భవిష్యత్తులో సూపర్ మార్కెట్లుగా రేషన్ డిపోలు
ABN , Publish Date - Jun 01 , 2025 | 10:57 PM
రేషన్ డిపోలను భవిష్యత్తులో సూపర్‌మార్కెట్‌లుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుందని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ తెలిపారు. మండలంలో కిండంగి పంచాయతీ కేంద్రంలోని రేషన్ డిపోలో ఆదివారం సరకుల పంపిణీ పునఃప్రారంభోత్సవం చేశారు.
రేషన్ డిపోల పునఃప్రారంభంలో కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్
జిల్లాలో 19,785 మంది వృద్ధులు, దివ్యాంగులకు ఇంటికే రేషన్ సరకుల పంపిణీ
పాడేరు, జూన్ 1(ఆంధ్రజ్యోతి): రేషన్ డిపోలను భవిష్యత్తులో సూపర్‌మార్కెట్‌లుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుందని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ తెలిపారు. మండలంలో కిండంగి పంచాయతీ కేంద్రంలోని రేషన్ డిపోలో ఆదివారం సరకుల పంపిణీ పునఃప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి లబ్ధిదారునికి పక్కాగా నిత్యావసర సరకులు అందాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం దుకాణాల ద్వారా రేషన్ పంపిణీకి శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లాలోని 22 మండలాల్లో 671 రేషన్ డిపోల పరిధిలో 2 లక్షల 98 వేల 92 రేషన్‌కార్డుదారులకు నిత్యావసర సరకుల పంపీణీ జరుగుతుందన్నారు. ప్రస్తుతం బియ్యం, చక్కెర వంటివి అందిస్తున్నారని, రానున్న రోజుల్లో చిరు ధాన్యాలు పంపిణీ చేస్తారన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరురాకుండా, లబ్ధిదారులకు ఇబ్బందులు తలెత్తకుండా రేషన్ సరకుల పంపిణీ పక్కాగా జరగాలని కలెక్టర్ సూచించారు. అలాగే రేషన్ డిపోల వద్ద సరకుల ధరలు, స్టాక్, ఇతర వివరాలతో బోర్డులను ప్రదర్శించాలని, ఈ క్రమంలో ఇబ్బందులు కలిగితే అక్కడ పోస్టర్‌లో ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఫిర్యాదు చేయాలని ఆయన పేర్కొన్నారు.
వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్
ఇకపై వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరకుల పంపిణీ జరుగుతుందని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ తెలిపారు. జిల్లాలో 19,785 కార్డులు వృద్ధులు, దివ్యాంగులకు ఉన్నాయని, వాటికి రేషన్ డోర్ డెలివరీ చేస్తారన్నారు. రేషన్ పంపిణీ పారదర్శకంగా చేపట్టాలని, ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చూసుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండాలనే లక్ష్యంతోనే రేషన్ డిపోల ద్వారా సరకుల పంపిణీకి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇకపై ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీ లోపు ఎప్పుడైనా డిపోకు వెళ్లి లబ్ధిదారులు సరకులు పొందవచ్చునన్నారు. కార్యక్రమంలో భాగంగా కిండంగి గ్రామంలోని జోగి జగ్గమ్మ, సీసాల కాంతమ్మ, కూడా రాజులు ఇళ్లకు వెళ్లి రేషన్ సరకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ శౌర్యమన్‌పటేల్, సివిల్ సప్లై జిల్లా మేనేజర్ బి.గణేశ్‌కుమార్, తహశీల్దార్ వి.త్రినాథరావునాయుడు, జీసీసీ డైరెక్టర్ బొర్రా నాగరాజు, ఎంపీపీ ఎస్.రత్నకుమారి, సర్పంచ్ కూడా శ్రీలక్ష్మి, తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొర్రా విజయరాణి, జీసీసీ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా తొలి రోజు 24,872 కార్డులకు సరకులు అందజేత
రేషన్ డిపోల పునఃప్రారంభం జిల్లాలో ఆదివారం పండుగ వాతావరణంలో జరిగింది. తొలి రోజు జిల్లాలో 24,872 రేషన్ కార్డులకు చెందిన లబ్ధిదారులకు సరకులను పంపిణీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ అందిస్తామని మొబైల్ డిసి్ట్రబ్యూషన్ యూనిట్‌లను(ఎండీయూ) ఏర్పాటు చేసినప్పటికీ వాస్తవానికి వీధి చివరన రేషన్ వాహనాన్ని నిలిపి వేయడం, లబ్ధిదారులు అక్కడికి వెళ్లడం, వాహనం వచ్చే సమయానికి అందుబాటులో లేకుంటే ఆ నెల రేషన్ సరకులు పొందలేని పరిస్థితులు నెలకొనేది. అటువంటి ఇబ్బందులను తొలగించి రేషన్ డిపోల్లోనే ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీలోపు లబ్థిదారులు రేషన్ పొందేలా ప్రభుత్వం రేషన్ డిపోలను ఆదివారం పునఃప్రారంభించింది. ఇందులో భాగంగా జిల్లా కేంద్రం పాడేరు మండలం కిండంగి గ్రామంలో కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ జే సీ అభిషేక్‌గౌడ, సబ్‌కలెక్టర్ శౌర్యమన్‌పటేల్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశఽ్వరి, జీసీసీ డైరెక్టర్ బొర్రా నాగరాజులతో కలిసి పలువురు వృద్ధులకు రేషన్ సరకులను పంపిణీ చేశారు. అలాగే అరకులోయలో ఆర్టీసీ విజయనగరం జోనల్ చైర్మన్ సియ్యారి దొన్నుదొర, రంపచోడవరంలో ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవీ పాల్గొని కార్యక్రమాలను ప్రారంభించారు. జిల్లాలోని మొత్తం 22 మండలాల పరిధిలోని అధికారులు, కూటమి నేతలు రేషన్‌డిపోల పునఃప్రారంభోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.