కిడ్నీ రోగులకు ఊరట
ABN , Publish Date - Oct 25 , 2025 | 01:18 AM
కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్న రోగులకు ఊరట లభించనుంది.
కేజీహెచ్‌కు చేరిన పది డయాలసిస్ మెషీన్లు
రూ.కోటితో కొనుగోలు చేసి అందించిన ఎన్‌టీపీసీ
మూడు రోజుల్లో అందుబాటులోకి తెచ్చేలా చర్యలు
ఇప్పటివరకూ ఆస్పత్రిలో ఉన్న పదింటిలో మూలకు చేరిన ఏడు మెషీన్లు
ప్రస్తుతం మూడింటితోనే సేవలు
కొత్తవి అందుబాటులోకి వస్తే తీరనున్న సమస్య
విశాఖపట్నం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి):
కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్న రోగులకు ఊరట లభించనుంది. కేజీహెచ్‌లోని నెఫ్రాలజీ విభాగానికి ఒకేసారి పది డయాలసిస్ యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ విభాగంలో మొత్తం పది యంత్రాలు ఉండేవి. సాంకేతిక సమస్యలతో ఏడు మెషీన్లు మూలకుచేరాయి. ఈ నేపథ్యంలో డయాలసిస్ సేవలకు ఇబ్బందులు ఎదురవుతుండడంతో ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించింది. దానిపై స్పందించిన కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ సమస్య పరిష్కారంపై దృష్టిసారించారు. భారీగా నిధులు అవసరమని ఆస్పత్రి అధికారులు చెప్పడంతో వివిధ కంపెనీల సీఎస్‌ఆర్ నిధులతో సమకూర్చేందుకు హామీ ఇచ్చారు.
ఎన్‌టీపీసీ ఉదారత
ఈ నేపథ్యంలో పరవాడలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టీపీసీ) అధికారులను సంప్రతించి, సీఎస్‌ఆర్ నిధులతో యంత్రాల కొనుగోలుకు ఒప్పించారు. దీంతో సంస్థ కోటి రూపాయలు వెచ్చించి పది డయాలసిస్ మెషీన్లను కొనుగోలు చేసింది. అవి కేజీహెచ్‌కు చేరాయి. మరో మూడు రోజుల్లో నెఫ్రాలజీ విభాగంలో వాటిని ఇన్‌స్టాల్ చేసి రోగుల సేవలకు వినియోగిస్తామని ఆస్పత్రి అధికారులు తెలిపారు. దీంతో డయాలసిస్ రోగులకు ఇబ్బందులు తప్పనున్నాయి.
ప్రస్తుతం మూడు మెషీన్లతోనే...
గతంలో నెఫ్రాలజీ విభాగంలో మొత్తం పది మెషీన్లతో ప్రతిరోజూ 20 నుంచి 30 మంది కిడ్నీ బాధితులకు డయాలసిస్ చేసేవారు. మూడు నెలలుగా ఏడు మెషీన్లు పనిచేయకపోవడంతో కేవలం మూడింటితోనే నెట్టుకొస్తున్నారు. రోగులకు ఇబ్బంది లేకుండా పీపీపీ విధానంలో ఆస్పత్రి ఆవరణలో నిర్వహిస్తున్న నెఫ్రోప్లస్ సెంటర్‌లో కొంతమందికి డయాలసిస్ సేవలు అందేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ప్రతిరోజూ 50 నుంచి 70 మంది రోగులకు నెఫ్రోప్లస్, నెఫ్రాలజీ విభాగంలో డయాలసిస్ చేస్తున్నారు. తాజాగా కొత్త మెషీన్లు అందుబాటులోకి రానుండడంతో రోగుల ఇబ్బందులకు తెరపడుతుందని చెబుతున్నారు. ఇన్‌స్టాలేషన్ పూర్తయిన తరువాత ప్రతిరోజూ నెఫ్రాలజీ విభాగంలోనే 40 నుంచి 50 మంది రోగులకు సేవలందిస్తామంటున్నారు. కలెక్టర్ హరేంధిరప్రసాద్ ప్రత్యేక చొరవతో మెషీన్లు వేగంగా అందుబాటులోకి వచ్చాయని ఆస్పత్రి అడ్మినిస్ర్టేటర్ బీవీ రమణ తెలిపారు.