అన్నదాతకు ఊరట
ABN , Publish Date - Dec 28 , 2025 | 12:24 AM
ఈ ఏడాది అన్నదాతలకు వాతావరణం అనుకూలించింది. దీంతో వరి దిగుబడి బాగానే వచ్చింది.
ఈ ఏడాది ఆశాజనకంగా వరి దిగుబడి
ధాన్యం కొనుగోలు కేంద్రాలకే విక్రయించేందుకు రైతుల మొగ్గు
వ్యాపారుల కంటే అధిక ఇస్తుండడమే కారణం
అధిక వర్షాలతో తగ్గిన తెగుళ్ల బెడద
గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మూతతో పడిపోయిన చెరకు సాగు
కూరగాయల సాగుకు దెబ్బ
చోడవరం, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది అన్నదాతలకు వాతావరణం అనుకూలించింది. దీంతో వరి దిగుబడి బాగానే వచ్చింది. జిల్లాలో ఖరీఫ్ సీజన్ ఆరంభంలో వర్షాలు ఆలస్యం అయినప్పటికీ, ఆ తరువాత పుష్కలంగా కురిసిన వర్షాలు కలిసొచ్చాయి. అధికంగా కురిసిన వర్షాలకు అక్కడక్కడా కొన్ని ప్రాంతాల్లో వరి పంట నీటమునగడం, కూరగాయల సాగు దెబ్బతినడం మినహాయిస్తే ఈ సీజన్ వ్యవసాయానికి బాగానే సహకరించిందని చెప్పాలి.
జిల్లాలో పంటల విస్తీర్ణం మొత్తం పంటల విస్తీర్ణం 71,417 హెక్టార్లు కాగా, అందులో 54,465 హెక్టార్లలో ఈ ఏడాది వరిసాగు వేశారు. 2,500 హెక్టార్లలో చెరకు సాగు పోగా, మినుములు, రాగులు, సజ్జలు, ఇతర కూరగాయల పంటలు 14,452 హెక్టార్లలో సాగు చేశారు. కాగా గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఈ సీజన్‌లో మూతపడడంతో ఆ ప్రభావం చెరకు సాగుపై పడింది. ఇది మినహా మిగిలిన వాతావరణం అన్నదాతలకు అనుకూలంగానే సాగింది. ఇక ఈ ఏడాది పుష్కలంగా కురిసిన వర్షాలకు పంటలపై తెగుళ్ల ప్రభావం బాగా తగ్గిందని వ్యవసాయాధికారులు తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలో ప్రధానంగా సాగులో ఉండే పంటల్లో వరి, తరువాత స్థానంలో చెరకు, ఇతర పంటలు ఉన్నాయి.
వరికి కలిసొచ్చిన వర్షాలు
ఈ ఏడాది వరికి పుష్కలంగా కురిసిన వర్షాలు బాగానే ఉపకరించాయని చెప్పాలి. ఈ ఏడాది జూలై నెల నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకూ వర్షాలు కురుస్తూనే ఉండడంతో పంటపొలాలు నీటితో కళకళలాడాయి. రిజర్వాయర్లు నిండుకుండల్లా దర్శనమిచ్చాయి. అన్నదాతలకు ఆశించిన స్థాయులో ఈ ఏడాది వర్షాలు కురవడంతో మెట్ట ప్రాంతాల్లో సైతం ఈ ఏడాది వరి దిగుబడి బాగానే వచ్చింది. తెగుళ్ల బెడద లేకపోవడంతో జిల్లాలో సాధారణ దిగుబడి ఎకరానికి 25 నుంచి 30 క్వింటాళ్ల వరకూ వస్తుందని అంచనా వేస్తున్నారు. రిజర్వాయర్లు, చెరువుల కింద సాగులో వేసిన భూములలో ఈ స్థాయిలో దిగుబడి ఉండగా, మెట్ట ప్రాంతాల్లో గతంలో కంటే మెరుగ్గా 18 నుంచి 20 క్వింటాళ్ల వరకూ దిగుబడి రావడంపై రైతులు ఆనందం వ్యక్తం అవుతున్నది.
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వైపే రైతుల మొగ్గు
గత ఏడాది కంటే ఈ ఏడాది గ్రామీణ ప్రాంతంలో ప్రైవేటు వ్యాపారులు ఇస్తున్న ధర కంటే, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఎక్కువగా వస్తుండడంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే ధాన్యం విక్రయించడానికి మొగ్గు చూపిస్తుండడం విశేషం. ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ముందుగానే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు మేలిమిరకం క్వింటాల్‌కు రూ.2,389 ధర ఇస్తుండగా, సాధారణ రకం క్వింటాల్ రూ.2,369 ధర ఇస్తున్నది. ఇదే సమయంలో ప్రైవేటు వ్యాపారులు క్వింటాల్ రూ.2 వేలలోపే ధర ఇస్తామని చెబుతుండడంతో, ఎక్కువ మంది రైతులు ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలకే ధాన్యం విక్రయించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
తగ్గిపోయిన చెరకు సాగు
వరి విస్తీర్ణం తరువాత జిల్లాలో అత్యధికంగా సాగయ్యే చెరకు పంట మాత్రం ఈ ఏడాది బాగా తగ్గిపోయింది. గతంలో 12 వేల హెక్టార్లలో ఉండే చెరకు సాగు చెరకు రైతులకు బకాయిలు సకాలంలో చెల్లించలేకపోవడం, పంచదార ధరలకు గిట్టుబాటు ధర లేకపోవడం వంటి పరిణామాలతో క్రమంగా తగ్గుముఖం పడుతూ వస్తున్నది. గత మూడేళ్లుగా గోవాడ షుగర్ ఫ్యాక్టరీ నడుస్తుందో లేదో తెలియని పరిస్థితుల కారణంగా క్రమేపీ చెరకుసాగు గత ఏడాదికి 4 వేల హెక్టార్లకు పడిపోగా, ఈ ఏడాది 2,500 పడిపోయింది. చెరకు సాగును వదిలిపెడుతున్న రైతులు సరుగుడు వంటి ప్రత్నామ్నాయ పంటల వైపు మరలిపోతున్నారు. ఫలితంగా చెరకు సాగు నామమాత్రంగా మారిపోతున్నది.
కూరగాయల సాగుకు దెబ్బ
భారీగా కురిసిన వర్షాలు వరితో పాటు ఇతర పంటలకు మేలు చేసినప్పటికీ, కూరగాయల పంటలకు నష్టం కలిగింది. రోజుల తరబడి పట్టిన ముసురుతో ఈ ఏడాది కాస్త బెండ తోటలు మినహా వంగ, టమాటా, బొప్పాయి, ఆనప, మిరప తోటలకు బాగా నష్టం వాటిల్లింది, అలాగే ఆకు కూరలు కూడా ఈసారి దెబ్బ తగిలింది. వర్షాలు తగినంత పడడంతో ఈ ఏడాది అపరాల పంటలకు వాతావరణం అనుకూలించడంతో దిగుబడులు ఆశాజనంగానే ఉంటాయన్న ఆశాభావం రైతుల్లో వ్యక్తమవుతున్నది. మొత్తం మీద ఈ ఏడాది వ్యవసాయం అన్నదాతలకు ఆశాజనకంగానే ఉంది.