Share News

రాజయ్యపేటకు త్వరలో కలెక్టర్‌

ABN , Publish Date - Oct 17 , 2025 | 12:45 AM

బల్క్‌డ్రగ్‌ పార్కు ఏర్పాటు విషయంపై రాజయ్యపేట ప్రాంత ప్రజల అభ్యంతరాలు, వారి సమస్యలను వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా సమస్యలు చెప్పుకోవాలని ఎస్పీ తుహిన్‌ సిన్హా అన్నారు. బల్క్‌డ్రగ్‌ పార్కు వద్దంటూ నక్కపల్లి మండలం రాజయ్యపేట కేంద్రంగా గత కొద్ది రోజుల నుంచి సంభవిస్తున్న పరిణామాలపై బుధవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు.

రాజయ్యపేటకు త్వరలో కలెక్టర్‌
తుహిన్‌ సిన్హా, ఎస్పీ

నిరసనకారులు శాంతియుతంగా సమస్యలు, అభ్యంతరాలు చెప్పుకోవచ్చు

అన్నింటినీ ప్రభుత్వానికి నివేదిస్తాం

బయట వారి ప్రేరణతో చట్టాలను అతిక్రమించొద్దు

జాతీయ రహదారిని దిగ్బంధించడం సరైన చర్య కాదు

పోరాటాలు హింసాత్మకంగా మారకుండా ఆయా గ్రామాల్లో పోలీసు బలగాల మోహరింపు

‘ఆంధ్రజ్యోతి’తో ఎస్పీ తుహిన్‌ సిన్హా

అనకాపల్లి, అక్టోబరు 16 (ఆంద్రజ్యోతి): బల్క్‌డ్రగ్‌ పార్కు ఏర్పాటు విషయంపై రాజయ్యపేట ప్రాంత ప్రజల అభ్యంతరాలు, వారి సమస్యలను వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా సమస్యలు చెప్పుకోవాలని ఎస్పీ తుహిన్‌ సిన్హా అన్నారు. బల్క్‌డ్రగ్‌ పార్కు వద్దంటూ నక్కపల్లి మండలం రాజయ్యపేట కేంద్రంగా గత కొద్ది రోజుల నుంచి సంభవిస్తున్న పరిణామాలపై బుధవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. కలెక్టర్‌ త్వరలో రాజయ్యపేట వెళ్లి, ఆందోళనకారుల సమస్యలు, డిమాండ్లను తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. ఒక సమస్యపై స్థానికులు పోరాటం చేయడంలో అర్థం వుంటుందని, కానీ బయట వ్యక్తుల ప్రేరణతో చట్టాలను అతిక్రమించి వ్యవహరించడం సరికాదని ఆయన అన్నారు. ఇటీవల కొందరు నక్కపల్లి వద్ద జాతీయ రహదారిపై గంటల తరబడి బైఠాయించడం చట్టాలను అతిక్రమించడమేనని ఎస్పీ స్పష్టం చేశారు. రాజయ్యపేట వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో రోజూ 200 మంది వరకు స్థానికులు శాంతియుతంగా తమ నిరసనలు తెలుపుతున్నారని, అంతవరకు ఎటువంటి సమస్య లేదని, అయతే జాతీయ రహదారిపైకి వచ్చి రవాణా వ్యవస్థను స్తంభింపజేయడం సరికాదన్నారు. చట్టాలను అతిక్రమించే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదుకాక తప్పదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. ప్రస్తుతం రాజయ్యపేట, డీఎల్‌పురం, చందనాడ గ్రామాల్లో పోలీసు బలగాలు మోహరించి, కవాతు చేస్తున్నాయని, అంతమాత్రాన అక్కడ ఆందోళనకారులను భయపట్టే ప్రయత్నం కాదని ఎస్పీ స్పష్టం చేశారు. పోరాటాలు హింసాయుతంగా మారకుండా పోలీసు గస్తీ ఏర్పాటు చేశామన్నారు. కలెక్టర్‌ పర్యటన సందర్భంగా ఎటువంటి హింసకు తావులేకుండా చర్చలు జరగాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. పోరాటాల ముసుగులో బయట వ్యక్తులు ఎవరైనా హింసకు ప్రేరేపిస్తే స్థానికులు వారి మాటలను నమ్మొద్దని ఎస్పీ కోరారు. పోరాటాల పేరుతో చట్టాలను అతిక్రమించే వ్యక్తులను గుర్తించి కౌన్సెలింగ్‌ ఇస్తామని ఆయన తెలిపారు.

Updated Date - Oct 17 , 2025 | 12:45 AM