Rain Alert: 27 వరకు వర్షాలు
ABN , Publish Date - Jul 23 , 2025 | 12:50 AM
జిల్లాలో రాగల ఐదు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ సిహెచ్.ముకుందరావు తెలిపారు. మంగళవారం ఇక్కడ వివిధ విభాగాల శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 27వ తేదీ వరకు ఆకాశం మేఘావృతమై అప్పుడప్పుడు వర్షం పడే అవకాశం ఉందన్నారు.
మోస్తరు నుంచి భారీగా కురిసే అవకాశం
వర్షాలతో వరి నారుమడుల్లో కలుపు బెడద
రాగి పంటకు అగ్గి తెగులు, వేరుశనగకు మొదలు కుళ్లు తెగులు
నివారణ చర్యలకు శాస్త్రవేత్తల సూచనలు
అనకాపల్లి అగ్రికల్చర్, జూలై 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రాగల ఐదు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ సిహెచ్.ముకుందరావు తెలిపారు. మంగళవారం ఇక్కడ వివిధ విభాగాల శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 27వ తేదీ వరకు ఆకాశం మేఘావృతమై అప్పుడప్పుడు వర్షం పడే అవకాశం ఉందన్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 32.8 నుంచి 34 డిగ్రీల వరకు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25.8 నుంచి 26.7 డిగ్రీల వరకు నమోదు కావచ్చని తెలిపారు. వర్షాల కారణంగా వరినారుమడుల్లో కలుపు సమస్య వుంటుందని, దీని నివారణకు విత్తిన 14-15 రోజులప్పుడు సైహలోపాస్ బ్యుటైల్ 10 శాతం మందును లీటరు నీటికి రెండు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలని సూచించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి నారును అగ్గితెగులు ఆశించే అవకాశం వుందని, ఈ తెగులు లక్షణాలు కనిపించినట్టయితే లీటరు నీటికి ట్రైసోక్లోజోల్ 0.6 గ్రాములు లేదా ఐపోప్రోథాయోలిన్ 1.5 మిల్లీ లీటర్ల చొప్పున కలిపి వర్షం కురవని సమయంలో పిచికారీ చేయాలని తెలిపారు.
వరి విత్తనాలను నేరుగా విత్తేటట్టయితే పొలంలో కలుపు సమస్య అధికంగా ఉంటుందని, అందువల్ల విత్తిన 25-30 రోజులకు లీటరు నీటికి 2.4డి అమైన్ సాల్ట్ 58 శాతం ఇ.సి.ని రెండు మిల్లీ మీటర్లు, 10 గ్రాముల యూరియా కలిపి పిచికారీ చేయాలని చెప్పారు. జింకు లోపం నివారణ కోసం లీటరు నీటికి రెండు గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలన్నారు. ఇనుముధాతు లోప నివారణ కోసం లీటరు నీటికి ఐదు గ్రాముల అన్నబేధి, 0.5 గ్రాముల నిమ్మఉప్పు కలిపి పిచికారీ చేయాలని సూచించారు. రాగి పంటను అగ్గితెగులు ఆశించే అవకాశం ఉందని, దీని నివారణకు లీటరు నీటికి ఒక గ్రాము కార్బెండిజమ్ లేదా 0.6 గ్రాముల ట్రైసెక్లోజల్ కలిపి వర్షాల అనంతరం పిచికారీ చేయాలని చెప్పారు.
30 రోజులలోపు విత్తిన వేరుశనగ పంటకు మొదలు కుళ్లు తెగులు ఆశించే అవకాశం ఉందని, ఈ తెగులు ఆశించిన మొక్కలను పొలంలో నుంచి పీకివేసి, తెగులు ఆశించిన చోట కాపర్‌ఆక్సీక్లోరైడ్ మందును లీటర్ నీటికి రెండు మీల్లీలీటర్ల చొప్పున కలిపి మొక్క మొదలు బాగా తడిసేలా పిచికారీ చేయాలని ఏడీఆర్ ముకుందరావు తెలిపారు. ఈ సమావేశంలో శాస్త్రవేత్తలు డాక్టర్ కె.వి.రమణమూర్తి, డాక్టర్ ఎం.విశాలాక్షి, డాక్టర్ వి.గౌరి, డాక్టర్ సిహెచ్.ఎస్.రామలక్ష్మి, డాక్టర్ పి.వి.పద్మావతి, డాక్టర్ ఎ.అలివేలు పాల్గొన్నారు.