అబద్ధాల సృష్టి!
ABN , Publish Date - Aug 13 , 2025 | 12:54 AM
‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకుల అక్రమాలు తవ్వుతున్న కొద్దీ వెలుగులోకి వస్తున్నాయి.
అమాయకులను నిలువునా మోసగించిన ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకులు
హైదరాబాద్ సెంటర్ కన్సల్టింగ్‌కు మాత్రమే
విశాఖ కేంద్రంగానే అడ్డగోలు వ్యవహారాలు
సరోగసీ పేరుతో దంపతుల నుంచి భారీ మొత్తంలో వసూలు
పదుల సంఖ్యలో నవజాత శిశువుల విక్రయాలు సాగినట్టు నిర్ధారణ
విశాఖపట్నం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి):
‘సృష్టి’ ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకుల అక్రమాలు తవ్వుతున్న కొద్దీ వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ సెంటర్‌ను కన్సల్టింగ్‌కు మాత్రమే వినియోగించిన నిర్వాహకులు...మొత్తం వ్యవహారమంతా విశాఖలోనే నడిపినట్టు అక్కడి పోలీసులు తేల్చారు. ఇక్కడ అనధికారికంగా నిర్వహించిన సెంటర్‌లో నకిలీ సరోగసీ, పిల్లల అమ్మకాలు, అక్రమ రవాణా వంటి వాటికి పాల్పడినట్టు నిర్ధారించారు. పిల్లలు లేని దంపతులు హైదరాబాద్‌లోని సృష్టి సెంటర్‌కు వెళితే అక్కడ పరీక్షలు నిర్వహించిన అనంతరం మిగిలిన ప్రక్రియను విశాఖలో కొనసాగిస్తున్నట్టు చెప్పేవారు. ఈ మేరకు ఇప్పటివరకూ జరిగిన విచారణ వివరాలను హైదరాబాద్ పోలీసులు మంగళవారం మీడియా సమావేశంలో వెల్లడించారు.
సరోగసీ నిర్వహించినట్టు వసూలు
పిల్లలు లేని దంపతులను దళారులు గుర్తించి సృష్టి సెంటర్‌కు తీసుకువెళ్లేవారు. ఆస్పత్రికి వచ్చిన వారిని ఐవీఎఫ్, సరోగసీకి ఒప్పించడం వైద్యుల బాధ్యత. ఇందుకోసం ఉన్నత స్థాయిలో వైద్యుల నుంచి కింది స్థాయిలో దళారులు, గర్భం దాల్చి బిడ్డను వద్దనుకునే గర్భిణుల వరకూ అందరినీ సృష్టి యాజమాన్యం అత్యంత పక డ్బందీగా సమకూర్చుకుంది. పిల్లలు కావాలని ఎవరైనా సృష్టి ఆస్పత్రికి వస్తే వారికి తొలుత ఐవీఎఫ్ పేరుతో వైద్యం అందించడం, ఆ తరువాత అది సక్సెస్ కాలేదని చెప్పి సరోగసీకి ఒప్పించడం చేస్తుండేవారు. ఇలా సరోగసీకి ఒప్పుకున్న దంపతులకు పరీక్షలు నిర్వహించడం, వీర్యం సేకరించడం వంటివి చేసేవారు. తదుపరి ప్రక్రియను విశాఖలో నిర్వహిస్తున్నామని చెప్పేవారు. ఈ క్రమంలో వారికి బిడ్డను అప్పగించే తేదీని కూడా చెబుతారు. అయితే, విశాఖలోని కేంద్రంలో సరోగసీ మాత్రం నిర్వహించరు. సరోగసీ ప్రక్రియ కొనసాగు తున్నట్టు ఎప్పటికప్పుడు సదరు క్లయింట్స్‌కు ఆలా్ట్రసౌండ్ పరీక్షలకు సంబంధించిన ఫొటోలు పెడుతుంటారు. వారికి చెప్పిన తేదీకి ప్రసవం అయ్యే గర్భిణిని