డ్వాక్రా బజార్‌లో అమ్మకాల రికార్డు
ABN , Publish Date - Dec 29 , 2025 | 12:42 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించిన డ్వాక్రా బజార్‌లో రూ.19.06 కోట్ల రికార్డుస్థాయి అమ్మకాలు జరిగాయి.
మొత్తం వ్యాపారం రూ.19.06 కోట్లు
ఏపీ స్టాళ్లలో రూ.12.86 కోట్ల విక్రయాలు
తెలంగాణ స్టాళ్లు రూ.1.62 కోట్లు
రూ.1.79 కోట్లతో రాష్ట్రంలో విశాఖ జిల్లా ఫస్ట్
విశాఖపట్నం, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించిన డ్వాక్రా బజార్‌లో రూ.19.06 కోట్ల రికార్డుస్థాయి అమ్మకాలు జరిగాయి. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి 26 వరకూ నిర్వహించిన డ్వాక్రా బజార్‌లో మన రాష్ట్రం నుంచి ఏర్పాటుచేసిన స్టాళ్లలో రూ.12.86 కోట్ల విలువైన ఉత్పత్తులు అమ్ముడయ్యాయి. ఆ తరువాత తెలంగాణ రాష్ట్రం స్టాళ్ల నుంచి రూ.1.62 కోట్లు, ఉత్తరప్రదేశ్ స్టాళ్ల నుంచి రూ.1.26 కోట్ల వ్యాపారం జరిగింది.
స్వయంశక్తి సంఘాల మహిళలకు ఆర్థిక స్వావలంబన కోసం కేంద్ర, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖల సహాయంతో ప్రతి ఏటా ఈ ఎగ్జిబిషన్‌లు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది విజయనగరం, విశాఖపట్నం, గుంటూరులో డ్వాక్రా బజార్‌ల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి వచ్చింది. విశాఖలో నిర్వహించిన డ్వాక్రా బజార్‌లో 290 స్టాళ్లు ఏర్పాటుచేయగా, రాష్ర్టానికి 176 స్టాళ్లు, మిగిలినవి దేశంలోని 20 రాష్ట్రాల నుంచి వచ్చిన డ్వాక్రా సంఘాలకు కేటాయించారు. విశాఖ జిల్లా నుంచి డీఆర్‌డీఏ, మెప్మా, నాబార్డు, ఇతర సంస్థల సహకారంతో 56 స్టాళ్లు ఏర్పాటుచేశారు. స్వయంశక్తి సంఘాల సభ్యుల ఉత్పత్తులను మాత్రమే బజార్‌లో అనుమతించారు. చేనేత చీరలు, పట్టుచీరలు, చుడీదార్, తదితర డ్రెస్‌లు, హస్తకళ ఉత్పత్తులు, ఇత్తడి/కంచు, రాగి వస్తువులు, టెర్రకోట్ పెయింటింగ్స్, ఖాదీ ఉత్పత్తులు, కలంకారీ ఉత్పత్తులు, తినుబండారాలు, పచ్చళ్లు, ఇంటి అలంకరణ, మహిళల అలంకరణ వస్తువులు ఎక్కువగా అమ్ముడయ్యాయి.
విశాఖ జిల్లా టాప్
విశాఖ జిల్లా నుంచి ఏర్పాటుచేసిన 56 స్టాళ్లలో రూ.1.79 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయి. ఆ తరువాత గుంటూరు జిల్లా స్టాళ్ల ద్వారా రూ1.19 కోట్ల విలువైన ఉత్పత్తులు, అనకాపల్లి డ్వాక్రా మహిళలు రూ.84 లక్షల విలువైన ఉత్పత్తులు, విజయనగరం జిల్లా మహిళలు రూ.82 లక్షల విలువైన ఉత్పత్తులు విక్రయించారు. డ్వాక్రా బజార్ నిర్వహణకు సుమారు రూ.కోటి ఖర్చయింది. ప్రభుత్వం రూ.35 లక్షలు మంజూరుచేయగా, కొంత మొత్తం నాబార్డు, బ్యాంకులు, నగరంలో స్పాన్సర్ల నుంచి సమీకరించారు. డ్వాక్రా బజార్‌లో స్టాళ్లు ఏర్పాటుచేసిన సుమారు 600 మంది మహిళలు, వారి సహాయకులకు ఉచిత భోజనం, రవాణా, వసతి కల్పించామని డీఆర్‌డీఏ పీడీ బెందాళం లక్ష్మీపతి తెలిపారు. మహిళలు తయారుచేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు డ్వాక్రా బజార్‌లు ఏర్పాటుచేస్తున్నామన్నారు. రెండేళ్ల క్రితం విశాఖలో నిర్వహించిన బజార్‌లో రూ.10 కోట్ల విలువైన వ్యాపారం జరగ్గా, ఈ ఏడాది దక్షిణ భారతదేశంలోనే అత్యధికంగా రూ.19.02 కోట్ల వ్యాపారం జరిగిందన్నారు.