Share News

ఈదురు గాలులతో వర్షం

ABN , Publish Date - Apr 16 , 2025 | 12:36 AM

వాతావరణంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వర్షం కురిసింది. మాడుగుల, చోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. పాయకరావుపేట, ఎలమంచిలి, పెందుర్తి నియోజకవర్గాల్లో మోస్తరు వర్షం కురిసింది.

ఈదురు గాలులతో వర్షం
మాడుగుల మండలం ఘాట్‌రోడ్డు జంక్షన్‌లో కురుస్తున్న వర్షం

చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో భారీగా కురిసిన వాన

మిగిలిన చోట్ల మోస్తరు జల్లులు

రబీ పంటలకు దోహదం

గాలుల కారణంగా పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

వాతావరణం చల్లబడడంతో జనం ఉపశమనం

(ఆంధ్రజ్యోతి- న్యూస్‌నెట్‌వర్క్‌)

వాతావరణంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వర్షం కురిసింది. మాడుగుల, చోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. పాయకరావుపేట, ఎలమంచిలి, పెందుర్తి నియోజకవర్గాల్లో మోస్తరు వర్షం కురిసింది. మిగిలినచోట్ల ఆకాశం మేఘావృతమైందే తప్ప వర్షం పడలేదు. కాగా మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీక్షణంగా కాసింది. వేడి గాలులు సైతం వీచడంతో రహదారులపై జనసంచారం బాగా తగ్గిపోయింది. ఎండవేడి, ఉక్కపోతతో జనం ఇబ్బంది పడ్డారు. అయితే మధ్యాహ్నం రెండు గంటల తరువాత నుంచి వాతావరణం క్రమేపీ మారిపోయింది. ఆకాశం మేఘావృతమై ఈదురు గాలులు వీచాయి. కొద్దిసేపట్లోనే వర్షం మొదలైంది. ఇదే సమయంలో గాలులు వీచడంతో పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆయా మండలాల్లో అర్ధ గంట నుంచి గంటపాటు మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వాతావరణం చల్లబడడంతో జనం ఉపశమనం చెందారు. ఈ వర్షం అపరాలు, కూరగాయలు, నువ్వు, వేరుశనగ పంటలతోపాటు కార్సీ చెరకు, సరుగుడు తోటలకు ఉపయోగపడుతుందని రైతులు చెబుతున్నారు.

రోలుగుంట మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. మండల కేంద్రంలో బీఎన్‌ రోడ్డు వర్షం నీటితో పంట కాలువను తలపించింది. ప్రధాన రహదారి జలమయం అయ్యింది. ద్విచక్ర వాహనదారులు ఇబ్బంది పడ్డారు. చోడవరం మండలంలో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. కె.కోటపాడు మండలంలోని పలు గ్రామాల్లో మధ్యాహ్నం సుమారు 40 నిమిషాలపాటు వర్షం కురిసింది. మాడుగుల మండలంలో ఈదురు గాలులతో గంటపాటు మోస్తరు వర్షం పడింది. గాలుల కారణంగా కొన్నిచోట్ల విద్యుత్‌ వైర్లు తెగిపోయి సరఫరా నిలిచిపోయింది. దేవరాపల్లి మండలంలో ఈదురు గాలులతో మోస్తరు వర్షం పడింది. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. చీడికాడ మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో భారీ వర్షం కురిసింది.

పాయకరావుపేట మండలంలో ఈదురు గాలులతో మోస్తరు వర్షం పడింది. ఉదయం నుంచి ఎండ వేడి, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు, వాతావరణం చల్లబడడంతో ఊరట చెందారు. నక్కపల్లి మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం సాయంత్రం చిరుజల్లులు పడ్డాయి. ఎలమంచిలి పట్టణంలో మంగళవారం అర్ధగంటపాటు మోస్తరు వర్షం కురిసింది. సబ్బవరం మండలంలోని పలు గ్రామాల్లో అర్ధగంటపాటు గాలులతో వర్షం కురిసింది. కోటవురట్ల మండలంలో మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో మోస్తరు వర్షం పడింది.

Updated Date - Apr 16 , 2025 | 12:36 AM