సక్రమంగా నిత్యావసర సరుకుల పంపిణీ
ABN , Publish Date - Dec 25 , 2025 | 12:47 AM
జిల్లాలో నిత్యావసర సరుకుల పంపిణీ ప్రక్రియను సక్రమంగా చేపట్టాలని అధికారులను ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ శ్రీపూజ ఆదేశించారు.
అధికారులకు ఇన్‌చార్జి జేసీ శ్రీపూజ ఆదేశం
పాడేరు, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో నిత్యావసర సరుకుల పంపిణీ ప్రక్రియను సక్రమంగా చేపట్టాలని అధికారులను ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ శ్రీపూజ ఆదేశించారు. పౌర సరఫరాల సంబంధిత, అనుబంధ శాఖల అధికారులతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. గోదాముల నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు, పాఠశాలలకు నిత్యావసర సరుకులను సకాలంలో సక్రమంగా అందించాలన్నారు. నిర్ణీత సమయానికి వాటిని పక్కాగా అందించాలని, ఈ క్రమంలో అలక్ష్యంగా వ్యవహరించేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో, పాఠశాలల్లో ఆహార నాణ్యతపై ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. సక్రమంగా మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్నారు. ఇకపై అటువంటి ఫిర్యాదులు వస్తే బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. అలాగే వంట గదుల్లో, భోజన శాలల్లో పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని, అపరిశుభ్రంగా ఉంటే ఒప్పుకొనేది లేదన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలను నిత్యం సీడీపీవోలు, ఎంఈవోలు పర్యవేక్షించాలని, లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందేలా చూడాలన్నారు. సరుకుల నిల్వలపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, గుడ్లు, బాలామృతం గడువు ముగిసినవి, నాసిరకం ఉండకూడదన్నారు. పాఠశాలల్లో సక్రమంగా భోజనాలు పెట్టని ఏజెన్సీలను రద్దు చేస్తామని, అధికారుల పర్యవేక్షణ మరింతగా పెరగాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై జిల్లా మేనేజర్ మోహన్‌బాబు, డిప్యూటీ తహశీల్దార్ ప్రశాంత్, జిల్లా విద్యాశాఖాధికారి రామకృష్ణారావు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమిళ, జీసీసీ డివిజన్, బ్రాంచి మేనేజర్, ఎంఈవోలు, ఏటీడబ్ల్యూవోలు, సివిల్ సప్లై గోదాముల ఇన్‌చార్జులు పాల్గొన్నారు.