రాంబిల్లిలో రిలయన్స్
ABN , Publish Date - Nov 20 , 2025 | 01:40 AM
అనకాపల్లి జిల్లాలో మరో పెద్ద పారిశ్రామిక సంస్థ పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందం చేసింది. దీని ద్వారా 300 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుంది. ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) సంస్థ మూడేళ్ల క్రితం రిలయన్స్ కన్జ్సూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌ను ఏర్పాటుచేసింది.
సాఫ్ట్ డ్రింక్స్, జ్యూస్‌లు,
ప్యాకేజింగ్ డ్రింకింగ్ వాటర్ పరిశ్రమ ఏర్పాటు
రూ.784 కోట్ల పెట్టుబడి
300 మందికి ఉద్యోగాలు
30 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం
ఐదేళ్లలో రూ.330 కోట్ల రాయితీలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
అనకాపల్లి జిల్లాలో మరో పెద్ద పారిశ్రామిక సంస్థ పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందం చేసింది. దీని ద్వారా 300 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుంది. ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) సంస్థ మూడేళ్ల క్రితం రిలయన్స్ కన్జ్సూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌ను ఏర్పాటుచేసింది. రిటైల్ వెంచర్స్‌లో భాగమైన ఈ కంపెనీ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంపై దృష్టిసారించింది. అనకాపల్లి జిల్లాలో సాఫ్ట్ డ్రింక్స్, జ్యూస్‌లు, ప్యాకేజింగ్ డ్రింకింగ్ వాటర్ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించింది. ఈ నెల మొదటి వారంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రమోషన్ కమిటీకి దరఖాస్తు చేయగా, మూడు రోజుల్లోనే దానిని పరిశీలించి పెట్టుబడుల ప్రమోషన్ బోర్డుకు సిఫారసు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రాంబిల్లి మండలంలోని కృష్ణంపాలెంలో 30 ఎకరాలను కేటాయించింది. ఎకరా రూ.40 లక్షలు చొప్పున ఇచ్చింది. ఈ పరిశ్రమపై రూ.784 కోట్లు వెచ్చించనున్నట్టు రిలయన్స్ గ్రూపు వెల్లడించింది. వీరికి రాష్ట్ర ప్రభుత్వం టైలర్ మేడ్ రాయితీలు ప్రకటించింది.
- పెట్టుబడి రాయితీ కింద రూ.25 కోట్లు ఇవ్వనున్నారు.
- రాష్ట్రానికి చెల్లించే జీఎస్‌టీని 100 శాతం రీఎంబర్స్‌మెంట్ చేసుకోవచ్చు. ఇలా ఐదేళ్లు జీఎస్‌టీ వెనక్కి వెళ్లిపోతుంది. దీని అంచనా విలువ రూ.249.82 కోట్లు.
- ఉపయోగించుకునే విద్యుత్‌కు యూనిట్‌కు రూపాయి చొప్పున ఐదేళ్లు రాయితీ ఇస్తారు. దీని ద్వారా రూ.27.60 కోట్లు లబ్ధి చేకూరుతుంది.
- ఎలక్ట్రిసిటీ డ్యూటీ మినహాయింపు యూనిట్‌కు రూపాయి చొప్పున ప్రకటించారు. ఐదేళ్లకు దీని ద్వారా మరో రూ.27.6 కోట్ల ప్రయోజనం కలుగుతుంది. ఈ రాయితీల ద్వారా సుమారు రూ.330 కోట్లు సంస్థకు వెనక్కి వెళుతుంది. కేటాయించిన భూమిలో ఏమైనా మౌలిక వసతులు కావాలని సంస్థ కోరితే...వాటికి ఎంత ఖర్చు అయితే అంత వారే చెల్లించాల్సి ఉంటుందనే నిబంధన విధించారు. ప్రకటించిన రాయితీలు కొన్ని పాలసీలో లేకపోయినా పెద్ద పరిశ్రమ కావడంతో ప్రత్యేక నిర్ణయాలు తీసుకున్నారు.