Share News

ముసురు!

ABN , Publish Date - Aug 27 , 2025 | 12:56 AM

ఉత్తర ఒడిశాకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో సోమవారం అర్ధరాత్రి నుంచి జిల్లాలో ముసురు వాతావరణం నెలకొంది. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు దఫదఫాలుగా వర్షం కురుస్తున్నది. పలు మండలాల్లో భారీ వర్షం పడగా, మిగిలిన మండలాల్లో మోస్తరు వర్షం పడింది.

ముసురు!
అనకాపల్లి వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న శారదా నది

పలు మండలాల్లో కుండపోత

లోతట్టు ప్రాంతాలు జలమయం

స్తంభించిన జన జీవనం

చెరువుల్లోకి సమృద్ధిగా వర్షం నీరు

పొంగి ప్రవహిస్తున్న గెడ్డలు, వాగులు

అనకాపల్లి, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి- న్యూస్‌ నెట్‌వర్క్‌):

ఉత్తర ఒడిశాకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో సోమవారం అర్ధరాత్రి నుంచి జిల్లాలో ముసురు వాతావరణం నెలకొంది. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు దఫదఫాలుగా వర్షం కురుస్తున్నది. పలు మండలాల్లో భారీ వర్షం పడగా, మిగిలిన మండలాల్లో మోస్తరు వర్షం పడింది. కె.కోటపాడు, చోడవరం, కశింకోట, పరవాడ మండలాల్లో 80 మిల్లీమీటర్లకు పైబడి వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువుల్లోకి సమృద్ధిగా నీరు చేరింది. నదులు, వాగులు, గెడ్డల్లో వరద ప్రవాహం పెరిగింది. ఎడ తెరిపి లేకుండా వర్షం కురవడంతో సాధారణ జనజీవనం స్తంభించింది. గ్రామీణ రహదారుల మరింత దెబ్బతిన్నాయి. వడ్డాది వద్ద పెద్దేరు నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. అనకాపల్లిలో మంగళవారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణలో వర్షం నీరు నిలిచిపోయి చెరువును తలపించింది. విజయరామరాజుపేట అండర్‌బ్రిడ్జి వద్ద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అనకాపల్లి-అచ్యుతాపురం రోడ్డులో పురాతన కల్వర్టులు శిథిలావస్థకు చేరడంతో ఈ మార్గంలో వెళ్లాల్సిన భారీ వాహనాలను పోలీసులు దారి మళ్లించారు. కాగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు రైతులకు ఎంతో మేలు చేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇప్పటికే వరినాట్లు వేసిన పొలాల్లో అదనపు నీటిని బయటకు పంపుతున్నారు. మరో రెండురోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం వుందన్న వాతావరణ శాఖ సమాచారంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్‌ విజకృష్ణన్‌ మంగళవారం అన్ని మండలాల అధికారులతో వెబెక్స్‌ నిర్వహించారు. అధిక వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే వెంటనే సహాయ చర్యలు అందించాలని ఆదేశించారు. అధిక వర్షాల వల్ల పంటలకు నష్టం వాటిల్లకుండా వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు సూచనలు అందజేయాలని చెప్పారు.

జిల్లాలో 51.8 మిల్లీమీటర్ల వర్షపాతం

జిల్లాలో మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు 51.8 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కె.కోటపాడు మండలంలో 95.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. చోడవరంలో 86.1 మిల్లీ మీటర్లు, కశింకోటలో 82.6, పరవాడలో 82.4, అనకాపల్లిలో 79, దేవరాపల్లిలో 74.9, మాడుగులలో 73, బుచ్చెయ్యపేటలో 73.4, మునగపాకలో 72.4, సబ్బవరంలో 71.2, చీడికాడలో 60.9, అచ్యుతాపురంలో 49, రావికమతంలో 48.6, రోలుగుంటలో 47.1, రాంబిల్లిలో 38.7, ఎలమంచిలిలో 37.1, మాకవరపాలెంలో 34.2, నర్సీపట్నంలో 29.6, నక్కపల్లిలో 20.8, కోటవురట్లలో 20.3, గొలుగొండలో 18.7, ఎస్‌.రాయవరంలో 18.4, నాతవరంలో 15.8, పాయకరావుపేటలో 13.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

Updated Date - Aug 27 , 2025 | 12:56 AM