రామ్‌కో అడ్డదారి
ABN , Publish Date - Dec 12 , 2025 | 12:44 AM
మండలంలోని అమీన్‌సాహెబ్ పేట వద్ద వున్న ప్రైవేటు సిమెంటు ఫ్యాక్టరీ యాజమాన్యం అన్ని రకాల నిబంధనలను తుంగలో తొక్కుతున్నదని స్థానికులతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడే కాలుష్యంతో వ్యవసాయ భూములు పాడైపోతున్నాయని, పంటలు దెబ్బతింటున్నాయని వాపోతున్నారు. మరోవైపు రెండు చెరువులకు సంబంధించి సుమారు ఎకరా భూమిని కబ్జా చేసి కంపెనీ అవసరాల కోసం రోడ్డు, వంతెన నిర్మించారు. వీటికి సంబంధించి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు నాలుగు రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తున్న సిమెంటు కంపెనీ యాజమాన్యం
చెరువులు ఆక్రమించి రోడ్డు, వంతెన నిర్మాణం
ఫ్యాక్టరీ నుంచి ఎగిసిపడుతున్న తెల్లటి ధూళి
నిస్సారంగా మారుతున్న పంట భూములు
చుట్టుపక్కల గ్రామాల్లో కానరాని ‘సామాజిక బాధ్యత’
కంపెనీపై చర్యలు తీసుకోవాలంటూ స్థానికుల ఆందోళన
నాలుగు రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు
కశింకోట, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి):
మండలంలోని అమీన్‌సాహెబ్ పేట వద్ద వున్న ప్రైవేటు సిమెంటు ఫ్యాక్టరీ యాజమాన్యం అన్ని రకాల నిబంధనలను తుంగలో తొక్కుతున్నదని స్థానికులతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడే కాలుష్యంతో వ్యవసాయ భూములు పాడైపోతున్నాయని, పంటలు దెబ్బతింటున్నాయని వాపోతున్నారు. మరోవైపు రెండు చెరువులకు సంబంధించి సుమారు ఎకరా భూమిని కబ్జా చేసి కంపెనీ అవసరాల కోసం రోడ్డు, వంతెన నిర్మించారు. వీటికి సంబంధించి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు నాలుగు రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నారు.
మండలంలోని ఏఎస్ పేట గ్రామాన్ని ఆనుకొని సుమారు 15 ఏళ్ల క్రితం రామ్‌కో సిమెంటు ఫ్యాక్టరీని నిర్మించారు. సిమెంటు గ్రైండింగ్‌తోపాటు సిమెంటును తయారు చేసేందుకు రెండు యూనిట్లు ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి నిత్యం వేల టన్నుల సిమెంటును ఎగుమతి చేస్తుంటారు. అయితే సిమెంటు పరిశ్రమ నుంచి ఎటువంటి కాలుష్యం వెలువడదని ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా అప్పట్లో ఫ్యాక్టరీ యాజమాన్యం స్పష్టం చేసింది. కానీ ఇది అవాస్తవమన్న విషయం కొన్నేళ్లకే తేటతెల్లం అయ్యింది. కంపెనీ నుంచి తెల్లటి బూడిద ఎసిగి, చుట్టుపక్కల వున్న గొబ్బూరు, గొబ్బూరుపాలెం, ఏఎస్.పేట, చింతలపాలెం, నర్సాపురం, నర్సింగబిల్లి గ్రామాల్లో పంట పొలాలపై పడుతున్నది. బూడిద పేరుకుపోయి భూములు నిస్సారంగా మారుతున్నాయని, పంట దిగుబడులు సైతం తగ్గిపోతున్నాయని రైతులు వాపోతున్నారు.
చెరువుల ఆక్రమణ.. రోడ్డు, వంతెన నిర్మాణం
సిమెంటు కంపెనీ యాజమాన్యం ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం కొనుగోలు చేసిన భూములను ఆనుకొని వున్న సాగునీటి చెరువులను ఆక్రమించేసింది. గొబ్బూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 19లో 3.63 ఎకరాల్లో గైరమ్మ చెరువు ఉంది. ఇందులో 82 సెంట్లను ఆక్రమించి, జాతీయ రహదారికి సమాంతరంగా సర్వీసు రోడ్డును నిర్మించుకున్నారు. దీనివల్ల పొలాలకు నీరు సక్రమంగా రావడంలేదని ఆయకట్టు రైతులు వాపోతున్నారు. ఇంకా సర్వే నంబరు 10/2లో 3.21 ఎకరాల కిట్టయ్య చెరువు ఉంది. ఇందులో 16 సెంట్లు కబ్జా చేసి వంతెన నిర్మించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై తహశీల్దారు సీహెచ్.తిరుమలరావును వివరణ కోరగా, చెరువుల ఆక్రమణ జరిగిందా, లేదా అన్నదానిపై మండల సర్వేయర్, వీఆర్‌వోల ద్వారా తెలుసుకొని చెబుతామని బదులిచ్చారు.
స్పందించని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు
రామ్‌కో సిమెంటు కంపెనీ యాజమాన్యం రెండు చెరువులకు సంబంధించి సుమారు ఎకరా భూమిని ఆక్రమించి, సొంత అవసరాల కోసం రహదారి, వంతెన నిర్మించిందని రైతులు ఆరోపిస్తూ నాలుగు రోజుల నుంచి ఇక్కడ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. కానీ ఇంతవరకు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. చెరువుల ఆక్రమణపై గతంలో పలుమార్లు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు.
సామాజిక బాధ్యత లేదా?
ప్రభుత్వ రంగ సంస్థలు తమ వార్షిక నికర లాభాల్లో రెండు శాతం సొమ్మును చుట్టుపక్కల గ్రామాల్లో విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, ఇతర సామాజిక అవసరాల కోసం ఖర్చు చేయాలి. కానీ రామ్‌కో సిమెంటు కంపెనీ ఏర్పాటై 15 ఏళ్లుదాటినప్పటికీ ఈ ప్రాంతంలో ఎటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించలేదని స్థానికులు చెబుతున్నారు. ఒకేఒక్కసారి మొక్కుబడిగా వైద్య శిబిరం నిర్వహించిందని, అంతకుమించి ఏమీ చేయలేదని పేర్కొన్నారు.
పీసీబీ అధికారుల తనిఖీలు
కాలుష్య నియంత్రణ అధికారులు రామ్‌కో సిమెంటు ఫ్యాక్టరీలో బుధవారం మధ్యాహ్నం 1.45 గంటల నుంచి, గురువారం మధ్యాహ్నం 1.45 గంటల వరకు తనిఖీలు నిర్వహించారు. కంపెనీ నుంచి ఎంత మేరకు కాలుష్యం విడుదల అవుతుందో నిర్ధారించుకునేందుకు నలువైపులా పరికరాలను ఏర్పాటు చేశారు. పీసీబీ జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ శిరీశ్ ఆధ్వర్యంలో ఆరుగురు సిబ్బంది కంపెనీలో పలుచోట్ల నమూనాలను సేకరించారు. వీటిని ల్యాబ్‌కు పంపి, నిర్దేశిత మోతాదుకంటే అధికంగా కాలుష్యం వెలువడితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని శిరీశ్ చెప్పారు.