రాంకీ బరితెగింపు
ABN , Publish Date - Jun 02 , 2025 | 12:42 AM
మండల కేంద్రం పరవాడ నుంచి భరణికం వెళ్లే రహదారిలో మల్లోడి గెడ్డ ఫార్మా వ్యర్థ జలాలతో నిండిపోయి నీరంతా నల్లగా తయారైంది. వాగు పొడవునా నీటిపై పెద్ద ఎత్తున నల్లటి తెట్టు తేలింది. దీని కారణంగా తీవ్ర దుర్గంధం వెదజల్లడంతో ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్న వారు ఇబ్బందులు పడుతున్నారు.
సీఈటీపీ నుంచి వ్యర్థ రసాయనాలు బయటకు విడుదల
సమీపంలోని మల్లోడి గెడ్డలోకి చేరిక
తీవ్ర దుర్గంధంతో ఇబ్బంది పడుతున్న స్థానికులు
పట్టించుకోని అధికారులు
పరవాడ, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం పరవాడ నుంచి భరణికం వెళ్లే రహదారిలో మల్లోడి గెడ్డ ఫార్మా వ్యర్థ జలాలతో నిండిపోయి నీరంతా నల్లగా తయారైంది. వాగు పొడవునా నీటిపై పెద్ద ఎత్తున నల్లటి తెట్టు తేలింది. దీని కారణంగా తీవ్ర దుర్గంధం వెదజల్లడంతో ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్న వారు ఇబ్బందులు పడుతున్నారు. రాంకీకి చెందిన కోస్టల్ ఎన్విరాన్‌మెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (సీఈటీపీ) నుంచి ఇటీవల వ్యర్థ రసాయనాలను శుద్ధి చేయకుండా నేరుగా విడిచి పెట్టడంతో అది నేరుగా పరవాడ ఊర చెరువు పక్కనున్న గెడ్డవాగు నుంచి దిగువ భాగంలో ఉన్న మల్లోడి గెడ్డలోకి కలుస్తోంది. ఈ కారణంగా భరించలేని దుర్వాసన వెదజల్లుతోంది. ఇటీవల వర్షాల కురవడంతో రాంకీ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా శుద్ధి చేయని ఫార్మా వ్యర్థాలను బయటకు విడిచి పెట్టడం వలనే అవి నేరుగా మల్లోడి గెడ్డ వాగులోకి కలుస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. 20 రోజుల క్రితం గెడ్డ వాగు అంతా పూర్తిగా ఎండిపోయి ఉండేదని, ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షానికి ఫార్మా వ్యర్థాలతో వాగు పూర్తిగా నిండిపోయిందని చెబుతున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు తక్షణమే స్పందించి రాంకీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వ్యర్థ జలాలు విడిచిపెట్టడం వలన భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.