విశాఖ జిల్లాకు రెడ్ అలర్ట్
ABN , Publish Date - Oct 28 , 2025 | 01:05 AM
బంగాళాఖాతంలో తుపాన్ (‘మొంథా’)తో విశాఖ జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ మెసేజ్ జారీచేసింది.
తుఫాన్ నేపథ్యంలో వాతావరణ శాఖ జారీ
ఎడతెరిపి లేకుండా వర్షం...రోడ్లన్నీ జలమయం
మధురవాడ జాతర వద్ద 10.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
కూలుతున్న చెట్లు...నిలిచిపోతున్న విద్యుత్ సరఫరా
నేడు పలుచోట్ల కుంభవృష్టిగా వర్షాలు
ఉదయం నుంచి పెరగనున్న గాలులు
సాయంత్రం గంటకు 60 నుంచి 70 కి.మీ. వేగంతో గాలులు
విశాఖ, గంగవరం రేవుల్లో ఆరో నంబరు డేంజర్ సిగ్నల్
ఆరోగ్య శాఖ అప్రమత్తం
అర్బన్ హెల్త్ సెంటర్లు 24 గంటలూ తెరిచే ఉంచాలని ఆదేశం
విశాఖపట్నం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి):
బంగాళాఖాతంలో తుపాన్ (‘మొంథా’)తో విశాఖ జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ మెసేజ్ జారీచేసింది. సోమవారం రాత్రికి తుఫాన్ విశాఖకు 500 కి.మీ. దక్షిణ ఆగ్నేయంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం కావడంతో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉంది. సోమవారం రోజుంతా కుండపోతగా వర్షం కురిసింది. సోమవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు నగరంలో అక్కడక్కడా కుంభవృష్టిగా, మిగిలినచోట్ల భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో నగరంలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం నుంచి గాలులు పెరిగి సాయంత్రానికి గంటకు 60 నుంచి 70 కి.మీ. వేగంతో వీయనున్నాయి. సముద్ర అలలు అరమీటరు వరకు ఎగిసిపడి సముద్రం నీరు ముందుకువచ్చే అవకాశం ఉంది. గాలులు తీవ్రతకు చెట్లు, హోర్డింగ్‌లు నేలకొరిగే ప్రమాదం ఉండడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కాగా విశాఖపట్నం, గంగవరం ఓడరేవుల్లో ఆరో నంబరు డేంజర్ సిగ్నల్ ఎగురవేశారు. దీంతో పోర్టులో వాణిజ్య కార్యకలాపాలు నిలిపివేశారు. బుధవారం తుఫాన్ తీరం దాటేంత వరకు పోర్టుల్లో డేంజర్ సిగ్నల్స్ కొనసాగే అవకాశం ఉంది.
ముసురు
తుఫాన్ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆదివారం రాత్రి నుంచే వర్షాలు ప్రారంభమయ్యాయి. సోమవారం రాత్రి వరకూ కురుస్తూనే ఉన్నాయి. గాలులకు చెట్ల కొమ్మలు విరిగి రోడ్లకు అడ్డంగా పడుతున్నాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. మురుగు కాలువల్లో పూడికలు, చెత్త తొలగించకపోవడంతో ఈ వర్షాలకు అవన్నీ రోడ్లపైకి చేరుతున్నాయి. అనేకచోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి చెందిన మ్యాన్‌హోళ్ల నుంచి నీరు పైకి ఎగజిమ్ముతోంది.
ఆరోగ్య శాఖ అప్రమత్తం
తుఫాన్ నేపథ్యంలో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జిల్లాలోని అర్బన్ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది నిరంతరం సేవలు అందించాలని అధికారులు ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా యంత్రాంగానికి కీలక ఆదేశాలను జారీచేశారు. అందుకు అనుగుణంగా జిల్లా అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేశారు. మంగళవారం నుంచి వైద్యులు విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతంలోనే ఉండాలని సూచించారు. అలాగే తుఫాన్ ప్రభావం అధికంగా ఉంటుందని గుర్తించిన 66 ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటుచేయాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. సోమవారం పదిహేనుచోట్ల క్యాంపులు ఏర్పాటుచేసి, 491 మందికి సేవలు అందించారు. నగర పరిధిలోని అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా 24 గంటలు తెరిచే ఉంచాలని, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆరోగ్య కేంద్రాల్లో తప్పనిసరిగా యాంటీ స్నేక్ వీనం, ఓఆర్‌ఎస్, ఏఆర్‌వీ, ఐవీ ఫ్లూయిడ్స్‌ను సిద్ధంగా ఉంచుకోవాలని స్పష్టంచేశారు. వర్షాల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో జనరేటర్స్, ఇన్వర్టర్స్‌ను సిద్ధం చేసుకోవాలని సూచించారు.
