజేశారు. రోలుగుంట మండలంలో గుర్రాలపాలెం, అంట్లపలెం పంచాయతీల ఏర్పాటుకు గ్రామ సభలు నిరహించారు. మాడుగుల మండలంలో పోతనపాడు అగ్రహారం, జాలంపల్లి, లోవపొన్నవోలు, అవురువాడ, శంకరం, తాటిపర్తి పంచాయతీల నుంచి పలు గ్రామాలను వేరేచేసి కొత్త పంచాయతీలు ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. సబ్బవరం మండలంలో పైడివాడ అగ్రహారం, నారపాడు, అసకపల్లి పంచాయతీల విభజన కోరుతూ స్థానికులు ఎంపీడీఓకు వినతిపత్రాలు అందజేశారు. అచ్యుతాపురం మండలం పూడిమడకను రెండు పంచాయతీలుగా చేయాలని స్థానికులు కోరుతున్నారు. కాగా కొత్త పంచాయతీల ఏర్పాటుపై గ్రామ సభల్లో చేసిన తీర్మానాలు, సూచనలు, సలహాలను సేకరించి త్వరలోనే కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామని జిల్లా పంచాయతీ అధికారి సందీప్‌ పేర్కొన్నారు.

కొత్త పంచాయతీలకు ప్రతిపాదనలు..

చోడవరం: మండలంలోని చాకిపల్లి పంచాయతీ శివారు రామజోగిపాలెం గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. ఇందుకు అనుకూలంగా తీర్మానం చేయడానికి పంచాయతీ పాలకవర్గం సుముఖంగా వుంది.

బుచ్చెయ్యపేట: మండలంలో కొత్తగా మూడు పంచాయతీలు ఏర్పాటయ్యే అవకాశంవుంది. బుచ్చెయ్యపేట పంచాయతీలోని నేతవానిపాలెం గ్రామాన్ని, ఆర్‌.భీమవరం పంచాయతీలోని చినభీమవరం గ్రామాన్ని, పెదపూడి పంచాయతీలోని నాలుగు శివారు గ్రామాలను కలిపి పంగిడి కేంద్రంగా కొత్త పంచాయతీని ఏర్పాటు చేయడానికి ఆయా గ్రామాల ప్రజలు సుముఖత వ్యక్తం చేశారు. కొత్త పంచాయతీలను అధికారికంగా ప్రకటించాల్సి వుంది.

గొలుగొండ: మండలంలో కొత్తగా నాలుగు గ్రామపంచాయతీలను ఏర్పాటు చేయాలని అధికారులు చేసిన ప్రతిపాదనలకు ఆయా గ్రామ పంచాయతీల పాలకవర్గాలు ఆమోదం తెలిపాయి. గొలుగొండ పంచాయతీలో నాలుగు శివారు గ్రామాలు వున్నాయి. వీటిలో శ్రీరాంపురం, కొత్తజోగంపేట గ్రామాలతో శ్రీరాంపురం కేంద్రంగా ఒక పంచాయతీ, పేటమాలపల్లి, 80 కాలనీ గ్రామాలను కలిపి పేటమాలపల్లి కేంద్రంగా మరో పంచాయతీని ఏర్పాటు చేసేందుకు గొలుగొండ పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. పాతమల్లంపేట పంచాయతీ శివారు కొత్తపాలెం, అంటిమానుజోర్లు, ద్వారకానగరం, పోలవరం, బుడ్డపాడు గ్రామాలను కలిపి కొత్తపాలెం కేంద్రంగా కొత్త పంచాయతీగా ఏర్పాటు చేసేందుకు తీర్మానించారు. గుండుపాల పంచాయతీని జి.కొత్తూరు గ్రామాన్ని నూతన పంచాయతీగా ఏర్పాటు చేయనున్నారు. ఏటిగైరంపేట పంచాయతీలోని ఎర్రన్నపాలెం, సీతకండి, ముంగర్లపాలెం, గోరాపాలెం, వెంకటాపురం గ్రామాలతో కొత్త పంచయాతీ ఏర్పాటు కానున్నది.

