Share News

ఆర్‌ఈసీ రోడ్డు అధ్వానం

ABN , Publish Date - Nov 03 , 2025 | 01:05 AM

రావికమతం నుంచి తట్టబంద మీదుగా తోటకూరపాలెం వెళ్లే (ఆర్‌ఈసీ) ఆర్‌అండ్‌బీ రోడ్డు తుఫాన్‌ వర్షాలకు ఆధ్వానంగా మారింది. ఎక్కడికక్కడ గోతులు ఏర్పడి వాహన చోదకులకు నరకప్రాయంగా మారింది. కొన్నిచోట్ల రోడ్డు మొత్తం భారీ గొయ్యి ఏర్పడి, వర్షం నీటితో చెరువులను తలపిస్తున్నాయి. దీంతో అనకాపల్లి నుంచి తట్టబంద రావికమతం నడిచే బస్సు సర్వీసుల్లో కొన్నింటిని రద్దు చేశారు. మిగిలిన వాటిని గొంప మీదుగా నడుపుతున్నారు. దీంతో తట్టబంద, గుడ్డిప పంచాయతీల పరిధిలోని పలు గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

ఆర్‌ఈసీ రోడ్డు అధ్వానం
దాసరియ్యపాలెం వద ్ద భారీ గోతులు

అడుగుకో గొయ్యి.. గజానికో గుంత

ద్విచక్ర వాహనాలు సైతం వెళ్లలేని దుస్థితి

తట్టబంద మీదుగా బస్సులు ఆపేసిన అధికారులు

తీవ్ర ఇబ్బందులు పడుతున్న పలు గ్రామాల ప్రజలు

రావికమతం, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): రావికమతం నుంచి తట్టబంద మీదుగా తోటకూరపాలెం వెళ్లే (ఆర్‌ఈసీ) ఆర్‌అండ్‌బీ రోడ్డు తుఫాన్‌ వర్షాలకు ఆధ్వానంగా మారింది. ఎక్కడికక్కడ గోతులు ఏర్పడి వాహన చోదకులకు నరకప్రాయంగా మారింది. కొన్నిచోట్ల రోడ్డు మొత్తం భారీ గొయ్యి ఏర్పడి, వర్షం నీటితో చెరువులను తలపిస్తున్నాయి. దీంతో అనకాపల్లి నుంచి తట్టబంద రావికమతం నడిచే బస్సు సర్వీసుల్లో కొన్నింటిని రద్దు చేశారు. మిగిలిన వాటిని గొంప మీదుగా నడుపుతున్నారు. దీంతో తట్టబంద, గుడ్డిప పంచాయతీల పరిధిలోని పలు గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

అడుగుకో గొయ్యితో బస్సుల కమాన్‌ కట్టలు నేలకు తగిలి, బస్సు బోల్తా పడే ప్రమాదం ఉందని, ఈ కారణంగా ఆ మార్గంలో బస్సులను నడపలేకపోతున్నాయని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. గోతులు పూడ్చే వరకు బస్సులను నడపలేమని సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. తట్టబంద, తోటకూరపాలెం రూట్‌లో ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో అనకాపల్లిలో కళాశాలలకు, మరుపాకలోని మోడల్‌ స్కూల్‌కు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది విద్యార్థులు తాత్కాలికంగా మానేశారు. ప్రస్తుతం ఈ రోడ్డులో ద్విచక్ర వాహనాలు కూడా నడవడానికి వీలు కాని పరిస్థితి నెలకొంది.

రావికమతం, బుచ్చెయ్యపేట, మాకవరపాలెం మండలాల్లో సుమారు వంద గ్రామాల ప్రజలు అనకాపల్లి వెళ్లడానికి ఇదే ప్రధాన రహదారి. కొంతకాలం నుంచి క్వారీ లారీలు, గ్రానైట్‌ బండలను రవాణా చేసే భారీ వాహనాలు ఈ మార్గంలో వెళుతుండడం, మరోవైపు గత ప్రభుత్వం ఒక్కఏడాది కూడా నిర్వహణ పనులు చేపట్టకపోవడంతో రోడ్డు మొత్తం ఛిద్రమైంది. అడుగడుగునా గోతులు ఏర్పడి దారుణంగా తయారైంది. కొన్నిచోట్ల భారీ వాహనాలు గోతుల్లో కూరుకుపోవడంతో ట్రాఫిక్‌ స్తంభిస్తున్నది. ఇటువంటి సమయంలో పురుటి నొప్పులు వచ్చిన గర్భిణులను ఆస్పత్రికి తరలించడానికి కుటుంబ సభ్యులు నానాపాట్లు పడాల్సి వస్తున్నది. గోతుల వద్ద వాహనం కుదుపులకు దారిలోనే ప్రసవం అవుతుందా? అన్నట్టుగా పరిస్థితి వుంటుంది. తోటకూరపాలెం నుంచి తీడ, కన్నూరుపాలెం మీదుగా తాళ్లపాలెం వరకు రహదారిని ఇటీవలే అభివృద్ధి చేశారు. ఇటు తోటకూరపాలెం నుంచి రావికమతం వరకు కనీసం గోతులైనా పూడ్చాలని వాహనదారులు, పలు గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రోడ్డు అభివృద్ధి గురించి ఆర్‌అండ్‌బీ జేఈ సాయిశ్రీనివాస్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. అభివృద్ధి పనులకు రూ.3 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదించాలమని, నిధులు మంజూరైన వెంటనే టెండర్లు పిలిపి పనులు మొదలుపెడతామని చెప్పారు.

Updated Date - Nov 03 , 2025 | 01:05 AM