పరిశ్రమలకు రెడ్ కార్పెట్
ABN , Publish Date - Oct 11 , 2025 | 01:06 AM
పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా జిల్లాలో పలు పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలు, భూములను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో జిల్లాలో పలు పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తూ ఆమోదం తెలిపింది.
భూముల కేటాయింపు, రాయితీల కల్పన
ఎస్‌ఈజడ్‌లో సన్వీరా ఇండస్ట్రీస్ కార్బన్ కాంప్లెక్స్
122.01 ఎకరాలు కేటాయింపు
రూ.260 కోట్ల పెట్టుబడి, 800 మందికి ఉద్యోగాలు
పరవాడ ఫార్మాసిటీలో ఎంఎన్‌ఆర్ కంపెనీ
రూ.160 కోట్ల పెట్టుబడి, 198 మందికి ఉద్యోగాలు
రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా జిల్లాలో పలు పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలు, భూములను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో జిల్లాలో పలు పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తూ ఆమోదం తెలిపింది.
పరవాడలోని ఫార్మాసిటీలో ఎంఎన్‌ఆర్ ఫార్మా కంపెనీ ఏర్పాటులో జరిగిన జాప్యంపై గతంలో విఽధించిన రూ.18.09 కోట్ల జరిమానా మినహాయింపునకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ కంపెనీ రూ.160 కోట్ల పెట్టుబడులతో 22.18 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నారు. కంపెనీలో 198 మందికి ఉపాధి కల్పిస్తారు.
పరిశ్రమల అభ్యర్థనల మేరకు పలు రాయితీలు కల్పిస్తూ మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. నక్కపల్లిలో రూ.55 వేల కోట్లతో ఏర్పాటు కానున్న ఆర్సెలర్ మిట్టల్, నిప్పన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ కంపెనీ కోసం దశల వారీగా కేటాయించిన భూమికి చెల్లింపులపై రూ.12.58 కోట్లు వడ్డీ మినహాయింపు ఇచ్చింది.
పారిశ్రామిక విస్తరణలో భాగంగా అచ్యుతాపురం, రాంబిల్లి ప్రత్యేక ఆర్థిక మండలిలో 122.01 ఎకరాల్లో సన్వీరా ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ రూ.260 కోట్లతో అధునాతన కార్బన్ కాంప్లెక్స్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ పరిశ్రమ ఏర్పాటైతే 800 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఎకరాకు రూ.80 లక్షల రాయితీతో కంపెనీకి భూములను కేటాయించనున్నారు. ఈ పరిశ్రమలో కార్బన్ క్యాథోడ్స్, గ్రాఫైట్ ఎలకో్ట్రడ్స్ స్పెషాలిటీ ఉత్పత్తులు తయారవుతాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలకా్ట్రనిక్స్, కమ్యూనికేషన్ శాఖ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సిఫారసు చేసిన విధంగా రూ.87,520 కోట్ల పెట్టుబడులతో రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ఉమ్మడి విశాఖ జిల్లాలో మూడుచోట్ల 480 ఎకరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నది. ఇందులో ఒకదానిని అచ్యుతాపురం సెజ్‌లో ఏర్పాటు చేస్తారు. ప్రత్యక్షంగా 200 మందికి, పరోక్షంగా మరికొంతమందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఈ-పవర్డ్ డేటా సెంటర్‌కు రాంబిల్లిలో 80 ఎకరాలను కేటాయిస్తూ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.