బోట్ క్లినిక్‌లుగా వాహనాలు
జిల్లాకు కేటాయించిన ఏడు 104, మరో 16 అంబులెన్స్‌లు (108), 23 తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ (102 వాహనాలు)లను తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మత్స్య శాఖ అధికారులతో కలిసి బోట్ క్లినిక్స్‌గా ఏర్పాటుచేశారు. పంచాయతీరాజ్, ఇతర శాఖల సహకారంతో మంచినీరు బ్లీచింగ్ చేసేందుకు అనుగుణంగా పౌడర్ సిద్ధంగా ఉంచుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ పరిధిలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేసుకుని డాక్టర్, పారామెడికల్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు సూచించారు.
విద్యుత్ సరఫరా తక్షణ పునరుద్ధరణకు చర్యలు
15 వేల విద్యుత్ స్తంభాలు, 950 ట్రాన్స్‌ఫార్మర్లు సిద్ధం
ఏపీఈడీపీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్
విశాఖపట్నం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి):
తుఫాన్ నేపథ్యంలో ఎక్కడైనా విద్యుత్ సరఫరా నిలిచిపోతే తక్షణమే పునరుద్ధరించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ తెలిపారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, సంస్థ పరిధిలోని 11 జిల్లాల అధికారులను రెండు రోజుల ముందుగానే అప్రమత్తం చేశామన్నారు. విద్యుత్ పునరుద్ధరణ చర్యల కోసం సుమారు 15వేల స్తంభాలు, 950 ట్రాన్స్‌ఫార్మర్లు, 115 క్రేన్లు, 80 జేసీబీలు, 144 వైర్‌లెస్ హ్యాండ్ సెట్లు, 254 పోల్ డ్రిల్లింగ్ యంత్రాలు, మొబైల్ బృందాలను సిద్ధం చేశామన్నారు. తుఫాన్ పునరుద్ధరణ పనులు పూర్తయ్యేంత వరకు ఉద్యోగులు అందరికీ సెలవులు రద్దు చేశామని చెప్పారు. ఆపరేషన్స్ డైరెక్టర్ సూర్యప్రకాశ్ కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పర్యటిస్తూ అక్కడి అధికారులను సమన్వయం చేస్తున్నారన్నారు. ఇతర జిల్లాల నుంచి సుమారు ఏడు వేల మంది సిబ్బందిని, సామగ్రిని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు తరలించామన్నారు. ఇతర విద్యుత్ సంస్థల నుంచి రెండు వేల మంది సహాయక చర్యల కోసం వచ్చారన్నారు. వారిని సీజీఎం విజయలలిత పర్యవేక్షిస్తున్నారన్నారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి అధికారులను అందుబాటులో ఉంచామన్నారు.
పర్యాటక కేంద్రాలన్నీ మూసివేత
టూర్ ప్యాకేజీ బస్సులన్నీ రద్దు
కైలాసగిరి, రుషికొండ బీచ్‌లలోకి నో ఎంట్రీ
విశాఖపట్నం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి):
తుఫాన్ ప్రభావంతో భారీవర్షాలు కురుస్తుండడంతో అధికారులు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లాలోని పర్యాటక కేంద్రాలను సోమవారం మూసివేశారు. ముఖ్యంగా రుషికొండ బీచ్‌లోకి పర్యాటకులు ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటుచేసి పోలీసు గస్తీ పెట్టారు. డీఐజీ గోపీనాథ్ జెట్టీ వెళ్లి అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. స్పీడ్ బోట్లు నిలిపివేశారు. ఫిషింగ్ హార్బర్‌లో పర్యాటకులను సముద్రంలోకి తీసుకువెళ్లే బోటును కూడా ఆపేశారు. బీచ్‌రోడ్డులో పర్యాటకుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన అద్దాల డబుల్ డెక్కర్ హాప్ అన్ హాప్ ఆఫ్ బస్సులను సైతం నిలిపివేశారు. రోజూ పర్యాటకుల కోసం నడిపే టూర్ ప్యాకేజీ బస్సులను కూడా రద్దు చేశారు. అరకులోయ రైలు కమ్ రోడ్ ప్యాకేజీ టూర్‌ను కూడా రద్దు చేసినట్టు డివిజనల్ మేనేజర్ జగదీశ్ తెలిపారు. వీఎంఆర్‌డీఏ అధికారులు కైలాసగిరిపైకి ఎవరూ వెళ్లకుండా స్టాపర్లు పెట్టేశారు. తెన్నేటి పార్క్, హెల్త్ ఎరీనా, వీఎంఆర్‌డీఏ పార్కుల్లోకి కూడా అనుమతులు లేవని సందర్శకులను వెనక్కి పంపించేశారు. తుఫాన్ తీరం దాటి, వర్షాలు తగ్గుముఖం పట్టాక, కలెక్టర్ సూచన మేరకు ఇవన్నీ తెరుస్తామని పర్యాటక శాఖాధికారులు తెలిపారు.