రైల్వే జోన్‌కు అధికారులు
ABN , Publish Date - Aug 07 , 2025 | 01:21 AM
విశాఖ కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు త్వరలో అధికారులు నియామకం కానున్నారు. ఇప్పటికే జనరల్ మేనేజర్‌గా సందీప్ మాధుర్‌ను నియమించిన కేంద్రం...ఆయనతో కలిసి పనిచేసేందుకు వివిధ విభాగాల అధిపతులను పంపడానికి చర్యలు చేపడుతోంది. ఇదే పనిపై ఢిల్లీ వెళ్లిన జీఎం సందీప్ మాధుర్ జోన్ కార్యాలయం ఏర్పాటుచేసుకుంటే ఏయే విభాగాల అధికారులు కావాలో స్పష్టంగా అక్కడి పెద్దలకు వివరించి వచ్చారు.
త్వరలోనే నియామకం
తదనంతరం ఆస్తుల పంపకం, సిబ్బంది బదిలీలు
ఢిల్లీ వెళ్లి వచ్చిన జీఎం సందీప్ మాధుర్
హెచ్‌ఓడీల కేటాయింపుపై చర్చలు
ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ నియామకానికి గ్రీన్‌సిగ్నల్
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖ కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు త్వరలో అధికారులు నియామకం కానున్నారు. ఇప్పటికే జనరల్ మేనేజర్‌గా సందీప్ మాధుర్‌ను నియమించిన కేంద్రం...ఆయనతో కలిసి పనిచేసేందుకు వివిధ విభాగాల అధిపతులను పంపడానికి చర్యలు చేపడుతోంది. ఇదే పనిపై ఢిల్లీ వెళ్లిన జీఎం సందీప్ మాధుర్ జోన్ కార్యాలయం ఏర్పాటుచేసుకుంటే ఏయే విభాగాల అధికారులు కావాలో స్పష్టంగా అక్కడి పెద్దలకు వివరించి వచ్చారు.
జోన్ కార్యాలయానికి అవసరమైన స్థలాన్ని ఎంపీ శ్రీభరత్ చొరవతో వీఎంఆర్‌డీఏకు చెందిన ‘ది డెక్’’లో కేటాయించిన సంగతి తెలిసిందే. దీనిపై ఎంవోయూ జరిగిన వెంటనే ఇంటీరియర్ పనులు ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈలోగా జోన్‌కు సంబంధించిన గెజిట్, ఆపరేషన్ తేదీని ప్రకటింపజేసేందుకు కూటమి నాయకులు ఢిల్లీలో ప్రయత్నిస్తున్నారు.
ఐదేళ్లు ఆగిన జోన్ పనులు
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైల్వే జోన్ పనులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వస్తున్నారు. రైల్వే జోన్‌కు అవసరమైన భూమిని కేటాయించడానికి వైసీపీ పెద్దలు ఐదేళ్లు తాత్సారం చేశారు. అదిగో..ఇదిగో అంటూ కాలయాపన చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే ముడసర్లోవ భూములు రైల్వే శాఖ పేరిట రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్ చేసి అప్పగించింది. ఆ భూముల్లో ఆక్రమణదారులు అడ్డం పడితే వారిని కూడా తప్పించి, అక్కడ జోన్ కార్యాలయం పనులు ప్రారంభింపజేసింది. వాటికి ప్రధాని మోదీతోనే శంకుస్థాపన చేయించారు. అన్నీ ఉన్నా అధికారులను ఇవ్వడం లేదని గుర్తించి జోన్‌కు జనరల్ మేనేజర్‌ను నియమింపజేశారు. ఇప్పుడు ఆయనకు అవసరమైన టీమ్‌ను సమకూర్చే ప్రయత్నంలో ఉన్నారు. జోన్ నిర్వహణకు 12 విభాగాలు కీలకం. జనరల్ అడ్మినిస్ట్రేషన్, ఆపరేషన్లు, కమర్షియల్, సిగ్నల్ అండ్ టెలికం, స్టోర్స్, పర్సనల్, ఫైనాన్స్, మెకానికల్, ఎలక్ర్టికల్, సివిల్ ఇంజనీరింగ్, పబ్లిక్ రిలేషన్స్, సెక్యూరిటీ, ఎలక్ర్టికల్ జనరల్ విభాగాలు ఉంటాయి. వీటికి విభాగాధిపతులను నియమిస్తే వారి కింద పనిచేయడానికి వివిధ డివిజన్లలో పనిచేస్తున్న వారిని కేటాయిస్తారు. వీటిలో మళ్లీ తక్షణ అవసరంగా జనరల్ అడ్మిన్, మెకానికల్, ఎలక్ర్టికల్, సివిల్ ఇంజనీరింగ్, పబ్లిక్ రిలేషన్స్ అధికారులు కావాలని జీఎం ఢిల్లీ పెద్దలను కోరారు. వారిని కేటాయిస్తే లోకో షెడ్లు, కోచ్ కేర్ సెంటర్లు, వ్యాగన్ వర్క్‌షాపుల పనులు ప్రారంభమవుతాయి. ప్రధానంగా ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ నియామకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. విభాగాధిపతులు వస్తే ఆస్తుల పంపకం, సిబ్బంది బదిలీలు వంటివి ప్రారంభమవుతాయని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.