Share News

ఆర్‌ఈసీఎస్‌ సొమ్ములు స్వాహా

ABN , Publish Date - May 27 , 2025 | 01:40 AM

అనకాపల్లి గ్రామీణ విద్యుత్‌ సహకార సంస్థ (ఆర్‌ఈసీఎస్‌) నిధులను అధికారులు అందినకాడికి దిగమింగుతున్నారు.

ఆర్‌ఈసీఎస్‌ సొమ్ములు స్వాహా

  • రూ.10 కోట్ల విలువైన విద్యుత్‌ సామగ్రి కశింకోట నుంచి సింహాచలంలోని ఈపీడీసీఎల్‌ స్టోర్స్‌కు తరలింపు

  • ఈపీడీసీఎల్‌ వాహనాలు, సిబ్బంది వినియోగం

  • వాటికి రవాణా చార్జీల కింద రూ.19.64 లక్షల క్లెయిమ్‌

  • ఇస్తున్నది ఎవరు...? పుచ్చుకుంటున్నది ఎవరు..?

  • అనకాపల్లి, విశాఖ అధికారుల సంయుక్త దోపిడీ

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

అనకాపల్లి గ్రామీణ విద్యుత్‌ సహకార సంస్థ (ఆర్‌ఈసీఎస్‌) నిధులను అధికారులు అందినకాడికి దిగమింగుతున్నారు. ప్రతి నెలా కొన్ని కోట్ల రూపాయలు లాభాలు వస్తుండడంతో వాటిని ఏవేవో లెక్కలు వేసి సొంత జేబుల్లో వేసుకుంటున్నారు. ఇటీవలె ఎవరి అనుమతి లేకుండా సొసైటీ ఉద్యోగులకు పీఆర్‌సీ వర్తింపజేసిన సంగతి తెలిసిందే. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు ప్రచురించినా ఇటు కార్పొరేట్‌ కార్యాలయం గానీ, అక్కడ కశింకోట బాధ్యులు గానీ, సొసైటీ పర్సన్‌ ఇన్‌చార్జి అయిన జిల్లా కలెక్టర్‌ గానీ స్పందించలేదు. ఇప్పుడు అదే సొసైటీలో మరో బాగోతం వెలుగులోకి వచ్చింది.

ఆర్‌ఈసీఎస్‌ విద్యుత్‌ వ్యాపారం చేయడానికి ప్రభుత్వం లైసెన్స్‌ ఇవ్వనందున (పునరుద్ధరణ చేయనందున) దానిని ఏపీఈపీడీసీఎల్‌ స్వాధీనం చేసుకొని నిర్వహించాలని ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి గతంలో ఆదేశించింది. ఆ ప్రకారం ఈపీడీసీఎల్‌ గత మూడేళ్లుగా ఆ సొసైటీకి ‘రెస్కో కశింకోట డివిజన్‌’ అని పేరు పెట్టి, అక్కడ ఓ డీఈని నియమించి వ్యవహారాలు నడుపుతోంది. అయితే సొసైటీకి చెందిన అప్పులు, ఆస్తుల లెక్క తేలలేదు. సొసైటీ బాధ్యులు పూర్తి వివరాలు అందించకపోవడం వల్ల అవన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. ఆ డివిజన్‌కు యథాప్రకారం విద్యుత్‌ సరఫరా చేసి, బిల్లులు వసూలుచేసి, సొసైటీ ఉద్యోగులకు ఈపీడీసీఎల్‌ జీతాలు చెల్లిస్తోంది. నిర్వహణ వ్యయం అంతా భరిస్తోంది. ఇవన్నీ వేరే బ్యాంకు ఖాతాల ద్వారా జరుగుతోంది.

ఎవరి అనుమతితో తరలించారు?

ఇదిలావుండగా సొసైటీని స్వాధీనం చేసుకున్నప్పుడు అప్పటికే వారు విద్యుత్‌ పనుల నిర్వహణ కోసం సమకూర్చుకున్న పది కోట్ల రూపాయల విలువ చేసే మెటీరియల్‌ కశింకోటలోని ఆర్‌ఈసీఎస్‌ స్టోర్స్‌లో ఉంది. దానిని అక్కడి నుంచి సింహాచలంలో ఈపీడీసీఎల్‌ స్టోర్స్‌కు తరలించాలని విశాఖపట్నంలోని కార్పొరేట్‌ కార్యాలయంలోని సీజీఎం ఒకరు ఆదేశించారు. దాంతో కశింకోట రెస్కో డివిజన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఈఈ) దగ్గరుండి పంపించేశారు. ఈపీడీసీఎల్‌కు చెందిన వాహనాలతో సిబ్బంది సుమారు రెండు వారాలు తరలింపు ప్రక్రియ చేపట్టారు. ఈ ప్రక్రియ గత ఏడాది ఆగస్టులో పూర్తయింది. ఇలాంటి వ్యవహారాలు నిర్వహించినప్పుడు ఏయే రకాల మెటీరియల్‌ ఎంత పంపించారు?, ఎక్కడికి పంపించారు?, వాటి విలువ ఎంత?...అనే వివరాలు రికార్డుల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. పైగా అప్పులు, ఆస్తుల లెక్క తేలనందున వాటిని ప్రత్యేక అనుమతులు ఉంటే తప్ప వినియోగించుకోవడానికి వీల్లేదు. ఈ నిబంధనను కూడా అధికారులు ఉల్లంఘించారు.

లోడింగ్‌, రవాణా చార్జీల క్లెయిమ్‌

ఆ మెటీరియల్‌ను సింహాచలం డిపోకు తరలించడానికి కార్పొరేట్‌ కార్యాలయం ఈపీడీసీఎల్‌ సిబ్బందిని, వాహనాలను పంపించింది. అంటే వారి పనులు వారే చేసుకున్నారు. దీనికి కశింకోట రెస్కో డివిజన్‌ ఈఈ రవాణా చార్జీలు ఇవ్వాలంటూ రూ.19.64 లక్షలకు బిల్లు పెట్టారు. ఇండోర్‌, అవుట్‌ డోర్‌ మెటీరియల్‌ను వాహనాల్లో లోడింగ్‌ చేయడానికి, తరలింపునకు ఉపయోగించిన వాహనాలకు అద్దెలు చెల్లించడానికి ఈ వ్యయం అయిందని బిల్లు పెట్టుకున్నారు. ఈ బిల్లు మొత్తం ఎవరెవరు పంచుకున్నారంటే...కార్పొరేట్‌ కార్యాలయం, కశింకోట డివిజన్‌ అధికారుల పేర్లు వినిపిస్తున్నాయి.

ఆర్‌టీఐలో అడిగితే డొంక తిరుగుడు సమాధానం

కశింకోట రెస్కోలో అవకతవకలపై అనేక ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ మెటీరియల్‌ తరలింపుపై వివరాలు కోరుతూ సమాచార హక్కు చట్టం కింద ఒకరు దరఖాస్తు చేశారు. మెటీరియల్‌ తరలింపునకు అనుమతి ఇచ్చింది ఎవరు?, ఎంత ఖరీదు, ఏయే మెటీరియల్‌ అనే వివరాలు కోరారు. కశింకోట అధికారులు దానికి సమాధానం ఇవ్వకుండా ఆ లేఖను సింహాచలం డిపోనకు బదిలీ చేశారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి కోట్లాది రూపాయల విలువైన సామగ్రిని అప్పగించడమే కాకుండా ఆ వివరాలు లేవని చెప్పడాన్ని దరఖాస్తుదారు తీవ్రంగా తప్పుబట్టి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.

Updated Date - May 27 , 2025 | 01:40 AM