డిప్యూటీ వార్డెన్ పోస్టులకు పైరవీలు
ABN , Publish Date - Jun 22 , 2025 | 10:39 PM
మండలంలోని గిరిజన సంక్షేమశాఖ బాలికల ఆశ్రమ పాఠశాలల్లో డిప్యూటీ వార్డెన్ పోస్టుల కోసం ఉపాధ్యాయులు పైరవీలు చేస్తున్నారు. డిప్యూటీ వార్డెన్ బాధ్యతలు దక్కించుకునేందుకు ఉపాధ్యాయులు తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నారు.
బాలికల ఆశ్రమ పాఠశాలల్లో తీవ్ర స్థాయిలో పోటీ
మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసుతో అధికారులపై ఒత్తిడి తెస్తున్న టీచర్లు
గూడెంకొత్తవీధి, జూన్ 22 (ఆంధ్రజ్యోతి):
మండలంలోని గిరిజన సంక్షేమశాఖ బాలికల ఆశ్రమ పాఠశాలల్లో డిప్యూటీ వార్డెన్ పోస్టుల కోసం ఉపాధ్యాయులు పైరవీలు చేస్తున్నారు. డిప్యూటీ వార్డెన్ బాధ్యతలు దక్కించుకునేందుకు ఉపాధ్యాయులు తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నారు. నిబంధనలకు విరుద్ధ్దంగా మంత్రులు, ఎమ్మెల్యేల సిఫారసు లేఖలతో గిరిజన సంక్షేమశాఖ అధికారులపై ఒత్తిడి తీసుకు వస్తున్నారు. దీంతో ప్రధానోపాధ్యాయులు, గిరిజన సంక్షేమశాఖ అధికారులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమై పది రోజులు గడుస్తున్నప్పటికి జీకేవీధి, రింతాడ, ఆర్‌వీనగర్ ఆశ్రమ పాఠశాలల్లో డిప్యూటీ వార్డెన్ పోస్టులను ఇప్పటికీ భర్తీ చేయలేదు.
గిరిజన సంక్షేమశాఖ బాలికలు, బాలుర ఆశ్రమ పాఠశాలల్లో మెస్, విద్యార్థుల సంరక్షణ కోసం హెచ్‌డబ్ల్యూవో(పూర్తి స్థాయి వార్డెన్)లు ఉండాలి. పాడేరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆశ్రమ పాఠశాలలకు తగిన హెచ్‌డబ్ల్యూవోలు లేరు. దీంతో హెచ్‌డబ్ల్యూవో లేని ఆశ్రమ పాఠశాలలో స్థానిక ఎస్‌జీటీ(సెకండరీ గ్రేడ్ టీచర్)లకు డిప్యూటీ వార్డెన్ బాధ్యతలు అప్పగించాలి. ఎస్‌జీటీలు అందుబాటులో లేకుంటే పీఈటీ, పీడీలను డిప్యూటీ వార్డెన్‌గా నియమించాలి. ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. అయితే ఆశ్రమ పాఠశాలల్లో ఈ నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ అసిస్టెంట్లు, పీడీలు సైతం డిప్యూటీ వార్డెన్ బాధ్యతలు నిర్వహించడం పరిపాటిగా మారిపోయింది. కేవలం బాలికల ఆశ్రమ పాఠశాలల్లో డిప్యూటీ వార్డెన్ పోస్టుల కోసం ఉపాధ్యాయుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. గూడెంకొత్తవీధి బాలికల ఆశ్రమ పాఠశాలలో గత ఏడాది పీడీకి డిప్యూటీ వార్డెన్ బాధ్యతలు అప్పగించారు. ఈ ఏడాది వరుస క్రమంలో మరో ఎస్‌జీటీకి గాని, పీఈటీకి గాని అప్పగించాల్సి వుంది. అయితే ఓ వైసీపీ ఎమ్మెల్యే సిఫారసుతో మళ్లీ ఈ ఏడాది కూడా గత ఏడాది పనిచేసిన పీడీకి డిప్యూటీ వార్డెన్ బాధ్యతలు అప్పగించాలని ప్రధానోపాధ్యాయులు, టీడబ్ల్యూ డీడీపై ఒత్తిడి తెస్తున్నారు. ఆర్‌వీనగర్ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఈ ఏడాది వరుస క్రమంలో పీఈటీకి డిప్యూటీ వార్డెన్ బాధ్యతలు రావాలి. అయితే అక్కడి పీడీ.. డిప్యూటీ వార్డెన్ బాధ్యతలు కావాలని నామినేటెడ్ పదవిలో ఉన్న ఓ రాజకీయ నేత ద్వారా ఒత్తిడి తెస్తున్నారు. రింతాడ బాలికల ఆశ్రమ పాఠశాలలో డిప్యూటీ వార్డెన్ పోస్టు కోసం తెలుగు పండిట్, పీఈటీ పోటీ పడుతున్నారు. ఒకరు కేబినెట్ పదవిలో ఉన్న అధికార పార్టీకి చెందిన వ్యక్తి మద్దతు వుందని, మరో వ్యక్తి వైసీపీ ఎమ్మెల్యే మద్దతు ఉందని గిరిజన సంక్షేమశాఖ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. మూడు పాఠశాలల్లోనూ డిప్యూటీ వార్డెన్ పోస్టులకు ఉపాధ్యాయుల మధ్య పోటీ నెలకొనడంతో ప్రధానోపాధ్యాయులు, గిరిజన సంక్షేమశాఖ డీడీ ఎవరికి బాధ్యతలు అప్పగించాలో తెలియని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రధానోపాధ్యాయులు మెస్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. డిప్యూటీ వార్డెన్ నియామకాలపై కలెక్టర్, ఐటీడీఏ పీవోల పర్యవేక్షణ ఉండడంలేదు. దీంతో డిప్యూటీ వార్డెన్ పోస్టుల కోసం ఉపాధ్యాయులు పైరవీలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వున్నప్పటికి వైసీపీ నాయకుల సిఫారసులకే గిరిజన సంక్షేమశాఖ అధికారులు పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్, ఐటీడీఏ పీవో స్పందించి అర్హులకు డిప్యూటీ వార్డెన్ బాధ్యతలు అప్పగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.