Share News

రంపచోడవరం టు నర్సీపట్నం

ABN , Publish Date - Aug 17 , 2025 | 01:07 AM

రంపచోడవరం అటవీ డివిజన్‌ ఫోక్స్‌పేట రేంజ్‌ నుంచి అక్రమ రవాణా అవుతున్న సోమిద చెట్టు కర్రను నర్సీపట్నం రేంజర్‌ పట్టుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరం మండలం చీడిపాలెం నుంచి రెండు సోమిద మానులు ట్రాక్టర్‌లో అక్రమ రవాణా అవుతున్నదని నర్సీపట్నం అటవీ అధికారులకు సమాచారం అందింది.

రంపచోడవరం టు నర్సీపట్నం
ధ్వజ స్తంభాలకు వాడే సోమిద కర్ర

- సోమిద మానుల అక్రమ రవాణా

- ధ్వజ స్తంభాలకు ఉపయోగించే విలువైన సోమిద చెట్టు

- పర్మిట్‌ లేకుండా సీఫీజు రాసి విడిచి పెట్టిన ఫోక్స్‌పేట అటవీ అధికారులు

- రూ.లక్షకు పైగా చేతులు మారినట్టు సమాచారం

- పట్టుకున్న నర్సీపట్నం రేంజర్‌

నర్సీపట్నం, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): రంపచోడవరం అటవీ డివిజన్‌ ఫోక్స్‌పేట రేంజ్‌ నుంచి అక్రమ రవాణా అవుతున్న సోమిద చెట్టు కర్రను నర్సీపట్నం రేంజర్‌ పట్టుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరం మండలం చీడిపాలెం నుంచి రెండు సోమిద మానులు ట్రాక్టర్‌లో అక్రమ రవాణా అవుతున్నదని నర్సీపట్నం అటవీ అధికారులకు సమాచారం అందింది. దీంతో గొలుగొండ మండలం యర్రవరంలో ఉన్న చీడిగుమ్మల చెక్‌ పోస్టు సిబ్బందిని అప్రమత్తం చేశారు. శనివారం ఉదయం సోమిద మానుల లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ను చెక్‌ పోస్టు సిబ్బంది ఆపి నర్సీపట్నం రేంజ్‌ అధికారి కేవీ రాజేశ్వరరావుకి సమాచారం ఇచ్చారు. కలపకు సంబంధించి సీఫీజు మాత్రమే డ్రైవర్‌ చూపించారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కలప రవణా చేయాలంటే తప్పనిసరిగా పర్మిట్‌ చలానా ఇవ్వాలి. ఫోక్స్‌పేట రేంజ్‌ అధికారి ఇచ్చిన రూ.50 వేలు సీఫీజు చలానా మాత్రమే ఉండడంతో నర్సీపట్నం రేంజర్‌ ట్రాక్టర్‌ను డిపోనకు తరలించారు. సోమిద మానులు అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తి ఫోక్స్‌పేట అటవీ అధికారులకు భారీగా ముట్టచెప్పి పర్మిట్‌ లేకుండా మానులు తరలిస్తున్నట్టు సమాచారం. దేవస్థానాల పేరుతో కలప వ్యాపారులు సోమిద మానులను రూ.లక్షల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై రేంజ్‌ అధికారి రాజేశ్వరరావును వివరణ కోరగా ముందుగా అందిన సమాచారం మేరకు సోమిద మానులతో ట్రాక్టర్‌ను పట్టుకున్నామని తెలిపారు. పర్మిట్‌ లేకపోవడంతో ట్రాక్టర్‌తో సహా కర్రను సీజ్‌ చేశామని చెప్పారు.

Updated Date - Aug 17 , 2025 | 01:07 AM