పార్కుల్లో ఆక్రమణల తొలగింపు
ABN , Publish Date - Jul 16 , 2025 | 01:23 AM
జీవీఎంసీ పరిధిలోని పార్కుల్లో ఆక్రమణలను తొలగించే కార్యక్రమానికి మంగళవారం టౌన్‌ప్లానింగ్ అధికారులు శ్రీకారం చుట్టారు.
జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ స్పెషల్‌డ్రైవ్
బింద్రానగర్ పార్కులోని షెడ్‌లు కూల్చివేత
ఫేకర్ లేఅవుట్‌లోని పార్కు స్థలాన్ని చదును చేయించిన చీఫ్ సిటీ ప్లానర్
విశాఖపట్నం, జూలై 15 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ పరిధిలోని పార్కుల్లో ఆక్రమణలను తొలగించే కార్యక్రమానికి మంగళవారం టౌన్‌ప్లానింగ్ అధికారులు శ్రీకారం చుట్టారు. పార్కుల కబ్జాపై ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు ప్రచురిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మేయర్ పీలా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌లు టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ, ఇంజనీరింగ్ విభాగాలతో పలుమార్లు సమావేశమయ్యారు. జీవీఎంసీ పరిధిలో ఎన్ని పార్కులు ఉన్నాయి?, ఎన్ని ఓపెన్‌స్పేస్‌లు ఉన్నాయి?, ఎన్ని కబ్జాకు గురయ్యాయి?, ఎన్ని కోర్టు కేసుల్లో ఉన్నాయనే దానిపై బుధవారం నాటికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజాఫిర్యాదుల వేదికలో కూడా పార్కుల ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులే అధికంగా రావడంతో వాటన్నింటిపైనా తక్షణం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని టౌన్‌ప్లానింగ్ అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు ఎనిమిదో వార్డు పరిధి బింద్రానగర్ లేఅవుట్‌లోని పార్కులో ఏళ్ల కిందట పలువురు నిర్మించిన షెడ్‌లను టౌన్‌ప్లానింగ్ అధికారులు మంగళవారం యంత్రాలతో కూల్చివేశారు. అలాగే 28వ వార్డు పరిధి ఫేకర్ లేఅవుట్‌లోని పార్కు స్థలాన్ని కొందరు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నట్టు తెలియడంతో ‘మరో పార్కుకు ఎసరు’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ మంగళవారం కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన కమిషనర్, మేయర్‌లు తక్షణం పార్కులోని ఆక్రమణలు, పొదలను తొలగించి చదునుచేసి, అభివృద్ధికి ప్రతిపాదనలు పంపించాలని టౌన్‌ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. చీఫ్ సిటీప్లానర్ ఎ.ప్రభాకరరావు, జోన్-4 ఏసీపీ ఝాన్సీ సిబ్బందితో కలిసి ఫేకర్ లేఅవుట్ పార్కుకు వెళ్లారు. అక్కడ పొదలు, చెత్తాచెదారాలను యంత్రాలతో తొలగించి చదును చేయించారు. పార్కులోపల షెడ్‌ను ఎవరు నిర్మించారో ఆరా తీశారు. పార్కులో కొంతస్థలం ఆక్రమణకు గురైనట్టు అనుమానాలు ఉండడంతో ఈటీఎస్ సర్వే చేయించాలని అధికారులు నిర్ణయించారు. మిగిలిన పార్కుల్లో ఆక్రమణల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుందని సిబ్బంది చెబుతున్నారు.
వర్షాకాలంలో 7,00,000 మొక్కలు పంపిణీ
సామాజిక వన విభాగం లక్ష్యం
పాఠశాలలకు రెండు లక్షలు
రైతులకు ఉచితంగా ఐదు లక్షల నీలగిరి, సరుగుడు మొక్కలు
ఈ ఏడాది మొత్తమ్మీద పది లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్న జిల్లా యంత్రాంగం
విశాఖపట్నం, జూలై 15 (ఆంధ్రజ్యోతి):
ప్రస్తుత వర్షాకాలంలో నాటేందుకు వివిధ రకాలకు చెందిన 7.2 లక్షల మొక్కలను పంపిణీ చేయాలని అటవీ శాఖకు చెందిన సామాజిక వన విభాగం లక్ష్యంగా పెట్టుకుంది. పాఠశాలల విద్యార్థులకు ఇప్పటికే రెండు లక్షల మొక్కలు అందజేసింది. ఇక రైతుల కోసం ఉపాధి హామీ పథకం కింద నర్సరీల్లో దాదాపు ఐదు లక్షల వరకూ సరుగుడు, నీలగిరి మొక్కల పెంపకం చేపట్టారు. సరుగుడు, నీలగిరి మొక్కలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం రైతులు భూమికి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జెరాక్స్ కాపీలు, పంచాయతీ కార్యదర్శి నుంచి లేఖ తీసుకుని సమీపంలో నర్సరీలకు వెళ్లాలని ఇన్‌చార్జి డీఎఫ్‌వో జి.మంగమ్మ తెలిపారు. జిల్లాలో భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి మండలాల్లో రైతులు ఎక్కువగా సరుగుడు పెంపకంపై మొగ్గు చూపుతున్నారు. తీరానికి ఆనుకుని ఉన్న గ్రామాలకు చెందిన రైతులు సరుగుడుతో పాటు నీలగిరి నాటుతున్నారు. కాగా పాఠశాలలకు పంపిణీ చేయగా మిగిలిన రకాలను జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలలో నాటేందుకు సిద్ధం చేశారు. స్వచ్ఛంద సంస్థలకు కూడా మొక్కలు అందజేయాలని నిర్ణయించారు. కాగా జిల్లాలో ఈ ఏడాది పది లక్షల మొక్కలు నాటాలని అధికార యంత్రాంగం లక్ష్యంగా నిర్ణయించింది. ఈ మొత్తం అటవీ శాఖ పరిధిలోని నర్సరీలు, ప్రైవేటు నర్సరీల నుంచి సమీకరించాలని అధికారులు నిర్ణయించారు.