కె.కోటపాడు: మండలంలో సుమారు మూడున్నర వేల మంది ఓటర్లు, 10 శివారు గ్రామాలు వున్న కింతాడ పంచాయతీని విడదీయాలని ఎప్పటి నుంచో ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడు కొత్తగా మూడు పంచాయతీలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. కింతాడ, బత్తివానిపాలెం, గొంపవానిపాలెం గ్రామాలు ఒక పంచాయతీగా; జోగన్నపాలెం, గంగాభవానిపాలెం ఒక పంచాయతీగా; గొల్లలపాలెం, బొట్టవానిపాలెం కలపి ఒక పంచాయతీగా; రామచంద్రపురం, కుండ్రపువానిపాలెం, రావులమ్మపాలెం, మెరక రామచంద్రపురం గ్రామాలు కలిపి మరో పంచాయతీగా ఏర్పాటు కానున్నాయి.

ఎస్‌.రాయవరం: మండలంలో మూడు కొత్త పంచాయతీల ఏర్పాటుకు ప్రజలు వినతిపత్రాలు సమర్పించడంతో అధికారులు గ్రామ సభలు నిర్వహించి, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. తిమ్మాపురం పంచాయతీ నుంచి గోకులపాడు గ్రామాన్ని, వాకపాడు పంచాయతీ నుంచి బంగారమ్మపాలెం గ్రామాన్ని, పెనుగొల్లు పంచాయతీ నుంచి సోముదేవుపల్లి గ్రామాన్ని విడదీసి కొత్త పంచాయతీలను ఏర్పాటు చేయడానికి ఆయా గ్రామసభలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి.

రావికమతం మండలంలో రగడ

రావికమతం: మండలంలో ఏడు పంచాయతీలను విభజించాలని ఆయా గ్రామాల ప్రజల నుంచి అధికారులకు దరఖాస్తులు అందాయి. వీటిలో ఐదింటికి ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. రెండు పంచాయతీల విభజనపై టీడీపీలో రెండు వర్గాల మధ్య విభేదాలు ఏర్పడడంతో విభజన పక్రియ సందిగ్ధంలో పడింది.

గుడివాడ పంచాయతీ విభజనపై నిర్వహించిన గ్రామ సభలో.. పిల్లవానిపాలెం కేంద్రంగా కొత్త పంచాయతీ ఏర్పాటు చేయాలని ఓ వర్గం కోరగా, వద్దని మరొక వర్గం ఆందోళనకు దిగింది. ఇదే పంచాయతీ పరిధిలోని మట్టవానిపాలెం గ్రామాన్ని కూడా కొత్త పంచాయతీగా ఏర్పాటు చేయాలని అత్యధిక వార్డు సభ్యులు తీర్మానంతో సభకు వచ్చారు. దీంతో అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా వెళ్లిపోయారు.

తట్టబంద పంచాయతీ నుంచి ఎల్‌ఎన్‌పురం, పొర్లుపాలెం, బూరుగుపాలెం, కశిరెడ్డి పాలెం గ్రామాలను విడదీసి ఎన్‌ఎన్‌పురం కేంద్రంగా కొత్త పంచాయతీని ఏర్పాటు చేయాలని సర్పంచ్‌ వర్గం కోరుతుండగా, విభజన వద్దని ఎంపీటీసీ సభ్యుడు, మాజీ ఉప సర్పంచ్‌ వర్గీయులు పట్టుబట్టారు. దీంతో విభజన ప్రక్రియ ప్రస్తుతానికి నిలిచింది.

ఇక మేడివాడ నుంచి అప్పలమ్మపాలెం, జడ్‌.బెన్నవరం నుంచి కిత్తంపేట, మరుపాక నుంచి గొల్లలపాలెం, చీమలపాడు నుంచి చలిసింగం, పి.పొన్నవోలు నుంచి ఆర్‌.కొత్తూరు పంచాయతీ కేంద్రంగా కొత్త పంచాయతీల ఏర్పాటు దాదాపు ఖరారైనట్టు అధికారులు చెబుతున్నారు.

Updated Date - Dec 24 , 2025 | 01:02 AM