Share News

ఈదురు గాలులతో వర్షం

ABN , Publish Date - May 01 , 2025 | 01:12 AM

జిల్లాలో పలు మండలాల్లో బుధవారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు దఫదఫాలుగా వర్షం కురిసింది. ఈదురు గాలులు వీచడంతో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో గంటల తరబడి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అనకాపల్లి, కశింకోట, పరవాడ, సబ్బవరం ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున, సాయంత్రం ఈదురు గాలులతో కుండపోతగా వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.

ఈదురు గాలులతో వర్షం
కశింకోటలో కురుస్తున్న భారీ వర్షం

పలు మండలాల్లో దంచికొట్టిన వాన

లోతట్టు ప్రాంతాలు జలమయం

కూలిన చెట్టు, విద్యుత్‌ స్తంభాలు

విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

అనకాపల్లి, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి-నూస్‌ నెట్‌వర్క్‌): జిల్లాలో పలు మండలాల్లో బుధవారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు దఫదఫాలుగా వర్షం కురిసింది. ఈదురు గాలులు వీచడంతో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో గంటల తరబడి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అనకాపల్లి, కశింకోట, పరవాడ, సబ్బవరం ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున, సాయంత్రం ఈదురు గాలులతో కుండపోతగా వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. డ్రైనేజీలు పొంగడంతో రహదారులు జలమయం అయ్యాయి. అచ్యుతాపురం, ఎలమంచిలి మండలాల్లోని పలు గ్రామాల్లో ఈదురు గాలులతో భారీ వర్షం పడింది. ఇళ్లపై రేకులు లేచిపోయాయి. గొర్లెధర్మవరంలో పిడుగుపడి గేదె మృతిచెందింది. ఏటికొప్పాకలో ఈదురు గాలులకు విద్యుత్‌ వైర్లు కలవడంతో నిప్పు రవ్వలు కిందనున్న గడ్డి వాములపై పడడంతో దగ్ఢం అయ్యాయి. పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్‌.రాయవరం, కోటవురట్ల మండలాల్లో ఈదురుగాలులతో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. మామిడి తోటల్లో కాయలు నేలరాయి. మాకవరపాలెం, నర్సీపట్నం, రాంబిల్లి, చోడవరం, రావికమతం, దేవరాపల్లి, గొలుగొండ, చీడికాడ, బుచ్చెయ్యపేట, రోలుగుంట, కె.కోటపాడు మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. కాగా ఈ వర్షం రబీ పంటలకు, సరుగుడు తోటలకు మేలు చేస్తుందని రైతులు చెబుతున్నారు.

సబ్బవరంలో 54 మి.మీ.ల వర్షం

జిల్లాలో బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 21 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సబ్బవరం మండలంలో 54 మిల్లీమీటర్లు కురిసింది. నక్కపల్లి మండలంలో 53.2, అచ్యుతాపురంలో 51.2, మునగపాకలో 47.5, ఎస్‌.రాయవరంలో 42.6, అనకాపల్లిలో 28.2, పాయకరావుపేటలో 38.2, కశింకోటలో 28.2, కోటవురట్లలో 28.8, పరవాడలో 23.4, రాంబిల్లిలో 22, ఎలమంచిలిలో 19.4, రావికమతంలో 13.4, మాడుగులలో 13.4, కె.కోటపాడులో 11.2, చీడికాడ 3.6, నర్సీపట్నంలో 8.2, చోడవరంలో 10, మాకవరపాలెంలో 8.4, బుచ్చెయ్యపేటలో 5.4, దేవరాపల్లిలో 4.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

Updated Date - May 01 , 2025 | 01:12 AM