ఈదురుగాలులతో వర్షం
ABN , Publish Date - May 13 , 2025 | 01:25 AM
నగరంలో పలుచోట్ల సోమవారం సాయంత్రం వర్షం కురిసింది.

విశాఖపట్నం, మే 12 (ఆంధ్రజ్యోతి):
నగరంలో పలుచోట్ల సోమవారం సాయంత్రం వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగాయి. సాయంత్రం మేఘాలు కమ్ముకున్నాయి. ఆ తరువాత ఈదురుగాలులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది. దీంతో నగరవాసులు కాస్త సేదదీరారు. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం నుంచి రెండు ---రోజులపాటు వర్షాలు పెరుగుతాయని పేర్కొంది.
సీపీఐ జిల్లా కార్యదర్శిగా రెహమాన్
25వ జిల్లా మహాసభల్లో నూతన కార్యవర్గం ఎన్నిక
విశాఖపట్నం, మే 12 (ఆంధ్రజ్యోతి):
సీపీఐ జిల్లా కార్యదర్శిగా ఎస్‌కే రెహమాన్, సహాయ కార్యదర్శులుగా కె.సత్యనారాయణ, పి.చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులుగా ఎం.పైడిరాజు, కె.సత్యాంజనేయ, ఆర్.శ్రీనివాసరావు, ఎం.మన్మథరావు, సీఎన్ క్షేత్రపాల్‌రెడ్డి, కె.వనజాక్షి, ఎస్.నాగభూషణం ఎన్నికైనట్టు పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి తెలిపారు. అల్లిపురంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలో రెండు రోజులపాటు జరిగిన జిల్లా 25వ మహాసభల్లో 33 మందితో నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైందన్నారు.
బియ్యం కార్డుల్లో మార్పులు, చేర్పులకు భారీగా దరఖాస్తులు
ఇప్పటివరకూ 2,147 రాక
విశాఖపట్నం, మే 12(ఆంధ్రజ్యోతి):
కొత్త బియ్యం కార్డులు, ఉన్న కార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం జిల్లాలో సోమవారం నాటికి 2,147 దరఖాస్తులు వచ్చాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న బియ్యం కార్డుల్లో కొత్తగా సభ్యుల పేర్లు నమోదు చేయాల్సి ఉందని 1,457 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే కొత్తగా కార్డుల కోసం 262, కార్డుల విభజనకు 168, కార్డు నుంచి పేర్ల తొలగింపునకు సంబంధించి 123 దరఖాస్తులు వచ్చాయి. బియ్యంకార్డుతో ఆధార్‌కార్డు అనుసంధానంలో తప్పుల సవరణ కోసం 112, రేషన్ దుకాణాల రెన్యువల్‌కు 13, బియ్యం కార్డులో చిరునామా మార్పునకు 10 దరఖాస్తులు రాగా ఇద్దరు బియ్యం కార్డును ప్రభుత్వానికి సరండర్ చేశారు. కొత్త కార్డులకు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు మరోసారి చేయనవసరం లేదని అధికారులు పేర్కొన్నారు.
కొత్తవలస మాస్టర్ ప్లాన్ రహదారికి లైన్ క్లియర్
విశాఖపట్నం, మే 12 (ఆంధ్రజ్యోతి):
భీమునిపట్నం మండలంలోని కొత్తవలస మాస్టర్‌ప్లాన్ రహదారిని 24 మీటర్ల వెడల్పున విస్తరించడానికి సోమవారం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొత్తవలసలో గతంలో శారదా పీఠానికి వైసీపీ ప్రభుత్వం 15 ఎకరాలు కేటాయించిన సంగతి తెలిసిందే. ఆ భూ కేటాయింపును ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. అతి కీలకమైన ఆ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయడానికి వీఎంఆర్‌డీఏ ముందుకువచ్చింది. మాస్టర్ ప్లాన్‌లో ఉన్న రహదారి నిర్మించడానికి ప్రతిపాదనలు రూపొందించింది. ఆ రహదారి ఏయే సర్వే నంబర్ల గుండా వెళుతుందో వివరిస్తూ రెండు నెలల క్రితమే ప్రకటనలు ఇచ్చింది. అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరింది. ఎవరి నుంచి ఎటువంటి అభ్యంతరాలు రాకపోవడంతో ప్రభుత్వానికి అదే విషయం నివేదించడంతో మాస్టర్ ప్లాన్ నిర్మాణం విషయంలో ముందుకు వెళ్లాలని సూచిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
-
19న డిప్యూటీ మేయర్ ఎన్నిక
జాయింట్ కలెక్టర్‌కు నిర్వహణ బాధ్యతలు
విశాఖపట్నం, మే 12 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఈ నెల 19న నిర్వహించాలని ఆదేశిస్తూ రాష్ట్ర మునిసిపల్ శాఖ డైరెక్టర్, కమిషనర్ పి.సంపత్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. కొత్త డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకునేందుకు వీలుగా జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్‌ను ఎన్నికల అధికారిగా నియమిస్తున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 19న ఉదయం 11 గంటలకు కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించాలని, ఈ మేరకు కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. డిప్యూటీ మేయర్‌గా ఉన్న జియ్యాని శ్రీధర్‌పై కూటమి కార్పొరేటర్లు గత నెల 26న జరిగిన కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గిన విషయం తెలిసిందే.