Share News

సచివాలయాల పరిధిలోనే రేషన్‌ డిపోలు

ABN , Publish Date - Jul 21 , 2025 | 12:41 AM

సచివాలయాల పరిధిలో ఉన్న బియ్యం కార్డుదారులకు అందుబాటులోనే రేషన్‌ డిపోలు ఉండాలని డీలర్లకు జిల్లా పౌరసరఫరాల అధికారి వి.భాస్కర్‌ స్పష్టంచేశారు.

సచివాలయాల పరిధిలోనే రేషన్‌ డిపోలు

కార్డుదారులకు అందుబాటులో ఉండాల్సిందే

డీలర్లకు స్పష్టం చేసిన డీఎస్‌వో

విశాఖపట్నం, జూలై 20 (ఆంధ్రజ్యోతి):

సచివాలయాల పరిధిలో ఉన్న బియ్యం కార్డుదారులకు అందుబాటులోనే రేషన్‌ డిపోలు ఉండాలని డీలర్లకు జిల్లా పౌరసరఫరాల అధికారి వి.భాస్కర్‌ స్పష్టంచేశారు. రేషన్‌ డీలర్ల ఇష్టారాజ్యం శీర్షికన ఆదివారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. ఈ మేరకు సహాయ పౌరసరఫరాల అధికారులు, చెకింగ్‌ ఇన్‌స్పెక్టర్లు, డీలర్లకు ఒక సందేశం పంపారు. కార్డుదారుల ప్రయోజనం కోసం గతంలోనే ప్రతి సచివాలయం పరిధిలో క్లస్టర్లకు డిపోలు అనుసంధానం చేశారన్నారు. అయితే కొన్నిచోట్ల కార్డుదారులకు దూరంగా డిపోలు ఉన్నట్టు వస్తున్న ఫిర్యాదులపై పలుమార్లు సూచనలు చేశామన్నారు. కొందరు మార్పు, చేర్పులు చేశారన్నారు. ఆగస్టు ఒకటోతేదీ కల్లా మిగిలిన వారంతా గతంలో మ్యాపింగ్‌ అయిన విధంగా సచివాలయాల పరిధిలో కార్డుదారులకు అందుబాటులో డిపోలు ఏర్పాటుచేయాలన్నారు. అప్పటికీ మార్పులు చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో ఏఎస్‌వోలు, చెకింగ్‌ ఇన్‌స్పెక్టర్లు తమ పరిధిలోని డిపోలన్నీ సచివాలయాల పరిధిలో ఉన్నాయా.? లేదా తనిఖీ చేసి వెంటనే నివేదిక పంపాలని ఆదేశించారు.


కేజీహెచ్‌లో అవినీతిపై విచారణ

బాధితులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను విచారించిన కమిటీ

విశాఖపట్నం, జూలై 20 (ఆంధ్రజ్యోతి):

కేజీహెచ్‌లో పనిచేసే రోగి మిత్రలను గతంలో తొలగించారు. వారికి న్యాయం చేస్తామంటూ కొందరు అధికారులు డబ్బులు వసూలు చేశారని కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో కొంతమంది ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై ఈనెల ఆరో తేదీన ‘కేజీహెచ్‌కు అవినీతి జబ్బు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. దీంతో ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించి విచారణ కు కమిటీని నియమించారు. ఈ కమిటీలో జనరల్‌ మెడిసిన్‌ విభాగాధిపతి డాక్టర్‌ డి.రాధాకృష్ణ, గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్‌ ఉషాప్రసాద్‌, ఏఆర్‌ఎంవో డాక్టర్‌ రాజేష్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (హెచ్‌ఆర్‌) ఇ.లోగనాథన్‌తో శనివారం విచారణ చేపట్టారు. సుమారు 15 మంది బాధితులతో మాట్లాడారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగుల నుంచి కూడా వివరణ తీసుకున్నట్టు చెబుతున్నారు. విచారణ అనంతరం మరోసారి బాధితులను పిలిపించి మాట్లాడతామని కమిటీ సభ్యులు చెప్పినట్టు తెలిసింది. మరోసారి కమిటీ విచారణ చేసి నివేదిక ఇస్తుందా.? లేదా.? అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై కమిటీ సభ్యులు ఎవరూ స్పందించలేదు. బాధితులు మాత్రం తమకు న్యాయం చేయాలని, ఏళ్లుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగాలు కల్పించాలని, లేదా చెల్లించిన డబ్బులు ఇవ్వాలని కోరుతున్నారు.


గోడ కూలి ఇద్దరు దుర్మరణం

డాక్‌యార్డు సమీపంలో ఘటన

వర్షంతో నానిపోయి కూలిపోయిన పాత గోడ

మృతులు భవన నిర్మాణ కార్మికులు

మల్కాపురం, జూలై 20 (ఆంధ్రజ్యోతి):

గోడ కూలిన ప్రమాదంలో ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన డాక్‌యార్డు సమీపంలో గల ప్రత్యూష గోడౌన్స్‌లో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...

ప్రత్యూష గోడౌన్స్‌లో ఒడిశా స్టీల్‌ డెవలపర్స్‌ కంపెనీ భారీ ఎత్తున గోడ నిర్మించే పనిని తాతబాబు అనే వ్యక్తికి అప్పగించారు. ఇతడు ప్రకాశ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ధర్మారావు (51), జనతాకాలనీకి ప్రాంతానికి చెందిన రామారావు (52)లతో నిర్మాణ పనులు చేపడుతున్నారు. అయితే ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి నిర్మాణంలోని గోడ పక్కనే ఉన్న పాత గోడ బాగా నానిపోయి, పనులు చేస్తున్న వారిపై ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ధర్మారావు అక్కడికక్కడే మృతి చెందగా, గోడ శిథిలాల కింద చిక్కుకుపోయిన రామారావును వెలికి తీసి, హుటాహుటిన కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి పదిగంటల సమయంలో అతడు మృతి చెందారు. మల్కాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

3.52 లక్షమందికి రెండోవిడత గ్యాస్‌ సబ్సిడీ

విశాఖపట్నం, జూలై 20 (ఆంధ్రజ్యోతి): బియ్యం కార్డుదారులకు ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీలో భాగంగా రెండోవిడత జిల్లాలో ఇంతవరకు 3,52,379 మందికి సబ్సిడీ జమయింది. ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటి నుంచి జూలై నెలాఖరు వరకు సబ్సిడీ వినియోగించుకునే వీలుంది.. జిల్లాలో 5.24 లక్షల బియ్యం కార్డుదారుల్లో 3,71,481 మంది గ్యాస్‌ సబ్సిడీకి అర్హులుగా తేల్చారు. రెండో విడతలో ఇంతవరకు 3,65,091మంది సిలిండర్‌ బుక్‌ చేసుకోగా 3,56,764 మందికి సబ్సిడీ విడుదలై 3,52,379 మంది బ్యాంకు ఖాతాలకు రూ.29.44 కోట్లు జమచేశారు. మిగిలిన వారంతా వెంటనే సిలిండర్లు బుక్‌ చేసుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి వి.భాస్కర్‌ పేర్కొన్నారు.

Updated Date - Jul 21 , 2025 | 12:41 AM