Share News

రెన్యువల్‌ ఫైల్స్‌ పెండింగ్‌

ABN , Publish Date - Dec 15 , 2025 | 01:20 AM

ఉమ్మడి విశాఖ జిల్లాలో మెడికల్‌ స్టోర్స్‌ రెన్యువల్‌ (రిటెన్షన్‌) పైళ్లను ఔషధ నియంత్రణ పరిపాలన విభాగం అధికారులు నెలలు తరబడి పెండింగ్‌లో పెట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారులు వ్యవహరిస్తుండడంతో తమ లైసెన్సు లు రదయ్యే ప్రమాదం ఉందని మెడికల్‌ స్టోర్స్‌ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.

రెన్యువల్‌ ఫైల్స్‌ పెండింగ్‌
జిల్లా ఔషధ నియంత్రణ కార్యాలయం

ఉమ్మడి విశాఖ జిల్లాలో మెడికల్‌ స్టోర్స్‌ నిర్వాహకుల ఎదురుచూపులు

ఫైళ్లు కదిపేందుకు ఆసక్తి చూపని ఔషధ నియంత్రణ విభాగం అధికారులు

ఆరు నెలలు దాటితే లైసెన్స్‌ రద్దు అయ్యే ప్రమాదం

నెలలుగా పెండింగ్‌లో పెట్టడంపై యజమానుల ఆవేదన

విశాఖపట్నం, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి విశాఖ జిల్లాలో మెడికల్‌ స్టోర్స్‌ రెన్యువల్‌ (రిటెన్షన్‌) పైళ్లను ఔషధ నియంత్రణ పరిపాలన విభాగం అధికారులు నెలలు తరబడి పెండింగ్‌లో పెట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారులు వ్యవహరిస్తుండడంతో తమ లైసెన్సు లు రదయ్యే ప్రమాదం ఉందని మెడికల్‌ స్టోర్స్‌ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో సుమారు 150 వరకు ఈ తరహా రిటెన్షన్‌ ఫైళ్లు రెండు, మూడు నెలలుగా పెండింగ్‌ లో ఉన్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి విశాఖ జిల్లాలో 4,400 వరకు మెడికల్‌ స్టోర్స్‌ ఉన్నాయి. విశాఖ జిల్లాలో సుమారు మూడు వేలు, అనకాపల్లి జిల్లాలో 1,100, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 300కుపైగా మెడికల్‌ స్టోర్స్‌ ఉన్నాయి. వీటి ఏర్పాటుకు అనుమతి తీసుకున్న సమయంలో నిర్వాహకులు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఇందులో కీలకమైనది రిటెన్షన్‌. మెడికల్‌ స్టోర్‌ ఏర్పాటుకు అనుమతి తీసుకున్న తరువాత ఐదేళ్లకు ఒకసారి రిటెన్షన్‌ చేయించుకోవాలి. ఈ క్రమంలో గడువుపూర్తయిన మెడికల్‌ స్టోర్స్‌ నిర్వాహకులు ఎప్ప టికప్పుడు రిటెన్షన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటారు. ఈ దరఖాస్తులను మూడు నెలలుగా అధికారులు రెన్యువల్‌ చేయకుండా పెండింగ్‌లో పెట్టారు. నెలలు గడుస్తున్నా ఫైళ్లు ముందుకు కదలకపోవడం పట్ల అధికారులను సంప్రదిస్తున్నా ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడం తో వారంతా ఆందోళన చెందుతున్నారు. గడువు దాటిన ఆరు నెలల్లో రిటెన్షన్‌ పూర్తిచేసుకోకపోతే లైసెన్స్‌ రద్దయ్యే ప్రమాదం ఉండడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తీవ్ర ఇబ్బందులు..

డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయంలో రిటెన్షన్‌ ఫైళ్లను పెండింగ్‌లో పెట్టడం వల్ల తాము ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోందని పలువురు పేర్కొంటున్నారు. మెడికల్‌ కంపెనీలు, హోల్‌ సెల్లర్స్‌ నుంచి మందులు కొనుగోలు చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, రిటెన్షన్‌ లేని దుకాణాలకు సరఫరా చేయడం లేదని చెబుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టిసారించి దరఖాస్తులను క్లియర్‌ చేయాలని కోరుతున్నారు.

తొలిసారి పెండింగ్‌..

గతంలో ఎన్నడూ లేనివిధంగా పైళ్లను నెలలు తరబడి పెండింగ్‌లో పెట్టడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. ఈ ప్రక్రియ అత్యంత సులభతరం. రూ.3 వేలు చలానా చెల్లించి ఔషధ నియంత్రణ విభాగ కార్యాలయంలో అందించాలి. వెంటనే దరఖాస్తులు, చలానా చెల్లింపు పత్రాలను పరిశీలించి ఫైళ్లను క్లియర్‌చేసి ఆన్‌లైన్‌లో అనుమతులు జారీచేయాలి. ఇంత చిన్న ప్రక్రియకు అధికారులు నెలల సమయం ఎందుకు తీసుకుంటున్నారో తెలియడం లేదని పలువురు వాపోతున్నారు. ఏదో ఆశించి పైళ్లను పెండింగ్‌లో పెడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

Updated Date - Dec 15 , 2025 | 01:20 AM