గుర్తించే బాధ్యతను దళారులు చూసుకుంటారు. ముఖ్యంగా అసహజ గర్భధారణ జరిగిన, బిడ్డ వద్దనుకునే వారిని గుర్తించి వారికి ఈ కేంద్రంలో ప్రసవాన్ని నిర్వహించేవారు. ఆ బిడ్డను సదరు క్లయింట్స్‌కు వారి బిడ్డగా అప్పగించి ఆర్థిక ఆర్థిక స్థితిని బట్టి రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వసూలు చేసేవారు. ఇలా గర్భిణిని సమకూర్చిన దళారులకు బిడ్డ పాప అయితే రూ.3.5 లక్షలు, బాబు అయితే రూ.4.5 లక్షలు సృష్టి యాజమాన్యం చెల్లించేది. ఇందులోనే కొంత మొత్తాన్ని బిడ్డ ఇచ్చిన మహిళకు సదరు దళారులు చెల్లించేవాళ్లు. ఇలా అక్రమంగా నవజాత శిశువుల విక్రయాన్ని పకడ్బందీగా కొన్నేళ్ల నుంచి నిర్వహిస్తూ వచ్చారు. అలా ఇచ్చిన బిడ్డకు తమ డీఎన్‌ఏ మ్యాచింగ్ కాకపోవడంతో చేసిన ఫిర్యాదుతో సృష్టి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.
నిద్రమత్తులో ఆరోగ్య శాఖ
సృష్టి వ్యవహారాలు విశాఖ కేంద్రంగా జరిగినా ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం గుర్తించలేదు. ఈ సెంటర్‌కు 2018లో అనుమతి ఇచ్చారు. 2023 నుంచి సదరు యాజమాన్యం రెన్యువల్ కూడా చేయించుకోలేదు. ఈ ఐదేళ్లలో ఇక్కడ అనేక అక్రమాలు, ఫేక్ సరోగసీ జరిగినా పట్టించు కోలేదు. తూతూమంత్రంగా తనిఖీలు నిర్వహించి వెళ్లిపోవడం వల్లే ఈ వ్యవహారాలను గుర్తించలేక పోయినట్టు చెబుతున్నారు. ఇకపోతే, ఇప్పటి వరకు విశాఖ కేంద్రంలో పనిచేసిన ముగ్గురు వైద్యులు, నలుగురు దళారులను అరెస్టు చేశారు. మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో అరెస్టు అయిన డాక్టర్ విద్యుల్లత పిల్లల ఆరోగ్యాన్ని పర్యవేక్షించేవారు. డాక్టర్ ఉషాదేవి ప్రసవాలకు సంబంధించి విషయాలను చూసేవారు. వీరికి డాక్టర్ నమ్రతతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు చెబుతున్నారు. డాక్టర్ వాసుపల్లి రవి అనస్థీషియాకు సంబంధించిన సేవలను అందించారు.
ఐవీఎఫ్, సరోగసి అంటే...
ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) ప్రక్రియలో స్ర్తీ నుంచి అండాలను, పురుషుడి నుంచి వీర్య కణాలను సేకరించి ప్రయోగశాలలో ఫలదీకరణ చేస్తారు. ఇలా ఫలదీకరణ చేయడం ద్వారా ఏర్పడే పిండాన్ని స్ర్తీ గర్భాశయంలోకి పంపిస్తారు. ఈ విధంగా దంపతులకు సంతానం కలిగేలా చేస్తారు. గర్భ సంచి సమస్యతో బాధపడే మహిళ తల్లి కావాలనుకుంటే ఇదే ప్రక్రియను మరో మహిళ గర్భం (అద్దె గర్భం)లో చేస్తారు. దీనిని సరోగసీ అంటారు. సరోగసీలో బిడ్డను కని ఇచ్చే తల్లికి బిడ్డతో సంబంధం ఉండదు. ఇందుకు సంబంధించిన కీలకమైన ఉత్తర్వులను కూడా కేంద్రం గతంలో విడుదల చేసింది.