Share News

జోరుగా పేదల పట్టాల రిజిసే్ట్రషన్లు

ABN , Publish Date - Sep 14 , 2025 | 12:55 AM

కన్వేయన్స్‌ డీడ్‌ పట్టాల రిజిస్ట్రేషన్లు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో జోరుగా సాగుతున్నాయి.

జోరుగా పేదల పట్టాల రిజిసే్ట్రషన్లు

ప్రభుత్వ భూముల్లో ఉన్న వారికి 2018లో పట్టాలు ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం

ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్లు

విశాఖపట్నం, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి):

కన్వేయన్స్‌ డీడ్‌ పట్టాల రిజిస్ట్రేషన్లు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిని గుర్తించి తెలుగుదేశం ప్రభుత్వం 2018లో భారీ సంఖ్యలో ఏయూ మైదానంలో మహిళల పేరుతో పట్టాలు అందజేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లు చేయలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక లబ్ధిదారులు వాటిని అవసరమైతే అమ్ముకోవడానికి వీలుగా రిజిస్ట్రేషన్లు చేయాలని ఎమ్మెల్యేలను కోరుతూ వస్తున్నారు. ఈ విషయం జిల్లా సమీక్షా మండలి సమావేశంలో ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, పి.గణబాబులు పలుమార్లు కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో అభ్యంతరం లేని పట్టాలు అంటే గెడ్డలు, వాగులు, చెరువులు కాకుండా మిగిలిన భూముల్లో ఆక్రమణదారులకు ఇచ్చిన పట్టాలను ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు వారి జాబితాను జిల్లాలో ఆయా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు పంపించారు. జిల్లాలో మొత్తం 24,463 మందికి రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయించారు. ఏ ప్రాంతాల లబ్ధిదారులు ఏ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లాలో సూచించారు.

భీమిలి మండలంలో 177 మంది లబ్ధిదారులు భీమిలిలో, విశాఖ గ్రామీణ మండలం (చినగదిలి) లబ్ధిదారులు 8,157 మంది ఆనందపురం, మధురవాడ, సూపర్‌ బజార్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో, ములగాడకు చెందిన 5,183 మంది గాజువాక, పెదగంట్యాడ కార్యాలయాల్లో, సీతమ్మధార మండలానికి చెందిన 381 మంది ద్వారకానగర్‌ కార్యాలయంలో, పెందుర్తి మండలానికి చెందిన 2,969 మంది పెందుర్తి కార్యాలయంలో, గోపాలపట్నం ప్రాంతానికి చెందిన 2,147 మంది గోపాలపట్నం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని సూచించారు. వారి నుంచి ఏ శాఖ సిబ్బంది అయినా లంచాలు ఆశిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ హెచ్చరించారు.

Updated Date - Sep 14 , 2025 | 12:55 AM