Share News

రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , Publish Date - Aug 09 , 2025 | 01:16 AM

లారీలో అక్రమంగా తరలిస్తున్న సుమారు ఆరున్నర టన్నుల రేషన్‌ బియ్యాన్ని మండలంలోని ఏటికొప్పాక సమీపంలో రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.

రేషన్‌ బియ్యం పట్టివేత
ఏటికొప్పాక రైల్వే గేటు సమీపంలో రేషన్‌ బియ్యం రవాణా చేస్తున్న లారీని ఆపిన రెవెన్యూ శాఖ హెచ్‌డీటీ వినయ్‌కుమార్‌, సిబ్బంది.

ఏటికొప్పాక నుంచి పులపర్తికి అక్రమ రవాణా

రెవెన్యూ అధికారులకు స్థానికుల సమాచారం

రైల్వే గేటు వద్ద పట్టుకున్న హెచ్‌డీటీ

130 బస్తాల్లో వున్న ఆరున్నర టన్నుల బియ్యం స్వాధీనం

ఎలమంచిలి, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): లారీలో అక్రమంగా తరలిస్తున్న సుమారు ఆరున్నర టన్నుల రేషన్‌ బియ్యాన్ని మండలంలోని ఏటికొప్పాక సమీపంలో రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.

ఏటికొప్పాక, పరిసర గ్రామాల్లో రేషన్‌ కార్డుదారుల నుంచి కొంతమంది దళారులు బియ్యం కొనుగోలు చేసి, రైస్‌ మిల్లుకు తరలిస్తుంటారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి రేషన్‌ పంపిణీ ప్రారంభం కావడంతో ఆయా కార్డుదారుల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని ఏటికొప్పాకలోని ఒక ఇంటిలో భద్రపరిచారు. శుక్రవారం రాత్రి లారీలోకి బియ్యం బస్తాలను ఎక్కిస్తుండగా చూసిన కొంతమంది స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో హెచ్‌డీటీ వినయ్‌కుమార్‌, సిబ్బందితో కలిసి ఏటికొప్పాకకు బయలుదేరారు. దారిలో రైల్వే గేట్లు సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని అడ్డుకుని తనిఖీ చేశారు. ఒక్కొక్కటి 50 కిలోల బరువున్న 130 బియ్యం బస్తాలు కనిపించాయి. ఈ బియాన్ని పులపర్తి వైపు తరలిస్తున్నట్టు తమ ప్రాథమిక విచారణలో తేలిందని హెచ్‌డీటీ చెప్పారు. రేషన్‌ బియ్యంతోపాటు లారీని స్వాధీనం చేసుకుని ఎలమంచిలి తరలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్‌డీటీ వినయ్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - Aug 09 , 2025 | 01:16 AM