Share News

కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు

ABN , Publish Date - Sep 21 , 2025 | 01:16 AM

నగరంలో రోడ్లు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి ఏర్పాటుచేసిన దుకాణాల తొలగింపు ప్రక్రియ మూడో రోజు కూడా కొనసాగింది.

కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు

మూడో రోజు 706 దుకాణాలు...

ఆక్రమణలు తొలగించడంతో విశాలంగా కనిపిస్తున్న రోడ్లు

విశాఖపట్నం, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి):

నగరంలో రోడ్లు, ఫుట్‌పాత్‌లను ఆక్రమించి ఏర్పాటుచేసిన దుకాణాల తొలగింపు ప్రక్రియ మూడో రోజు కూడా కొనసాగింది. ‘ఆపరేషన్‌ లంగ్స్‌’ పేరుతో టౌన్‌ప్లానింగ్‌ విభాగం ఆధ్వర్యంలో ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. శనివారం భీమిలి జోన్‌ పరిధిలోని తగరపువలస ఈఎస్‌ఐ ఆస్పత్రి రోడ్డులో 35, భీమిలి క్లాక్‌టవర్‌ వద్ద 16 ఆక్రమణలను జీవీఎంసీ డీసీపీ కె.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది తొలగించారు. అలాగే జోన్‌-2 పరిధిలో మిధిలాపురి వుడా కాలనీ రోడ్డులో 22, పెదగదిలి, తోటగరువు జంక్షన్లలో 48 ఆక్రమణలను తొలగించారు. జోన్‌-3 పరిధిలో సీతమ్మధార రైతుబజార్‌ నుంచి గురుద్వారా జంక్షన్‌ వరకు 27, ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి నుంచి గురుద్వారా వరకు 15, పోర్టు సేడియం రోడ్డు నుంచి అల్లూరి సీతారామరాజు జంక్షన్‌ వరకు 18 ఆక్రమణలను డీసీపీ మధుసూదనరావు ఆధ్వర్యంలో సిబ్బంది తొలగించారు. జోన్‌-4 పరిధి పాతజైలురోడ్డులోని ఫుడ్‌కోర్టులో 157 దుకాణాలను, అంబేడ్కర్‌ కూడలి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌ వరకు 32 దుకాణాలను, అల్లిపురం రోడ్డులో రైల్వే రిజర్వేషన్‌ కౌంటర్‌ వరకు ఆరు ఆక్రమణలను ఏసీపీ ఝాన్సీ ఆధ్వర్యంలో తొలగించారు. జోన్‌-5 పరిధిలో ఊర్వశి జంక్షన్‌ వద్ద 36 ఆక్రమణలను, ఇంకా సింహాచలం, వేపగుంట జంక్షన్‌, గాజువాక మెయిన్‌రోడ్డు, వంటిల్లు జంక్షన్‌, కణితిరోడ్డు, సుంకరమెట్ట, నెహ్రూ చౌక్‌ వంటి ప్రాంతాల్లో కూడా ఆక్రమణల తొలగింపు చేపట్టారు. ఆక్రమణల తొలగింపుతో సీతమ్మధార మెయిన్‌రోడ్డు, ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రి రోడ్డు, పెదగదిలి బీఆర్‌టీఆర్‌ రోడ్డు, తదితర రహదారులు విశాలంగా మారాయి. ఆయా రోడ్లపై వాహనాల రాకపోకలు సజావుగా సాగడంతోపాటు పాదచారులు ఫుట్‌పాత్‌లపై నడుచుకుంటూ వెళ్లడం కనిపించింది.


24 లేదా 25న విజయవాడలో డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు

విశాఖపట్నం, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి):

మెగా డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈనెల 24 లేదా 25వ తేదీన విజయవాడలో నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ నుంచి శనివారం జిల్లా విద్యా శాఖకు సమాచారం వచ్చింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 19న అమరావతిలో నియామక పత్రాలు అందజేయాల్సి ఉంది. అయితే అమరావతిలో వర్షాల కారణంగా కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఈనెల 24 లేదా 25న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులను విజయవాడ తీసుకువెళ్లడానికి ఏర్పాట్లు చేయాలని ఉన్నధికారులు ఆదేశించారు. ఇందుకోసం సుమారు 300 మందికిపైగా టీచర్లు అవసరం. అయితే అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల నుంచి 80 మంది టీచర్లను పంపించాలని ఆయా జిల్లాల డీఈవోలకు విశాఖ డీఈవో ఎన్‌.ప్రేమ్‌కుమార్‌ లేఖ రాశారు. అభ్యర్థులను విజయవాడకు పంపేందుకుగాను విశాఖ విమల విద్యాలయంలో రిజిస్ట్రేషన్‌, తదితర విధులు నిర్వహించే టీచర్ల వివరాలను ఆదివారం సాయంత్రంలోగా పంపాలని లేఖలో పేర్కొన్నారు.


17 మంది శానిటరీ సెక్రటరీలకు మెమోలు

క్లాప్‌ వాహనాలను పర్యవేక్షించేందుకు ఉదయం ఆరు గంటలకల్లా

విధులకు హాజరుకావాలని ఇటీవల అధికారుల ఆదేశాలు

జోన్‌-6లో ఆ సమయానికి రానివారికి షోకాజ్‌

విశాఖపట్నం, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి):

నగరంలో పారిశుధ్య నిర్వహణపై జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ ఆదేశాలను జోనల్‌ కమిషనర్లు ఆచరణలో పెడుతున్నారు. ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించే క్లాప్‌ వాహనాల పనితీరును పర్యవేక్షించే బాధ్యతను వార్డు శానిటరీ కార్యదర్శులకు అప్పగించాల్సిందిగా జోనల్‌ కమిషనర్‌లను కమిషనర్‌ ఆదేశించారు. ఇందుకోసం కార్యదర్శులు ప్రతిరోజూ ఉదయం ఆరు గంటల్లోపు విధులకు హాజరుకావాలి. ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ సిస్టమ్‌లో హాజరు వేసుకోవాల్సి ఉంటుంది. ఆరుగంటల్లోపు విధులకు హాజరుకాని వారిపై చర్యలకు జోనల్‌ కమిషనర్లు ఉపక్రమిస్తున్నారు. జోన్‌-6 పరిధిలో శనివారం ఉదయం ఆరు గంటల సమయానికి విధులకు హాజరుకాని 17 మంది కార్యదర్శులకు జోనల్‌ కమిషనర్‌ శేషాద్రి షోకాజ్‌ జారీచేశారు. విధులకు హాజరవ్వడంలో నిర్లక్ష్యం వహించినందున, మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలంటూ నోటీసులో పేర్కొన్నారు. దీనిపై జిల్లా వార్డు, గ్రామ సచివాలయ కార్యదర్శుల సంఘం నేత బండారు శ్రీనివాసరావు ఒక ప్రకటన విడుదల చేశారు. సాంకేతిక కారణాలతో హాజరు వేయడంలో ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. అయినప్పటికీ కార్యదర్శులకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వడం సరికాదని, అధికారులు వాటిని వాపసు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Sep 21 , 2025 | 01:16 AM