గూగుల్ రాకతో రియల్టర్ల హడావిడి
ABN , Publish Date - Oct 25 , 2025 | 01:22 AM
ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకానున్న నేపథ్యంలో ఆ చుట్టుపక్కల భూముల కోసం రియల్టర్లు తెగ తిరుగుతున్నారు.
ఆనందపురంతో పాటు భీమిలి మండలంలో భూముల కోసం వేట
ఇదే పనిలో కీలక నేతల బంధువులు
విశాఖపట్నం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి):
ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకానున్న నేపథ్యంలో ఆ చుట్టుపక్కల భూముల కోసం రియల్టర్లు తెగ తిరుగుతున్నారు. రైతులతో మాట్లాడుతున్నారు. ఆనందపురం మండలంలో గూగుల్ డేటా సెంటర్‌తో పాటు మరికొన్ని సంస్థలు వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో భూములకు డిమాండ్ పెరుగుతోంది.
అయితే ఆనందపురం, భీమిలి, పెందుర్తి, పద్మనాభం మండలాల్లో సుమారు 3,500 ఎకరాల (డి.పట్టా భూములు)ను ఇళ్ల నిర్మాణం నిమిత్తం గత ప్రభుత్వం సమీకరించింది. అలాగే వీఎంఆర్‌డీఏ ఎంఐజీ లేఅవుట్‌ల కోసం ఆనందపురం మండలంలో సుమారు 1,000 ఎకరాల వరకూ తీసుకుంది. పేదల ఇళ్లు, వీఎంఆర్‌డీఏ ఎంఐజీ లేఅవుట్‌లకు సమీకరించిన భూములకుగాను ఎకరాకు అభివృద్ధి చేసిన 900 గజాలు, 450 గజాల ప్లాట్లు ఇచ్చారు. ఆ ప్లాట్లు ఒకేచోట ఇవ్వడంతో ఇప్పుడు వాటిపై రియల్టర్ల కన్ను పడింది. గంపగుత్తగా కొనుగోలు చేసి భవిష్యత్తులో వెంచర్లు వేసుకోవాలని భావిస్తున్నారు. అలాగే ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న కొందరు నేతల బంధువులు కూడా విశాఖలో భూముల గురించి ఆరా తీస్తున్నారు. ఒక కీలక నేత కుమారుడు రెండు రోజులుగా విశాఖలోనే మకాం వేసి ఆనందపురం, భీమిలి, పద్మనాభం మండలాల్లో భూములు కొనుగోలుకు తెలిసిన బ్రోకర్ల ద్వారా మంతనాలు చేస్తున్నారు. మరో కీలక నేత బంధువులు విశాఖ నగరానికి సమీపంలో గల గ్రామాల్లో భూములు వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. డేటా సెంటర్ రాకతో తమ మండలంలో భూములకు డిమాండ్ పెరిగిందని ఆనందపురానికి చెందిన టీడీపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. భూముల కోసం వారం రోజులుగా వ్యాపారులు వస్తున్నారని గిడిజాలకు చెందిన రైతులు పేర్కొన్నారు.