శరవేగంగా అభివృద్ధి పనులు
ABN , Publish Date - Jun 30 , 2025 | 11:38 PM
వివిధ పథకాల్లో భాగంగా జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదేశించారు. ఐటీడీఏ పీవోలు, వివిధ ఇంజనీరింగ్ అధికారులతో సోమవారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.
ఇంజనీరింగ్ అధికారులకు కలెక్టర్ ఆదేశం
జూలై 15 నాటికి ఏకలవ్య పాఠశాలల భవనాలు అప్పగించాలని సూచన
లేకుంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
పాడేరు, జూన్ 30(ఆంధ్రజ్యోతి): వివిధ పథకాల్లో భాగంగా జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ ఆదేశించారు. ఐటీడీఏ పీవోలు, వివిధ ఇంజనీరింగ్ అధికారులతో సోమవారం కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ పాఠశాలలను జూలై 15 నాటికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని, లేకుంటే అందుకు బాధ్యులపై శాఖాపరమైన చర్యలు చేపడతామన్నారు. అలాగే కొయ్యూరు మండలం మూలపేట పంచాయతీ బచ్చింత వయా పాలమామిడికి మంజూరు చేసిన రోడ్డు పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. దానికి రూ.2.50 కోట్లు బిల్లులు చెల్లించారని, తారురోడ్డు వేస్తేనే మిలిగిన బిల్లులను మంజూరు చేయాలని ఐటీడీఏ పీవోకు సూచించారు. గోకులం షెడ్డు నిర్మించిన పరిసర గ్రామాలను విధిగా మ్యాపింగ్ చేయాలన్నారు. అందుబాటులో ఉన్న పశువులను గుర్తించాలని, షెడ్ల నిర్మాణాలు పూర్తి చేసి డెయిరీని అభివృద్ధి చేయాలన్నారు. స్త్రీ నిధిలో ఆసక్తి కలిగిన మహిళలకు పశువులను మంజూరు చేస్తామన్నారు. ఐటీడీఏ పీవో, పశు సంవర్థక శాఖ డీడీ, డీఆర్‌డీఏ పీడీ సంయుక్తంగా చర్చించి గోకులం షెడ్లను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రూ.60 లక్షల వ్యయంతో పీఎం జన్‌మన్ పథకంలో నిర్మాణాలు పూర్తి చేసిన మల్టీపర్పస్ భవనాలను వినియోగంలోకి తీసుకురావాలని, నిర్మాణ దశలో ఉన్న పర్పస్ భవనాలను ఆగస్టు నెలాఖరుకు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆస్పత్రుల్లో బర్త్ వెయిటింగ్ హాలు భవనాల నిర్మాణాలు, వీడీవీకే ల హాట్ బజార్ల పనుల పురోగతిపై ఆరా తీశారు. అంగన్‌వాడీ భవన నిర్మాణాలకు నిధుల కొరత లేదని, వాటిని పూర్తి చేసి అప్పగించాలన్నారు. తాజాగా పీఎం డీఏజుగాలో మంజూరైన పనులకు టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. టెండర్లు దక్కించుకుని రోడ్డు పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏదైనా నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్ కృష్ణంరాజు టెండరు ప్రక్రియలో పాల్గొంటే తొలగించాలని కలెక్టర్ సూచించారు. కొయ్యూరు బూదరాళ్లు, పి.కొత్తూరు, కొల్లివలస రహదారి పనులను తనిఖీ చేయాలని ఐటీడీఏ పీవోకు సూచించారు. 2021లో మంజూరైన పనులను ఇప్పటికీ పూర్తి చేయకపోవడంతో ఇంజనీరింగ్ అధికారులు ఏం చేస్తున్నారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023- 24 ఆర్థిక సంవత్సరంలో పనులు పూర్తి చేయని అధికారులకు షోకాజ్ నోటీస్ జారీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, పాడేరు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో డాక్టర్ ఎంజే అభిషేక్‌గౌడ, రంపచోడవరం ఐటీడీఏ పీవో కె.సింహాచలం, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ఈఈలు కె. వేణుగోపాల్, డేవిడ్‌రాజు, రోడ్లు, భవనాల శాఖ ఈఈ బాల సుందరబాబు, పశు సంవర్థక శాఖాధికారులు, డీఈఈలు, ఏఈఈలు పాల్గొన్నారు.