రిజిస్ట్రేషన్ల ఆదాయం భేష్
ABN , Publish Date - Jul 03 , 2025 | 12:37 AM
జిల్లాలో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయంలో వృద్ధి కనిపిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం పెరిగింది. జిల్లాలో పది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని దస్తావేజుల రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా పెరిగింది.
గత ఏడాది కంటే పెరుగుదల
మూడు నెలల్లో పెరిగిన ఆదాయం రూ.24.62 కోట్లు
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
జిల్లాలో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయంలో వృద్ధి కనిపిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం పెరిగింది. జిల్లాలో పది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని దస్తావేజుల రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా పెరిగింది. ఈ ఏడాది 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తొలి మూడు నెలల్లోనే 19,646 దస్తావేజులు రిజిస్ట్రేషన్ కాగా, రూ.83.67 కోట్ల ఆదాయం సమకూరింది. కాగా 2024-25 ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో 13,709 దస్తావేజులు రిజిస్ట్రేషన్ కాగా రూ. 59.05 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే గత ఏడాది కంటే ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో రూ.24.62 కోట్లు ఆదాయం అధికంగా వచ్చింది. గత ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలల్లో సార్వత్రిక ఎన్నికల సందడి వలన రిజిస్ట్రేషన్లు తగ్గాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక హేతుబద్ధీకరణ విధానంలో భూముల విలువ పెంచడం వల్ల మారుమూల కె.కోటపాడు, మాడుగుల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో 2019 సంవత్సరానికి ముందు గజం రూ.500 ధర ఉన్న భూమి విలువ ఏకంగా రూ.1000కి పెరిగింది. భూముల విలువ పెరగడంతో పాటు రిజిస్ట్ర్షేషన్లు కూడా పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో అనకాపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అత్యధికంగా 2,681 దస్తావేజులు రిజిస్ట్రేషన్లు జరగగా, రూ.16.35 కోట్ల ఆదాయం వచ్చింది. మాడుగుల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తక్కువగా 1,132 దస్తావేజులు రిజిస్ట్రేషన్ కాగా, రూ.1.82 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. ప్రభుత్వం రిజిస్ట్రేషన్లకు స్లాట్ విధానాన్ని తీసుకురావడంతో మంచి ఫలితాలను ఇవ్వడంతో పాటు సమయం ఆదా అవుతోంది.
జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా మూడు నెలల్లో వచ్చిన ఆదాయం
-----------------------------------------------------------------
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం దస్తావేజులు ఆదాయం
-----------------------------------------------------------------
అనకాపల్లి 2,681 రూ.16.35 కోట్లు
చోడవరం 2,563 రూ. 5.18 కోట్లు
కె.కోటపాడు 1,326 రూ. 3.52 కోట్లు
కోటవురట్ల 1,920 రూ. 5.03 కోట్లు
లంకెలపాలెం 1,520 రూ.13.53 కోట్లు
మాడుగుల 1,132 రూ. 1.82. కోట్లు
నక్కపల్లి 2,111 రూ. 9.38 కోట్లు
నర్సీపట్నం 2,258 రూ. 6.47 కోట్లు
సబ్బవరం 1,795 రూ. 10.28 కోట్లు
ఎలమంచిలి 2,340 రూ. 12.12 కోట్లు
-----------------------------------------------------------------
మొత్తం 19,646 రూ.83.68 కోట్లు
-----------------------------------------------------------