మీరాబంద చెరువుపై రియల్ ఎస్టేట్ రాబందులు
ABN , Publish Date - Dec 23 , 2025 | 01:37 AM
జిల్లాలో ప్రభుత్వ భూముల కబ్జాలు నానాటికీ పెరిగిపోతున్నాయి.
లగిశెట్టిపాలెంలో 6.32 ఎకరాలు ఆక్రమణ
వైసీపీ హయాంలోనే కబ్జాకు బీజం
12 మంది పేరున ఎల్‌పీఎం నంబర్లతో సబ్‌డివిజన్
‘నాలా’ చెల్లించి లేఅవుట్‌గా మార్పు
అక్రమార్కులతో రెవెన్యూ అధికారుల కుమ్మక్కు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో ప్రభుత్వ భూముల కబ్జాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. వాగులు, గెడ్డలు, కొండలు, సాగునీటి చెరువులు.. ఇలా వివిధ రకాల ప్రభుత్వ భూములను దర్జాగా ఆక్రమించి సొంతం చేసుకొంటున్నారు. అనంతరం రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై నకిలీ ధ్రువపత్రాలను సృష్టిస్తున్నారు.
వైసీపీ హయాంలో భూకబ్జాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. దాదాపు అన్ని మండలాల్లో ప్రభుత్వ భూములు, చెరువులు, కొండవాలు ప్రదేశాలు ఆక్రమణకు గురయ్యాయి. వీటిపై స్థానికులు ఫిర్యాదులు చేసినా.. అప్పటి అధికారులు పట్టించుకోలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ భూములు, చెరువులు అన్యాక్రాంతం కాకుండా రక్షణ చర్యలు చేపడతారని ప్రజలు భావించారు. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గత వైసీపీ హయాంలో పాలకుల అండతో భూకబ్జాలకు పాల్పడినవారే ఇప్పుడు కూటమి నేతల అండదండలతో ప్రభుత్వ భూములు, చెరువులను ఆక్రమించేస్తున్నారు. తాజాగా సబ్బవరం మండలం ఆరిపాక పంచాయతీ శివారు లగిశెట్టిపాలెంలో సాగునీటి చెరువును కబ్జా చేశారు. రెవెన్యూ శాఖలో లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకున్న కొంతమంది రియల్టర్లు ఈ చెరువుపై కన్నేసి ఆక్రమించేశారు. చెరువు గర్భాన్ని పూడ్చేసి రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తున్నారు.
లగిశెట్టిపాలెం సర్వే నంబరు 37/2లో 6.32 ఎకరాల్లో మీరాబంద చెరువు వుంది. రెవెన్యూ ఎఫ్‌ఎంబీ( ఫీల్డ్ మెజర్‌మెంట్ బుక్)లో, పంచాయతీరాజ్ రికార్డుల్లో చెరువు అని స్పష్టంగా ఉంది. చెరువుకు తూర్పు వైపున గాలిభీమవరం రైతులకు చెందిన సుమారు 60 ఎకరాల ఆయకట్టు వుంది. ఇక్కడ ఎకరా నాలుగైదు కోట్ల రూపాయలు పలుకుతుండడంంతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను ఈ చెరువుపై పడింది. చెరువును ఆక్రమించి గర్భంలోని లేఅవుట్ పనులు కానిచ్చేస్తున్నారు. రెండు వారాలుగా రాత్రి పూట చెరువును పూడ్చేస్తున్నారు. గట్లు, చెట్లు ఇష్టారీతిన తెగనరికి లేఅవుట్ వేశారు. వాస్తవంగా వైసీపీ అధికారంలో వున్నప్పుడు 2023-24లోనే చెరువు గర్భాన్ని (వాటర్ బాడీస్) విభజించి సుమారు 12 మంది పేరున ఎల్‌పీఎం (ల్యాండ్ పార్శిల్ మ్యాప్) నంబర్లతో సబ్‌డివిజన్ చేసినట్టు తెలిసింది. అంతేకాక ఇది జిరాయితీ భూమిగా చెప్పుకోవడానికి ‘నాలా’ కూడా కట్టించుకున్నట్టు సమాచారం. రెవెన్యూ, ఇరిగేషన్ రికార్డుల్లో చెరువుగా నమోదై ఉన్న ఈ భూమికి ‘నాలా’ ఎలా కట్టించుకున్నారో అప్పటి రెవెన్యూ అధికారులకే తెలియాలి. అప్పట్లో స్థానిక రైతులు కొందరు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయినాసరే రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఈ 12 మంది నుంచి చెరువు గర్భాన్ని రియల్టర్లు కొనుగోలు చేసి, రిజిస్ర్టేషన్ చేయించుకున్నట్టు తెలిసింది. చెరువు గర్భం చుట్టూ కొంతమేర ప్రహరీ గోడ నిర్మించారు. గేటు ఏర్పాటు చేసి లోపలికి ఎవరూ రాకుండా ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. చెరువు గర్భంలో రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని స్థానిక రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల ఉన్నతాధికారులు స్పందించి, ఆయా శాఖల వద్ద వున్న రికార్డుల ఆధారంగా సమగ్ర విచారణ జరిపించి, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.