ఆర్‌ఓఆర్ కక్షిదారులకు ఊరట
ABN , Publish Date - May 14 , 2025 | 12:54 AM
భూ హక్కుల చట్టం ప్రకారం దాఖలైన కేసుల్లో అనకాపల్లి డీఆర్‌వో కోర్టు చుట్టూ తిరుగుతున్న కక్షిదారులకు ఊరట లభించింది. ఇకనుంచి అనకాపల్లి వెళ్లాల్సిన అవసరం లేకుండా పాత పద్ధతిలో నర్సీపట్నం ఆర్డీవో కోర్టులోనే పరిష్కారం కానున్నాయి. పట్టాదారు పుస్తకాల వివాదాలన్నీ ఆర్‌ఓఆర్ చట్టం పరిధిలోకి వస్తాయి. రెండేళ్ల క్రితం వరకు డివిజన్‌లోని ఆర్‌ఓఆర్ కేసులు ఆర్డీవో కోర్టులో పరిష్కారం అయ్యేవి. అయితే గత వైసీపీ ప్రభుత్వం 2023లో ఆర్డీవో కోర్టుని పూర్తిగా రద్దు చేసింది.
భూముల కేసులు ఇక నర్సీపట్నం ఆర్డీవో కోర్టులోనే పరిష్కారం
ఆర్‌ఓఆర్ కేసులను డీఆర్‌వో కోర్టుకు బదిలీ చేసిన గత ప్రభుత్వం
అందరూ అనకాపల్లి వెళ్లాల్సిన పరిస్థితి
ప్రజల నుంచి కూటమి ప్రభుత్వానికి వినతులు
మళ్లీ పాత పద్ధతిలోనే నర్సీపట్నం ఆర్డీఓ కోర్టుకు..
ఈ నెల 24 నుంచి అమలు
డివిజన్‌లోని 12 మండలాల కక్షిదారులకు తప్పిన వ్యయప్రయాసలు
నర్సీపట్నం, మే 13 (ఆంధ్రజ్యోతి): భూ హక్కుల చట్టం ప్రకారం దాఖలైన కేసుల్లో అనకాపల్లి డీఆర్‌వో కోర్టు చుట్టూ తిరుగుతున్న కక్షిదారులకు ఊరట లభించింది. ఇకనుంచి అనకాపల్లి వెళ్లాల్సిన అవసరం లేకుండా పాత పద్ధతిలో నర్సీపట్నం ఆర్డీవో కోర్టులోనే పరిష్కారం కానున్నాయి. పట్టాదారు పుస్తకాల వివాదాలన్నీ ఆర్‌ఓఆర్ చట్టం పరిధిలోకి వస్తాయి. రెండేళ్ల క్రితం వరకు డివిజన్‌లోని ఆర్‌ఓఆర్ కేసులు ఆర్డీవో కోర్టులో పరిష్కారం అయ్యేవి. అయితే గత వైసీపీ ప్రభుత్వం 2023లో ఆర్డీవో కోర్టుని పూర్తిగా రద్దు చేసింది. పట్టాదారు పాసు పుస్తుకాలకు సంబంధించిన కేసులను అనకాపల్లి జిల్లా రెవెన్యూ అధికారి కోర్టుకి బదలాయించారు. దీంతో క్షక్షిదారులు వ్యయ ప్రయాసలతో ప్రతి శనివారం వాయిదాల కోసం అనకాపల్లి డీఆర్‌వో కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి వచ్చింది. పాత పద్ధతిలో ఆర్డీవో కోర్టులోనే ఆర్‌ఓఆర్ కేసులు పరిష్కారం అయ్యేలా నిర్ణయం తీసుకుంది. డివిజన్ పరిధిలోని నర్సీపట్నం, మాకవరపాలెం, గొలుగొండ, నాతవరం, పాయకరావుపేట, కోటవురట్ల, నక్కపల్లి, ఎస్.రాయవరం, రోలుగుంట, రావికమతం, మాడుగుల, చీడికాడ మండలాలకు చెందిన కక్షిదారులు ఇకనుంచి అనకాపల్లి వెళ్లాల్సిన అవసరం లేదు.
ఈ నెల 24 నుంచి ఆదేశాలు అమలు
నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 24వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఆర్డీవో కోర్టు నడపడానికి చర్యలు తీసుకున్నారు. డివిజన్‌లో 360కిపైగా ఆర్‌వోఆర్ కేసులు ఉన్నాయి. వీరందరికి నోటీసులు ఇచ్చి వాయిదాలకు నర్సీపట్నం ఆర్డీవో కోర్టుకి రమ్మంటారు. నర్సీపట్నంలో ఆర్డీవో కోర్డు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని రెవెన్యూ డివిజనల్ అధికారి వీవీ రమణ తెలిపారు.