500 కోట్లతో ఆలయాల పునర్నిర్మాణం
ABN , Publish Date - Jul 26 , 2025 | 01:03 AM
రాష్ట్రవ్యాప్తంగా రూ.500 కోట్లతో పలు దేవాలయాల పునర్నిర్మాణం చేపడుతున్నామని దేవదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.
దేవాస్థానాలన్నింటికీ పాలక మండళ్లను నియమిస్తాం
ఇన్‌చార్జుల పాలనకు త్వరలో స్వస్తి
దేవాలయాల భద్రతకు త్వరలో ప్రత్యేక విభాగం ఏర్పాటు
మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
సింహాచలం, జూలై 25 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్రవ్యాప్తంగా రూ.500 కోట్లతో పలు దేవాలయాల పునర్నిర్మాణం చేపడుతున్నామని దేవదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆలయాల పరిమాణాన్ని బట్టి 18 నుంచి 24 నెలలు వ్యవధిని నిర్ణయించి, తగిన ప్రణాళికలు సిద్ధం చేసి, పనులు చేపడుతున్నామన్నారు. త్వరలోనే అన్ని దేవాలయాలకు పాలకమండళ్లను నియమిస్తామన్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను కమిషనర్ విడుదల చేశారన్నారు. గత ప్రభుత్వం కొన్ని ఆలయాలకు నియమించిన పాలకమండళ్ల కాలం ఈ ఏడాది ఆఖరువరకు ఉందని, వాటి గడువు ముగిసిన తరువాత మాత్రమే నూతన పాలక మండళ్లను నియమిస్తామన్నారు. దేవదాయ శాఖలో ఇన్‌చార్జిల పాలనకు త్వరలోనే ముగింపు పలుకుతామని మంత్రి పేర్కొన్నారు. దానికి అనుగుణంగా శాఖలో ఖాళీలు, పదోన్నతులు, రూల్ పొజిషన్, కేడర్ స్ట్రెంగ్త్ వంటి అంశాలపై అధ్యయనం జరుగుతోందన్నారు. దేవదాయ శాఖ కమిషనర్, కార్యదర్శుల నివేదికల ఆధారంగా ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో పదోన్నతులు కల్పిస్తామని, తద్వారా పూర్తిస్థాయి అధికారుల నియామకం జరుగుతుందన్నారు.
దేవాలయాల భద్రతలో మార్పులు తీసుకువస్తున్నామని, త్వరలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రధాన ఉత్సవాల వేళ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుని, ప్రమాదాలు సంభవించకుండా తగిన వ్యవస్థను రూపొందిస్తున్నట్టు చెప్పారు. ఆయా ఆలయాల స్థితిగతులను అధ్యయనం చేసి భక్తులకు వసతి సౌకర్యాన్ని అభివృద్ధి చేసేందుకు మాస్లర్‌ప్లాన్ రూపొందించి, పనులు చేపడతామన్నారు. ఎన్‌ఎంఆర్‌ల క్రమబద్ధీకరణ సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉందని, ఏళ్లుగా పనిచేస్తున్న వారిని తొలగించే ప్రసక్తే లేదని, వారికి న్యాయం చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు.
అర్చకులు జీవితకాలం పనిచేసే విధంగా ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలను సవరించాలని దేవాలయ స్థానాచార్యులు, ప్రధానార్చకులు మంత్రికి సూచించారు. దీనివల్ల భవిష్యత్తులో వైదిక వృత్తిలోకి యువత ప్రవేశించేందుకు దారులు మూసుకుపోతాయన్నారు. ఈ అంశంపై చర్చిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. చందనోత్సవం సమయంలో గోడ కూలిన ప్రాంతంలోని మెట్లను తక్షణమే పునరుద్ధరించాలని ఈఓను ఆదేశించారు.
వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శనానికి వచ్చిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి పూర్తి అధికార లాంఛనాలతో ఈఓ వేండ్ర త్రినాథరావు ఆహ్వానం పలికారు. మంత్రి గోత్రనామాలతో అంతరాలయంలో అర్చకులు పూజలు చేసి శేషవస్త్రాన్ని పర్యవేట్టంగా చుట్టారు. అనంతరం కప్పస్తంభం ఆలింగనం, గోదాదేవి అమ్మవారి సన్నిధిలో పూజలు తరువాత పండితులు చతుర్వేద స్వస్తి వచనాలతో ఆశీర్వచనాలీయగా, ఈఓ శాలువాతో సత్కరించి స్వామి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. మంత్రిని దేవదాయశ ాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్.సుజాత, ఏసీ అన్నపూర్ణ, కనకమహాలక్ష్మీ అమ్మవారి దేవస్థానం ఈఓ శోభారాణి, తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు.
పంచ గ్రామాల భూ సమస్యకు త్వరలో పరిష్కారం
సింహాచలం దేవస్థానానికి సంబంధించి పంచగ్రామాల భూవివాదానికి త్వరలో పరిష్కారం లభిస్తుందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. గత నివేదికల ఆధారంగా 12,149 మంది నివాసితులకు తక్షణ ఉపశమనం కలిగించేందుకు కృషిచేస్తున్నామన్నారు. ప్రత్యామ్నాయంగా దేవస్థానానికి స్థలాన్ని బదలాయించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ విషయాన్ని అడ్వకేట్ జనరల్ ద్వారా న్యాయస్థానానికి నివేదించామన్నారు. దీనిపై త్వరలోనే సానుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నామని, ఆ వెంటనే ఇళ్ల నిర్మాణాల క్రమబద్ధీకరణ చేపడతామన్నారు.