Share News

మన్యంలో వర్షం

ABN , Publish Date - Jul 19 , 2025 | 10:57 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలో శనివారం మధ్యాహ్నం నుంచి వర్షాలు కొనసాగుతున్నాయి. గత రెండు రోజులు తెరిపించినప్పటికీ ద్రోణి ప్రభావంతో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి.

మన్యంలో వర్షం
అరకులోయలో కురుస్తున్న వర్షం

జన జీవనానికి అంతరాయం

ఉదయం ఎండ.. సాయంత్రం వాన

వెలవెలబోయిన ముంచంగిపుట్టు సంత

పాడేరు, జూలై 19 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలో శనివారం మధ్యాహ్నం నుంచి వర్షాలు కొనసాగుతున్నాయి. గత రెండు రోజులు తెరిపించినప్పటికీ ద్రోణి ప్రభావంతో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. మరో రెండు రోజులు వర్షాలు కొనసాగుతాయని చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం ప్రకటించింది. తాజా వర్షాలకు జన జీవనానికి అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం తెరిపిస్తేనే ఖరీఫ్‌ వ్యవసాయ పనులకు అనుకూలంగా ఉంటుందని రైతులు అంటున్నారు. అలాగే ఉదయం, మధ్యాహ్నం తీవ్రమైన ఎండకాసిన తర్వాత నుంచి వర్షం కురుస్తుండడంతో వృద్ధులు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని వైద్యులు అంటున్నారు.

తగ్గని గరిష్ఠ ఉష్ణోగ్రతలు

ఏజెన్సీలో తరచూ వర్షాలు కురుస్తున్నప్పటికీ గరిష్ఠ ఉష్ణోగ్రతలు మాత్రం తగ్గడం లేదు. దీంతో శనివారం కొయ్యూరులో 36.9, పాడేరులో 36.1, అరకులోయలో 33.0, జి.మాడుగులలో 31.9, పెదబయలులో 31.6, హుకుంపేటలో 30.6, జీకేవీధిలో 30.4, డుంబ్రిగుడలో 30.3, అనంతగిరిలో 29.9, ముంచంగిపుట్టులో 29.0, చింతపల్లిలో 28.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ముంచంగిపుట్టులో

మండలంలో శనివారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ ఠారెత్తించింది. మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడడంతో మండల కేంద్రంలో జరిగిన వారపు సంత త్వరగతిన ముగిసింది. సంతకు వచ్చిన వినియోగదారులు వెనక్కి వెళ్లిపోయారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలోనే సంత ప్రాంగణం వినియోగదారులు లేక వెలవెలబోయింది. వ్యాపారం ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో సంత వ్యాపారులు తీవ్ర నిరాశ చెందారు. ఏకధాటిగా కురిసిన వర్షానికి 23 పంచాయతీల పరిధిలో పలుచోట్ల వాగులు, వంకలు, గెడ్డలు వరదనీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రహదారులు చిత్తడైపోయాయి. ఉరుములు, మెరుపులకు విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Updated Date - Jul 19 , 2025 | 10:57 PM