ముసురు
ABN , Publish Date - Aug 19 , 2025 | 01:03 AM
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రభావంతో నగరంలో వరుసగా మూడో రోజు వర్షాలు కొనసాగాయి.
కొనసాగుతున్న వర్షాలు
పొంగిన గెడ్డలు
పలుచోట్ల రోడ్లపైకి నీరు
అక్కడక్కడా కుంగిన రహదారులు
బీచ్‌లో కూలిన రక్షణగోడ
విశాఖపట్నం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి):
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రభావంతో నగరంలో వరుసగా మూడో రోజు వర్షాలు కొనసాగాయి. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో గెడ్డలు, మురుగుకాల్వలు పొంగాయి. పూర్ణామార్కెట్ పరిసరాల్లోని వెలంపేట, కల్లుపాకలు, రామకృష్ణా జంక్షన్, కొబ్బరితోట, చిలకపేటల్లో రోడ్లపై నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. పాఠశాలలు, కళాశాలలకు ముందుగానే సెలవు ప్రకటించడంతో విద్యార్థులు ఇళ్లకు పరిమితమయ్యారు.
కాగా వర్షాలు కొనసాగడంతో కొండవాలు ప్రాంతాలవాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పెదగదిలిలో ఒక ఇంటి పిట్టగోడ కూలి పక్కనే ఉన్న రేకులషెడ్‌పై పడింది. ఆ సమయంలో రేకుల షెడ్‌లో నిద్రిస్తున్న ఒకరు గాయపడ్డారు. అలాగే పెదగదిలి సంజీవ్‌నగర్ కాలనీలో ఇంటికి ఆనుకుని మట్టి జారిపడింది. అయితే ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. సిరిపురం జంక్షన్‌లో వీఎంఆర్‌డీఏ నిర్మించిన డెక్ భవనం సమీపాన రోడ్డు కుంగింది. ఇంకా బీచ్‌రోడ్డులో వరుణ్ పార్కుకు ఆనుకుని నిర్మించిన రక్షణ గోడ కొంతమేర కూలింది.
కాగా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాకు ఆనుకుని రెండు రోజులుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం సోమవారం ఉదయం తీవ్ర అల్పపీడనంగా, సాయంత్రానికి వాయుగుండంగా బలపడింది. దీంతో సముద్ర అలలు తీరం దిశగా ఎగిసిపడుతున్నాయి. ఈ ఏడాది రుతుపవనాల ప్రవేశం తరువాత మూడు రోజులపాటు వర్షాలు కురవడం ఇదే తొలిసారి. ఒక మోస్తరు నుంచి భారీవర్షాలు కురవడంతో జిల్లాలోని నాలుగు గ్రామీణ మండలాల్లో ఖరీఫ్ సీజన్‌కు అనుకూల వాతావరణం ఏర్పడింది. చెరువులు నిండడంతో రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. నగరంలో భూగర్భ జలాలు రీచార్జి కావడంతో బోర్లపై ఆధారపడేవారంతా ఊపిరిపీల్చుకున్నారు. వాయుగుండం నేపథ్యంలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది.
సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నమోదైన వర్షపాతం
కేంద్రం మిల్లీమీటర్లు
వాల్తేర్ తుఫాన్ హెచ్చరిక కేంద్రం 37.8
అక్కిరెడ్డిపాలెం (పెందుర్తి) 31.5
సీతమ్మధార 31.0
మహారాణిపేట 28.5
గాజువాక 25.25