రియల్టర్ బరితెగింపు
ABN , Publish Date - Dec 26 , 2025 | 12:26 AM
జిల్లా కేంద్రం అనకాపల్లి పరిసరాల్లో భూముల ధరలు పెరుగుతుండడంతో అక్రమార్కుల కన్ను ప్రభుత్వ భూములపై పడింది. కొండ వాగులు, గోర్జ భూములను సైతం వదలడం లేదు. అక్రమార్కులు ప్రభుత్వ భూములను కలిపేసుకుని మరీ లేఅవుట్లు వేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
గోర్జ భూమినీ వదల్లే!..
- రూ.అరకోటి విలువైన భూమి హాంఫట్
- కలిపేసుకుని దర్జాగా లేఅవుట్ వేస్తున్నా పట్టించుకోని అధికారులు
- ఆక్రమణపై కలెక్టర్‌కు కొండుపాలెం గ్రామస్థుల ఫిర్యాదు
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
జిల్లా కేంద్రం అనకాపల్లి పరిసరాల్లో భూముల ధరలు పెరుగుతుండడంతో అక్రమార్కుల కన్ను ప్రభుత్వ భూములపై పడింది. కొండ వాగులు, గోర్జ భూములను సైతం వదలడం లేదు. అక్రమార్కులు ప్రభుత్వ భూములను కలిపేసుకుని మరీ లేఅవుట్లు వేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
అనకాపల్లి మండలంలోని కొండుపాలెం రెవెన్యూ పరిధి సర్వే నంబరు 55 సబ్ డివిజన్ 31లో గల సుమారు 58 సెంట్ల గోర్జ భూమి మీదుగా ఎన్నో ఏళ్లుగా గ్రామ రైతులు పొలం పనుల కోసం రాకపోకలు సాగిస్తున్నారు. అనకాపల్లి జిల్లా కేంద్రం కావడం, దీనికి తోడు జాతీయ రహదారికి, కలెక్టరేట్ కార్యాలయానికి సమీపంలో కొండుపాలెం గ్రామం ఉండడంతో ఇక్కడ భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. మార్కెట్ ధర సెంటు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ధర పలుకుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొండుపాలెం పరిసరాల్లోని రైతుల నుంచి భూములను పెద్దఎత్తున కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల అదే గ్రామంలో సర్వే నంబరు 50, 55లలో కొన్ని సబ్ డివిజన్‌లకు చెందిన భూములను ఒక రియల్టర్ రైతుల నుంచి కొనుగోలు చేశారు. ఇటీవల అక్కడ లేఅవుట్ పనులు ప్రారంభించారు. అయితే సర్వే నంబరు 55లోని 31వ సబ్ డివిజన్‌లో గల గోర్జభూమిగా రెవెన్యూ రికార్డుల్లో నమోదైన సుమారు 58 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని లేఅవుట్‌లో కలుపుకొని దర్జాగా వెంచర్ పనులు కానిచ్చేస్తున్నారు. కాగా తమ పూర్వీకుల కాలం నుంచి ఈ గోర్జభూమి మీదుగా పంట పొలాలకు రాకపోకలు సాగిస్తున్నామని, దాన్ని ఎలా ఆక్రమిస్తారని రియల్టర్‌ను కొండుపాలెం గ్రామస్థులు ప్రశ్నించినా ఫలితం లేకపోయింది. సుమారు అరకోటి విలువ చేసే ఈ గోర్జ భూమిని రియల్టర్ చదును చేసి లేఅవుట్‌లో కలిపేశారని కలెక్టర్‌కు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇక్కడి అధికారులు స్పందించకపోతే సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లకు ఫిర్యాదు చేస్తామని స్థానికులు చెబుతున్నారు.