చకచకా పనులు
ABN , Publish Date - Dec 19 , 2025 | 12:13 AM
విశాఖ -చెన్నై ఇండస్ర్టియల్ కారిడార్‌లో నక్కపల్లి క్లస్టర్ కోసం సేకరించిన భూముల్లో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల కల్పన పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కారిడార్ కోసం దాదాపు 4,500 ఎకరాలకుపైగా జిరాయితీ, డి.పట్టా భూములను ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా గతంలోనే సేకరించింది.
కారిడార్ భూముల్లో ముమ్మరంగా మౌలిక సదుపాయాల కల్పన
శరవేగంగా రహదారులు, వాటర్ ట్యాంకుల నిర్మాణం
పైప్‌లైన్ ఏర్పాటుకు సామగ్రి తరలింపు
నక్కపల్లి, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): విశాఖ -చెన్నై ఇండస్ర్టియల్ కారిడార్‌లో నక్కపల్లి క్లస్టర్ కోసం సేకరించిన భూముల్లో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల కల్పన పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కారిడార్ కోసం దాదాపు 4,500 ఎకరాలకుపైగా జిరాయితీ, డి.పట్టా భూములను ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా గతంలోనే సేకరించింది. ఇప్పుడు ఈ భూముల్లోనే బల్క్‌డ్రగ్ పార్కు, ప్రైవేటు రంగంలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు కానున్నాయి. వీటికి కావాల్సిన మౌలిక సదుపాయాల పనులను వేగంగా జరుపుతున్నారు. కాగిత హైవే జంక్షన్ నుంచి అమలాపురం శివారు పాటిమీద, మూలపర్ర గ్రామాల వరకు దాదాపు 60 అడుగుల వెడల్పున రెండు వరుసల రహదారిని నిర్మిస్తున్నారు. రాజయ్యపేట, బోయపాడు మత్స్యకార గ్రామాలకు ఆనుకుని కారిడార్ భూముల్లో కూడా కొత్తగా విశాలమైన రహదారులను నిర్మిస్తున్నారు. బోయపాడులో కొండలను ఆనుకుని భారీ మంచినీటి ట్యాంకుల నిర్మాణ పనులు సాగుతున్నాయి. వీటికి అనుసంధానంగా మెగాపంప్ హౌస్ నిర్మాణం చేపట్టారు. ‘ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్స్’కు బుచ్చిరాజుపేట, చందనాడ, డీఎల్ పురం, రాజయ్యపేట, వేంపాడు తదితర గ్రామాల్లో 2,164.31 ఎకరాలను ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. జాతీయ రహదారి నుంచి స్టీల్ ప్లాంట్‌కు కనెక్టివిటీ కోసం రోడ్లు, నీరు, విద్యుత్తు వంటి మౌలిక సదుపాయాల కల్పన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నక్కపల్లి మండలం రమణయ్యపేట, ముకుందరాజుపేట, జి.జగన్నాథపురం, సీతంపాలెం గ్రామాల మీదుగా వెళుతున్న పోలవరం ఎడమ ప్రధాన కాలువ లేదా నాతవరం మండలంలో ఏలేరు కాలువ నుంచి నీటిని సరఫరా చేసేందుకు పైప్‌లైన్ కోసం సామగ్రిని సిద్ధం చేశారు. కాగిత హైవే జంక్షన్ నుంచి కొత్తగా నిర్మిస్తున్న రహదారి పక్క నుంచి పైప్‌లైన్ వేయనున్నారు.