రేషన్ పంపిణీ భేష్
ABN , Publish Date - Jun 22 , 2025 | 10:38 PM
రేషన్ సరుకుల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విధానం సత్ఫలితాలిచ్చిందని అధికారులు భావిస్తున్నారు. గతంలో ఇంటింటా రేషన్ పేరిట మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్(ఎండీయూ) వాహనాలతో కంటే తాజాగా చేపట్టిన డిపోల్లో రేషన్ పంపిణీ మెరుగ్గా ఉందని అంటున్నారు.
ఈ నెల 98.69 శాతం మందికి సరుకుల పంపిణీ
సత్ఫలితాన్నిచ్చిన కొత్త విధానం
డిపోల్లో లబ్ధిదారులకు పక్కాగా అందుతున్న నిత్యావసరాలు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
రేషన్ సరుకుల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విధానం సత్ఫలితాలిచ్చిందని అధికారులు భావిస్తున్నారు. గతంలో ఇంటింటా రేషన్ పేరిట మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్(ఎండీయూ) వాహనాలతో కంటే తాజాగా చేపట్టిన డిపోల్లో రేషన్ పంపిణీ మెరుగ్గా ఉందని అంటున్నారు. జిల్లాలో జూన్ నెలలో 1 నుంచి 15వ తేదీ నాటికి 98.69 శాతం లబ్ధిదారులకు రేషన్ సరుకులను పంపిణీ చేశారు.
జిల్లాలోని పాడేరు, రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లలో గల 22 మండలాల్లోని 671 రేషన్ డిపోల పరిధిలో 2 లక్షల 92 వేల 617 రేషన్ కార్డులున్నాయి. ఈ నెల నూతన విధానంలో రేషన్ డిపోల ద్వారా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు వాటిలో 2 లక్షల 88 వేల 792 రేషన్‌కార్డులకు అవసరమైన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. దీంతో .జూన్ నెలలో జిల్లాలో 98.69 శాతం రేషన్ సరుకుల పంపిణీ జరిగినట్టు అధికారులు పేర్కొన్నారు.
ఎండీయూల రద్దుతో తప్పిన తిప్పలు
గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్(ఎండీయూ) వ్యవస్థ రద్దుతో రేషన్ లబ్ధిదారులకు తిప్పలు తప్పాయనే వాదన వినిపిస్తున్నది. ఆహార భద్రతా చట్టంలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ అందించాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. అయితే గత ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలతో లబ్ధిదారులకు రేషన్ సరుకులు సక్రమంగా అందడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు రోడ్డు, రవాణా సదుపాయాలు లేకపోవడంతో పాటు రేషన్ డిపోల సంఖ్య కంటే, ఎండీయూ వాహనాల సంఖ్య తక్కువగా ఉండడంతో లబ్థిదారులకు సరుకులు అందని దుస్థితి నెలకొంది. జిల్లాలో 671 డిపోల ద్వారా రేషన్ సరుకులను అందించే పరిస్థితి నుంచి కేవలం 221 ఎండీయూ వాహనాలతో వాటిని పంపిణీ చేసే దుస్థితికి తీసుకువచ్చారు. దీంతో ఎక్కువ మందికి సరుకులు అందకపోవడం, అవన్నీ సరిహద్దులోని ఒడిశా రాష్ట్రానికి అక్రమంగా తరలిపోవడం సర్వసాధారణమైపోయింది. అలాగే ఇన్నాళ్లు గిరిజన సహకార సంస్థ ద్వారా జరిగే నిత్యావసర సరుకుల పంపిణీ పక్రియను ఎండీయూలతో చేపట్టడంతో ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడింది. ఈ నెల నుంచి ప్రభుత్వ రంగ సంస్థ అయిన జీసీసీ డిపోల ద్వారా రేషన్ పంపిణీ కావడంతో లబ్ధిదారులకు కచ్చితంగా అందే పరిస్థితులున్నాయి. అయితే అధికారులు సైతం సివిల్ సప్లైపై పక్కా పర్యవేక్షణ కొనసాగించాలని పలువురు కోరుతుండగా, మారుమూల ప్రాంతాలకు మరిన్ని సబ్‌డిపోలను ఏర్పాటు చేయాలని మరికొంతమంది విజ్ఞప్తి చేస్తున్నారు.