రిజర్వాయర్లకు తగ్గిన వరద
ABN , Publish Date - Nov 01 , 2025 | 01:17 AM
తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గిపోవడంతో శుక్రవారం జిల్లాలో ఎక్కడా వర్షం కురవలేదు. గత రెండు, మూడు రోజులతో పోలిస్తే జలశయాల్లోకి వరద పోటు తగ్గింది. దీంతో తాండవ, రైవాడ స్పిల్‌వే గేట్లను మూసివేశారు. ఆయకట్టుకు తాండవ నుంచి 270 క్యూసెక్కులు, రైవాడ నుంచి 50 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
తాండవ, రైవాడ గేట్లు మూసివేత
పెద్దేరు, కోనాం, కల్యాణపులోవ జలాశయాల నుంచి నీరు విడుదల
శారదా నదిలో వరద తగ్గుముఖం
అనకాపల్లి, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గిపోవడంతో శుక్రవారం జిల్లాలో ఎక్కడా వర్షం కురవలేదు. గత రెండు, మూడు రోజులతో పోలిస్తే జలశయాల్లోకి వరద పోటు తగ్గింది. దీంతో తాండవ, రైవాడ స్పిల్‌వే గేట్లను మూసివేశారు. ఆయకట్టుకు తాండవ నుంచి 270 క్యూసెక్కులు, రైవాడ నుంచి 50 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇక కోనాం జలాశయం స్పిల్‌వే గేట్ల నుంచి 300 క్యూసెక్కులు, పెద్దేరు స్పిల్‌వే గేట్ల నుంచి 700 క్యూసెక్కులు, కల్యాణపులోవ స్పిల్‌వే గేట్ల నుంచి 280 క్యూసెక్కుల నీటిని నదుల్లోకి విడుదల చేస్తున్నారు. గురువారంతో పోలిస్తే దాదాపు అన్ని నదుల్లో శుక్రవారం వరద ఉధృతి తగ్గింది. ముఖ్యంగా శారదా నది ఒకింత శాంతించడంతో ఇరువైపులా వున్న గ్రామాల రైతులు, ప్రజలు ఊరట చెందుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని పొలాల్లో నుంచి వరద నీరు ఇప్పుడిప్పుడే బయటకు పోతున్నది. దీంతో వరి పంటకు పెద్దగా నష్టం వుండకపోవచ్చని రైతులు అంటున్నారు.
శాంతించిన శారదా నది
అనకాపల్లి టౌన్, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): గత మూడు రోజుల నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న శారదా నది శుక్రవారం కొంతమేర శాంతించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తుఫాన్ కారణంగా భారీ వర్షాలు పడడంతోపాటు రైవాడ, పెద్దేరు, కోనాం జలాశయాల నుంచి పెద్ద మొత్తంలో వరద నీటిని విడుదల చేయడంతో శారదా నది ఉధృతంగా ప్రవహించిన విషయం తెలిసిందే. అనకాపల్లి వద్ద నదిని ఆనుకొని ఉన్న ఉమా సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలోకి వరదనీరు చొచ్చుకు వచ్చింది. నదికి ఇరువైపులా వున్న ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళన చెందారు. అయితే గురువారం రాత్రి నుంచి వర్షం పడకపోవడం, రిజర్వాయర్ల్ నుంచి నీటి విడుదల తగ్గిపోవడంతో శారదా నదిలో వరద ప్రవాహం క్రమేపీ తగ్గుముఖం పడుతున్నది.
రిజర్వాయర్ గరిష్ఠ ప్రస్తుత ఇన్‌ఫ్లో అవుట్‌ఫ్లో
నీటిమట్టం నీటిమట్టం క్యూసెక్కులు క్యూసెక్కులు
రైవాడ 114 మీటర్లు 112 మీటర్లు 3,000 50
కోనాం 101.25 మీటర్లు 98.8 మీటర్లు 300 300
పెద్దేరు 137 మీటర్లు 134.25 మీటర్లు 620 700
తాండవ 380 అడుగులు 378.2 అడుగులు 940 270
కల్యాణపులోవ 460 అడుగులు 459.02 అడుగులు 280 280