‘భూ’మ్
ABN , Publish Date - Dec 26 , 2025 | 12:08 AM
విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ బూమ్ మళ్లీ మొదలైంది.
వీఎంఆర్‌డీఏ గతంలో ఎప్పుడో వేసిన లేఅవుట్లలో మిగిలిపోయిన ప్లాట్లకు ఇప్పుడు డిమాండ్
కొన్ని ప్రాంతాల్లో అప్‌సెట్ ధర కంటే చదరపు గజానికి రూ.10 వేలు అధికం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ బూమ్ మళ్లీ మొదలైంది. ఐటీ హబ్‌గా విశాఖను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి గూగుల్ డేటా సెంటర్, కాగ్నిజెంట్, టీసీఎస్, సిఫీ వంటి కంపెనీలను తీసుకురావడంతో అందరి దృష్టి ఇటు మళ్లింది. భీమిలి నియోజకవర్గంలో భూములకు గిరాకీ ఏర్పడింది. అదేవిధంగా పెందుర్తి నుంచి ఆనందపురం వరకూ జాతీయ రహదారి వెంబడి భూములపై అంతా దృష్టిసారించారు. ఐటీ సంస్థలకు దగ్గరగా ఉండే రుషికొండ, మధురవాడ, కాపులుప్పాడ పరిసరాల్లో గల లేఅవుట్లలో భూముల కొనుగోళ్లు పెరిగాయి. ఇటీవల కాపులుప్పాడలో వీఎంఆర్‌డీఏ హరిత హౌసింగ్ ప్రాజెక్టును ఆనుకొని 22 ఎకరాల్లో కాగ్నిజెంట్ క్యాంపస్ నిర్మాణానికి సీఎం చంద్రబాబునాయుడు శంకుస్థాన చేయడంతో ఒక్కసారిగా బూమ్ వచ్చింది. ఆ ప్రాంతంలో ఆకస్మికంగా భూముల ధరలు పెరిగిపోయాయి.
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) తన ప్రాజెక్టులకు, అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడానికి లేఅవుట్లలో ప్లాట్ల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంపైనే ఎక్కువగా ఆధార పడుతోంది. మధ్య తరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకొని గతంలో ఆనందపురం మండలం పాలవలస, రామవరం, విజయనగరం జిల్లా రఘుమండ, జియ్యన్నవలసల్లో ఎంఐజీ లేఅవుట్లు వేసింది. ప్లాట్లకు దరఖాస్తులు ఆహ్వానించి లాటరీ ద్వారా కేటాయించింది. మిగిలిన వాటిని ఈ-వేలం ద్వారా విక్రయించాలని ప్రయత్నించింది. పెద్దగా స్పందన ఉండేది కాదు. అలాగే కాపులుప్పాడలో వేసిన కొత్త లేవుట్‌లో ప్లాట్లకు కూడా డిమాండ్ కనిపించేది కాదు. గత సెప్టెంబరు నెలలో ఆయా లేఅవుట్లలో ప్లాట్లను విక్రయానికి పెడితే పది శాతానికి మించి డిమాండ్ రాలేదు. కానీ ఈ నెల 17న (వారం క్రితం) పాలవలస, రఘుమండ, జియ్యన్నవలస, కాపులుప్పాడ, తుమ్మపాల లేఅవుట్లలో ప్లాట్లను విక్రయానికి పెడితే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. అవి కూడా గజానికి రూ.పది వేలు ఎక్కువ (అప్‌సెట్ ధర కంటే)కు కొనడం గమనార్హం.
- కాపులుప్పాడ లేఅవుట్‌లో 90కి పైగా ప్లాట్లు అందుబాటులో ఉండగా వాటిలో కేవలం పది మాత్రమే వేలానికి పెట్టారు. చదరపు గజం అప్‌సెట్ ధర రూ.23,500గా నిర్ణయించారు. వాటికి కనిష్ఠ ధర రూ.32 వేలు, గరిష్ఠంగా రూ.34,500 పలికింది. అంటే 50 శాతానికి పైగా రేట్లు పెరిగాయి.
- పాలవలస లేఅవుట్‌లో ప్రభుత్వ ఉద్యోగులు కొనుగోలు చేసిన ప్లాట్లు పోగా ఆడ్ బిట్లు మిగిలాయి. వాటిని తీసుకుంటే పది నుంచి ఇరవై గజాల స్థలం లెవెలింగ్‌లో కోల్పోవలసి ఉంటుంది. ఆ మేరకు మొత్తం వృథా అవుతుంది. అందుకని వాటిని ఎవరూ ఇంతవరకూ కొనలేదు. ఇప్పుడు అలాంటి ప్లాట్లు ఏడు అమ్మకానికి పెడితే వాటినీ ఎక్కువ ధర పెట్టి కొన్నారు. గజం అప్‌సెట్ ధర రూ.14,500 కాగా కనిష్ఠంగా రూ.18,800, గరిష్ఠంగా రూ.23,700 పెట్టి కొనేశారు. అన్నీ అమ్ముడైపోయాయి.
- విజయనగరంలో మహారాజా ఇంజనీరింగ్ కాలేజీ సమీపాన రఘుమండలో పది ప్లాట్లను గజం రూ.6,500 చొప్పున విక్రయానికి పెడితే వాటిని రూ.100, రూ.200 అధికంగా వేసి పది ప్లాట్లను కొనేశారు. ఆ పక్కనే జియ్యన్నవలసలో గజం రూ.7,500 ధర పెడితే రూ.100 వేసి వాటినీ కొన్నారు.
- అనకాపల్లి సమీపాన తుమ్మపాలలో గజం రూ.12 వేలు ధర పెడితే వంద రూపాయలు వేసి అక్కడ కూడా కొన్ని ప్లాట్లు కొనుగోలు చేశారు.