Share News

రైల్వే జోన్‌కు రెడ్‌ సిగ్నల్స్‌!

ABN , Publish Date - Jul 29 , 2025 | 01:15 AM

విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను పట్టాలెక్కించడం రైల్వే పెద్దలకు ఇష్టం లేనట్టుంది.

రైల్వే జోన్‌కు రెడ్‌ సిగ్నల్స్‌!

  • మూడడుగులు ముందుకు, ఆరడుగులు వెనక్కి...

  • ఇప్పటివరకూ విడుదల కాని గెజిట్‌

  • ముందుకుసాగని పనులు

  • జీఎంను నియమించినా కార్యాలయం లేదు

  • డీపీఆర్‌ పంపిన ఆరు నెలలకు తీరుబడిగా కొర్రీలతో ఆమోదం

  • రాయగడ డివిజన్‌లోకి అరకులోయ

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను పట్టాలెక్కించడం రైల్వే పెద్దలకు ఇష్టం లేనట్టుంది. ఇది ఒడిశాకు చెందిన తూర్పు కోస్తా రైల్వే జోన్‌తో ముడిపడి ఉండడం, రైల్వే మంత్రి ఆ రాష్ట్రానికి చెందినవారు కావడమే...అందుకు ప్రధాన కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఆరేళ్ల క్రితం జోన్‌ను ప్రకటించగా, ఆరు నెలల క్రితం జోనల్‌ కార్యాలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. అయితే ఇప్పటివరకూ జోన్‌కు సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను ప్రకటించలేదు. జోన్‌లో డివిజన్లు, వాటి సరిహద్దులు అన్నీ సమగ్రంగా గెజిట్‌లోనే ఉంటాయి. జోన్‌ ఆపరేషన్‌ తేదీ కూడా అందులోనే ప్రకటిస్తారు. ఆ గెజిట్‌ లేకపోవడంతో ఏ పనీ ముందుకుసాగడం లేదు. ఒత్తిళ్లు తట్టుకోలేక విశాఖ కేంద్రంగా జోన్‌ ఇచ్చారు గానీ పూర్తిస్థాయిలో పనిచేసేందుకు తగిన ఆదేశాలు ఇవ్వడం లేదు. జోన్‌కు జనరల్‌ మేనేజర్‌ను నియమించారు. ఆయన పరిస్థితి ‘రాజ్యం లేని రాజు’లా మారింది. పేరుకే ఆయన జోన్‌ జీఎం. జోన్‌ పరిధిలోకి వచ్చే డివిజన్లు వాల్తేరు (విశాఖపట్నం), గుంటూరు, గుంతకల్‌, విజయవాడ డివిజన్లు ఇప్పటికీ వాటి పాత జోన్‌ పరిధిలోనే నడుస్తున్నాయి. వాల్తేరు తూర్పు కోస్తా రైల్వే పరిధిలో, మిగిలిన మూడు సికింద్రాబాద్‌ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోనే ఉన్నాయి. ఆ డివిజన్లకు చెందిన రైల్వే మేనేజర్లు ఆయా జోన్ల జీఎంలు చెప్పిన పనులే చేస్తున్నారు. వారితోనే అన్ని రకాల సంప్రతింపులు జరుపుతున్నారు. కేంద్రం గెజిట్‌ ఇవ్వకపోవడం వల్ల కొత్త జీఎం వారితో అధికారికంగా కార్యకలాపాలు నిర్వహించలేకపోతున్నారు.

జీఎం కార్యాలయం ఖరారుపై దోబూచులాట

జోన్‌ జీఎంగా సందీప్‌ మాధుర్‌ని జూన్‌ మొదటి వారంలో నియమించారు. ఆయన తక్షణమే ఢిల్లీలోనే బాధ్యతలు స్వీకరించారు. ఆ తరువాత విశాఖపట్నం సహా అన్ని డివిజన్లకు వెళ్లి అక్కడి రైల్వే అధికారులతో పరిచయం చేసుకున్నారు. విశాఖలో ఆయనకు ప్రత్యేక కార్యాలయం ఉండాలి. ముడసర్లోవలో కొత్త జోనల్‌ కార్యాలయం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అవి పూర్తయ్యేసరికి రెండేళ్లు పైనే పడుతుంది. అంతవరకూ వేరే భవనాన్ని అద్దెకు తీసుకోవాలని రెండు, మూడు పరిశీలించారు. వాటికి ఆమోదం రావలసి ఉంది. ఆ విషయంలోనూ రైల్వే పెద్దలు తాత్సారం చేస్తున్నారు. ఏదో ఒకటి ఖరారు చేస్తే జీఎం విశాఖలో కూర్చొని కొన్ని పనులైనా చేసుకునే అవకాశం ఉంది. అది సుతారమూ రైల్వే పెద్దలకు ఇష్టం లేదు. అందుకని ఆ జీఎం భవనాన్ని ఖరారు చేయడం లేదు.

కొర్రీలతో డీపీఆర్‌ ఆమోదం

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు సంబంధించిన డీపీఆర్‌ను ఈ ఏడాది జనవరి నెలాఖరులో ఢిల్లీకి పంపితే ఆరు నెలలు దానిని మురగబెట్టి వారం క్రితం కొర్రీలతో ఆమోదించారు. రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌ ఇచ్చేశారు. ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయ విశాఖపట్నం జోన్‌ నుంచి రాయగడలోకి వెళ్లిపోయింది. పార్వతీపురం సమీపానున్న కూనేరు కూడా రాయగడ డివిజన్‌కే ఇచ్చేశారు. కొత్తవలస నుంచి పలాస వరకు విశాఖపట్నం డివిజన్‌లో ఉంచారు. పలాస నుంచి ఇచ్ఛాపురం వరకూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్టేషన్లన్నీ తూర్పు కోస్తా జోన్‌లోని ఖుర్దా డివిజన్‌లో ఉండిపోయాయి.

ఆర్‌ఆర్‌బీపై చర్చ శూన్యం

రైల్వేలో ఉద్యోగ అవకాశం రావాలంటే రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) నిర్వహించే పరీక్షలు రాయాలి. వాటికి హాజరయ్యేందుకు ఒడిశాలోని భువనేశ్వర్‌కు వెళితే...‘ఆంధ్రావాళ్లు’ అని వెనక్కి పంపించేసేవారు. ఆ నేపథ్యంలోనే విశాఖ కేంద్రంగా జోన్‌ ఏర్పాటుచేస్తే ఇక్కడే ఆర్‌ఆర్‌బీ కేంద్రం వస్తుందని యువత భావించింది. ఇప్పుడు జోన్‌ ప్రకటించినా ఇంకా ఆర్‌ఆర్‌బీ కేంద్రం ఇవ్వలేదు. దీనిపై ఎవరూ మాట్లాడడం లేదు. రైల్వే స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌గా అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌ వ్యవహరిస్తున్నారు. ఆయన జోన్‌ కార్యకలాపాల వేగవంతంపైన, ఆర్‌ఆర్‌బీ వంటి అంశాలపైనా దృష్టి సారించాలి. ఆయన ప్రయత్నిస్తే అన్నింటికీ వెనువెంటనే ఆదేశాలు వస్తాయి.

Updated Date - Jul 29 , 2025 | 01:15 AM