రాచపల్లి రైతులకు ఊరట
ABN , Publish Date - Dec 03 , 2025 | 12:46 AM
మాకవరపాలెం మండలం రాచపల్లి రెవెన్యూ పరిధిలో 246 మంది రైతులకు సంబంధించి 186.14 ఎకరాల జిరాయితీ భూములను ఏపీఐఐసీ రికార్డుల నుంచి తొలగించామని, ఆయా రైతులకు త్వరలో రెవెన్యూ అధికారులు పట్టాదారు పుస్తకాలు జారీ చేస్తారని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. మంగళవారం నర్సీపట్నంలోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, అల్యూమినియం కంపెనీ కోసం 2012లో ఏపీఐఐసీ సేకరించిన భూములకు సంబంధించిన రికార్డుల్లో అనేక లోపాలు ఉన్నాయని తెలిపారు.
ఏపీఐఐసీ రికార్డుల నుంచి జిరాయితీ భూముల తొలగింపు
246 మంది రైతులకు చెందిన 186.14 ఎకరాలకు త్వరలో పట్టాదారు పాస్‌పుస్తకాలు
శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడి
నర్సీపట్నం/ మాకవరపాలెం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): మాకవరపాలెం మండలం రాచపల్లి రెవెన్యూ పరిధిలో 246 మంది రైతులకు సంబంధించి 186.14 ఎకరాల జిరాయితీ భూములను ఏపీఐఐసీ రికార్డుల నుంచి తొలగించామని, ఆయా రైతులకు త్వరలో రెవెన్యూ అధికారులు పట్టాదారు పుస్తకాలు జారీ చేస్తారని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. మంగళవారం నర్సీపట్నంలోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, అల్యూమినియం కంపెనీ కోసం 2012లో ఏపీఐఐసీ సేకరించిన భూములకు సంబంధించిన రికార్డుల్లో అనేక లోపాలు ఉన్నాయని తెలిపారు. పలువురు రైతులకు చెందిన భూములను ఏపీఐఐసీ రికార్డుల్లో నమోదు చేశారని, ఆయా భూములు రైతుల భూముల్లో సాగులో ఉన్నప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో మాత్రం ఏపీఐఐసీకి చెందినవిగా వున్నాయన్నారు. ఏపీఐఐసీ రికార్డుల నుంచి తమ భూములను తొలగించాలని అప్పటి నుంచి రైతులు కోరుతూనే వున్నారని అన్నారు. రైతుల పేరున పట్టాదారు పాస్‌పుస్తకాలు లేకపోవడంతో ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు, వడ్డీ రాయితీ రుణాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి, సమగ్ర విచారణ జరపాలని రెవెన్యూ అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ పాత రికార్డులన్నీ పరిశీలించి జిరాయితీ భూములను తిరిగి రైతులకు అప్పగిస్తూ ఉత్తర్వులు (ఆర్‌సీ నంబరు 1219/2025/డి3) జారీ చేశారని తెలిపారు. ఆర్డీవో, తహశీల్దారు క్షేత్రస్థాయిలో పరిశీలించి 246 మంది రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు మంజూరు చేసి, అన్నదాత సుఖీభవ పథకం కింద సాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు చెప్పారు. అల్యూమినియం కంపెనీ ఏర్పాటు కోసం భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలకు, స్థానికులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని షరతు విధించినట్టు అయ్యన్నపాత్రుడు తెలిపారు. నిర్వాసిత కాలనీలో రోడ్లు, డ్రైనేజీకాలువల నిర్మాణం, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల పనులు వెంటనే పూర్తి చేయాలని అన్నారు. సమావేశంలో ఆర్డీవో వీవీ రమణ, నర్సీపట్నం, మాకవరపాలెం తహశీల్దార్లు రామారావు, వెంకటరమణ, టీడీపీ మాకవరపాలెం మండల అధ్యక్షుడు ఆర్‌వై పాత్రుడు, శెట్టిపాలెం సర్పంచ్ అల్లు నాయుడు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.