Share News

‘వరుణ్‌’కు వరాలు

ABN , Publish Date - May 23 , 2025 | 01:30 AM

‘వరుణ్‌’ గ్రూపు సంస్థల అధినేత ప్రభుకిశోర్‌ నగరంలోని ఆర్కే బీచ్‌ రోడ్డులో తాజ్‌ గేట్‌వే హోటల్‌ స్థానంలో ‘వరుణ్‌ హాస్పటాలిటీ’ సంస్థ పేరిట నిర్మిస్తున్న మెగా ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీల రూపంలో వరాల జల్లు కురిపించింది.

‘వరుణ్‌’కు వరాలు

  • ‘తాజ్‌ వరుణ్‌ బీచ్‌’ పేరిట చేపట్టనున్న మెగా ప్రాజెక్టుకు రాయితీలు

  • 15 ఏళ్లు రాష్ట్ర జీఎస్‌టీ 100 శాతం రీయింబర్స్‌మెంట్‌

  • స్టాంపు డ్యూటీ, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీ 100 శాతం రీయింబర్స్‌మెంట్‌

  • పెట్టుబడి ప్రోత్సాహకం రూ.40 కోట్లు

  • పరిశ్రమల విభాగం కింద విద్యుత్‌ చార్జీలు

  • పెట్టుబడి రూ.722 కోట్లు, 1,300 మందికి ఉపాధి

విశాఖపట్నం, మే 22 (ఆంధ్రజ్యోతి):

‘వరుణ్‌’ గ్రూపు సంస్థల అధినేత ప్రభుకిశోర్‌ నగరంలోని ఆర్కే బీచ్‌ రోడ్డులో తాజ్‌ గేట్‌వే హోటల్‌ స్థానంలో ‘వరుణ్‌ హాస్పటాలిటీ’ సంస్థ పేరిట నిర్మిస్తున్న మెగా ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీల రూపంలో వరాల జల్లు కురిపించింది. ఆ స్థలంలో 260 గదులతో ఫైవ్‌ స్టార్‌ హోటల్‌, 90 సర్వీస్‌ అపార్ట్‌మెంట్లు, 12,750 చ.అ. విస్తీర్ణంలో కన్వెన్షన్‌ సెంటర్‌, టెక్నాలజీ స్పేస్‌ (2,500 సీటింగ్‌ కెపాసిటీ)తో నిర్మించే భవన సముదాయానికి ‘తాజ్‌ వరుణ్‌ బీచ్‌’గా నామకరణం చేశారు. దీనికి పెట్టుబడి రూ.722 కోట్లు అవుతుందని అంచనా. సంస్థ సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక ప్రకారం నిర్మాణం పూర్తయ్యేసరికి వ్యయం రూ.899.5 కోట్లు అవుతుందని, 318 గదులతో హోటల్‌ వస్తుందని, అందులో 1,300 మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొంది. ఈ ప్రతిపాదనలు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ముందుంచగా 2024-29 ఏపీ టూరిజం పాలసీ ప్రకారం ఆలా్ట్ర మెగా ప్రాజెక్టుగా గుర్తించి సంస్థ కోరిన రాయితీలు ఇవ్వాలని సిఫారసు చేసింది. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ ఈ నెల 15వ తేదీన సమావేశమై రాయితీలను ఇవ్వవచ్చునని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దాని ప్రకారం వరుణ్‌ హాస్పిటాలిటీ సంస్థకు దిగువ పేర్కొన్న రాయితీలన్నీ లభిస్తాయి. అంతేకాకుండా నోవాటెల్‌ నుంచి ఇటు వైపు ఉన్న వరుణ్‌ హాస్పటాలిటీ భవన సముదాయానికి ఐకానిక్‌ ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిని కూడా నిర్మించాలని ప్రభుత్వం సూచించింది. ఈ బాధ్యతను వీఎంఆర్‌డీఏకు అప్పగించింది. అంటే రోడ్డుకు అటు ఇటు ఉండే హోటళ్లను కలుపుతూ అందమైన డిజైన్డ్‌ బ్రిడ్జి నిర్మిస్తారు.

ప్రకటించిన రాయితీలు

- రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించే జీఎస్‌టీ 15 ఏళ్లు రీఎంబర్స్‌మెంట్‌ చేసుకోవచ్చు. అంటే జీరో ఎస్‌జీసీటీ.

- ప్రాజెక్టు ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై 100 శాతం స్టాంపు డ్యూటీ, 100 శాతం ట్రాన్స్‌ఫరీ డ్యూటీ రీఎంబర్స్‌మెంట్‌.

- భూ వినియోగ మార్పిడి ఫీజులు 100 శాతం రీఎంబర్స్‌మెంట్‌.

- భూమి, భవనాలు, షెడ్లు వంటి లీజు ఒప్పందాలపై 100శాతం స్టాంపు డ్యూటీ రీఎంబర్స్‌మెంట్‌.

- పెట్టుబడి ప్రోత్సాహంగా ఆల్ర్టా మెగా టూరిజం విభాగంలోమ రూ.40 కోట్లు ప్రోత్సాహకం. దీనిని ఏడాదికి ఎనిమిది కోట్టు చెప్పిన ప్రభుత్వం ఇస్తుంది.

- హోటళ్లకు సాధారణంగా వాణిజ్య విభాగంలో విద్యుత్‌ ఛార్జీలు వసూలు చేస్తారు. అంటే యూనిట్‌కు పది రూపాయలపైనే పడుతుంది. ఇపుడు ఈ సంస్థకు పరిశ్రమల రేటుకు అంటే యూనిట్‌ ఆరు రూపాయలకే ఇవ్వనున్నారు.

- విద్యుత్‌ సుంకం యూనిట్‌పై రూపాయి వసూలు చేస్తారు. దీనిని ఐదేళ్లు వరకు రీఎంబర్స్‌మెంట్‌ చేసుకోవచ్చు. ఇది ఏడాదికి రూ.82.8 లక్షలు వరకు ఉంటుంది.

- ఆస్తిపన్ను, నీటి సరఫరా ఛార్జీలు, మురుగునీటి ఛార్జీలు, అన్నీ పరిశ్రమల విభాగం కింద నిర్ణయిస్తారు. అంటే తక్కువ ఛార్జీలే వర్తిస్తాయి.

- ఉపాధి కల్పించిన వారి సంఖ్యను బట్టి ఎంప్లాయిమెంట్‌ ఇన్సెంటివ్‌ కూడా ఇస్తారు.

Updated Date - May 23 , 2025 | 01:30 AM