Share News

తగ్గిన నేరాలు

ABN , Publish Date - Dec 31 , 2025 | 12:48 AM

జిల్లాలో ఈ ఏడాది కొన్ని రకాల నేరాలు పెరగ్గా, మరికొన్ని రకాల నేరాలు తగ్గాయి. ప్రధానంగా సైబర్‌ నేరాలు, ఆన్‌లైన్‌ మోసాలు బాగా పెరిగాయి. అచ్యుతాపురంలో సైబర్‌ నేరగాళ్లు కాల్‌సెంటర్ల ముసుగులో ఈ-కామర్స్‌ నకిలీ యాప్‌లతో మోసాలకు పాల్పడ్డారు.

తగ్గిన నేరాలు
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ తుహిన్‌ సిన్హా

ఈ ఏడాది వివిధ పోలీసు స్టేషన్లలో 5,821 కేసులు నమోదు

గత ఏడాది 7,573 కేసులు..

మహిళలు, చిన్నారులపై తగ్గిన అఘాయిత్యాలు

పోలీసు శాఖకు సవాల్‌గా మారిన సైబర్‌, ఆన్‌లైన్‌ మోసాలు

మాదకద్రవ్యాల రవాణా నియంత్రణలో పురోగతి

వివరాలు వెల్లడించిన ఎస్పీ తుహిన్‌ సిన్హా

అనకాపల్లి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో ఈ ఏడాది కొన్ని రకాల నేరాలు పెరగ్గా, మరికొన్ని రకాల నేరాలు తగ్గాయి. ప్రధానంగా సైబర్‌ నేరాలు, ఆన్‌లైన్‌ మోసాలు బాగా పెరిగాయి. అచ్యుతాపురంలో సైబర్‌ నేరగాళ్లు కాల్‌సెంటర్ల ముసుగులో ఈ-కామర్స్‌ నకిలీ యాప్‌లతో మోసాలకు పాల్పడ్డారు. ఆలస్యంగా గుర్తించిన పోలీసులు వీరి ఆటకట్టించి, కటకటాల వెనక్కు నెట్టారు. ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించింది. జిల్లాలో ఈ ఏడాది కాలంలో జరిగిన వివిధ రకాల నేరాలు, ప్రమాదాలకు సంబంధించిన వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ తుహిన్‌సిన్హా వెల్లడించారు. గత ఏడాది వివిధ పోలీసు స్టేషన్‌లలో మొత్తం 7,573 కేసులు నమోదు కాగా ఈ ఏడాది ఆ సంఖ్య 5,821కి తగ్గిందన్నారు. గత ఏడాది మహిళలపై నేరాలకు సంబంధించి 387 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 291 కేసులు నమోదయ్యాయి. పోక్సో కేసులు దాదాపు ఒకేలా వున్నాయి. తీవ్రమైన నేరాలు, ప్రాణహాని కలిగించే నేరాలు గత ఏడాది 591 నమోదు కాగా ఈ ఏడాది 417 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు 54 శాతం మేర తగ్గడం విశేషం. రహదారి, ఇతర ప్రమాదాల్లో మరణాల సంఖ్య ఏడు శాతం తగ్గింది.

జిల్లాలో ఆర్థిక నేరాలు గత ఏడాదితో పోలిస్తే 3 శాతం పెరిగాయి. గత ఏడాది 406 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 417 కేసులు నమోదయ్యాయి. మోసపూరిత కేసులు గత ఏడాది 131 నమోదు కాగా ఈ ఏడాది 125, నమ్మకద్రోహం కేసులు గత ఏడాది 18, ఈ ఏడాది 17 కేసులు నమోదయ్యాయి.

జిల్లాలో గత ఏడాది మాదకద్రవ్యాల (ఎన్‌డీపీఎస్‌) కేసులు 162 నమోదు కాగా ఈ ఏడాది 128 కేసులు నమోదయ్యాయి. ఇతర సాధారణ కేసులు గత ఏడాది 4,987 నమోదు కాగా ఈ ఏడాది 3,627కి తగ్గాయి.

మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గాయి. ముఖ్యంగా కిడ్నాప్‌ కేసులు 85 శాతం, వరకట్నం కేసులు 11 శాతం తగ్గాయి. మహిళలపై నేరాలకు సంబంధించి 291 కేసులు నమోదయ్యాయి. మహిళలు, బాలికల మిస్సింగ్‌ కేసులు ఈ ఏడాది 316 నమోదు వీరిలో 257 మంది సురక్షితంగా ఉన్నట్టు గుర్తించారు.

మాదకద్రవ్యాల నియంత్రణ...

గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నియంత్రణలో భాగంగా జిల్లా పోలీసులు ఈ ఏడాది 128 కేసులు నమోదు చేసి 411 మందిని అరెస్టు చేశారు. సుమారు రూ.4.41 కోట్లు విలువైన 8,791 కిలోల గంజాయి, 7.39 లీటర్ల హ్యాష్‌ ఆయిల్‌ (ద్రవ గంజాయి), 114 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందితులపై ఎన్‌డీపీసీ కేసులు నమోదు చేశారు. వీరికి సంబంధించి రూ.1,25,22,100 విలువగల ఆస్తులను స్తంభింపజేశారు. 312 మంది గంజాయి నిందితులపై సస్పెక్ట్‌ ఫీట్‌ ఓపెన్‌ చేశారు. మాదక ద్రవ్యాల రవాణా, హత్యలు, పోక్సో కేసుల్లో 51 శాతం మంది నిందితులకు కోర్టుల్లో శిక్షలు పడేలా కృషి చేశారు.

జిల్లాలో నేరాల కట్టడికి, వివిధ కేసుల్లో నిందితులను త్వరగా పట్టుకోవడానికి జిల్లా పోలీసులు సాంకేతిక వినియోగాన్ని మరింత పెంచారు. ఈ ఏడాది కొత్తగా 3,573 సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో పేకాట, కోడిపందేలు, గంజాయి/మద్యం సేవించడం, గంజాయి రవాణా వంటి వాటిని అరికట్టడానికి డ్రోన్లను వినియోగిస్తున్నారు. సేఫ్‌ స్టే యాప్‌ ద్వారా హోటళ్లు, లాడ్జీల్లో బస చేసే వారి వివరాలను, పాత నేరస్థుల డేటాతో సరిపోల్చుతూ అసాంఘిక కార్యకలాపాలను అరికడుతున్నారు. కొత్త సంవత్సరంలో సైబర్‌ నేరాల అదుపుపై జిల్లా పోలీసు యంత్రాంగం మరింత దృష్టి పెట్టాలని నిర్ణయించింది.

Updated Date - Dec 31 , 2025 | 12:48 AM