Share News

నేటి నుంచి పీ4 సర్వేపై పునఃపరిశీలన

ABN , Publish Date - Jul 15 , 2025 | 12:52 AM

పేదరికంలేని సమాజ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర- 2047, పీ4 సర్వేపై రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో ఈ నెల 15వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పునఃధ్రువీకరణ సర్వే ప్రక్రియ చేపట్టాలని అధికారులకు కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

నేటి నుంచి పీ4 సర్వేపై పునఃపరిశీలన
మాట్లాడుతున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, పక్కన జేసీ అభిషేక్‌గౌడ

అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

మండల స్థాయి కమిటీలతో ప్రక్రియ

పాడేరు, జూలై 14(ఆంధ్రజ్యోతి): పేదరికంలేని సమాజ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర- 2047, పీ4 సర్వేపై రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో ఈ నెల 15వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పునఃధ్రువీకరణ సర్వే ప్రక్రియ చేపట్టాలని అధికారులకు కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు గానూ ఈనెల 11న మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేశామని ప్రకటించారు. అలాగే కమిటీ సభ్యులు గ్రామ, వార్డు స్థాయిలో పర్యటించి గత మార్చి నెలలో జరిగిన పీ4 సర్వేలో గుర్తించిన బంగారు కుటుంబాల జాబితాను పునఃపరిశీలన చేయాలని ఆదేశించారు. వారి పరిశీలన అనంతరం జాబితాలను సంబంధిత గ్రామ సచివాలయం/పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించాలని కలెక్టర్‌ ఆదేశించారు.

పీ4 పరిశీలనకు మండల స్థాయి కమిటీలు

జిల్లాలో పీ4 సర్వేలో బంగారు కుటుంబాల పరిశీలనకు మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. ఆయా కమిటీల్లో మండల ప్రత్యేకాధికారి చైర్‌పర్సన్‌గా, ఎంపీడీవో కన్వీనర్‌గా, తహశీల్దార్‌, ఎంఈవో, పంచాయతీరాజ్‌, గ్రామీణ నీటి సరఫరా విభాగం, గిరిజన సంక్షేమం, రోడ్ల, భవణాలు, హౌసింగ్‌ శాఖలకు చెందిన అసిస్టెంట్‌ ఇంజనీర్లు, డాక్టర్‌, ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు/ట్రస్ట్‌ల ప్రతినిధులు సభ్యులుగా వ్యవహరిస్తూ సర్వే ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తారని పేర్కొన్నారు.

పేదరికం లేని సమాజ నిర్మాణానికి చర్యలు

ప్రభుత్వ ఆశయాల మేరకు బంగారు(పేద) కుటుంబాలను దత్తత తీసుకుని పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలని కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ అన్నారు. పీ4 విధానంపై సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌, ప్రత్యక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలకు ఆర్థిక సహాయం మాత్రమే కాదని, విద్య, వైద్య రంగాలలోనూ సహాయం అందించాలన్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు విద్యార్థులను దత్తత తీసుకొని బంగారు కుటుంబాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేదలకు అందించి పేదరిక నిర్మూలనకు కృషి చేయాలన్నారు. బంగారు కుటుంబాలకు సహాయం చేసేందుకు మార్గదర్శులను గుర్తించాలని, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, కాంట్రాక్టర్లు పేదరిక నిర్మూలనకు తోడ్పాటు అందించాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ ఎంజే.అభిషేక్‌గౌడ, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పీవోలు కె.సింహాచలం, అపూర్వభరత్‌, సీపీవో పి.ప్రసాద్‌, జిల్లా పరిశ్రమ శాఖాధికారి రవిశంకర్‌, డీఆర్‌డీఏ పీడీ వి.మురళి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ టి.విశ్వేశ్వరనాయుడు, డివిజనల్‌ పంచాయతీ అధికారి పీఎస్‌.కుమార్‌, జిల్లాలోని 22 మండలాలకు చెందిన ఎంపీడీవోలు, తహశీల్దార్లు పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2025 | 12:52 AM